
తిరుపతి, అక్టోబర్ 22, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కమిటీ సభ్యురాలిగా పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలు, సేవల ప్రగతి, ఎదురవుతున్న సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. మహిళల భద్రత, బాలల ఆరోగ్యం, పోషణ, విద్య, అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం, వికలాంగుల పునరావాసం వంటి అంశాలను లోకం నాగ మాధవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై అధికార యంత్రాంగం మరింత సున్నితంగా స్పందించాలని, జిల్లా స్థాయి సమన్వయం పెంచాలని సూచించారు. అనంతరం 22-01-2026న తిరుపతిలో టీటీడీ ఈఓతో పాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో లోకం నాగ మాధవి పాల్గొని, టీటీడీ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల కోసం అమలవుతున్న సేవలు, పథకాలపై సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార పంపిణీ, విద్యా సహాయం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం టీటీడీ నిర్వహిస్తున్న బలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహ్యాబిలిటేషన్ ఫర్ ద డిసేబుల్డ్ (BIRRD) బేబీ హాస్పిటల్‌ను ఆమె సందర్శించి, అక్కడ చిన్నారులకు అందుతున్న ఆధునిక వైద్య చికిత్సలు, ప్రత్యేక వైద్య పరికరాలు, పునరావాస సేవలను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు అందుతున్న నాణ్యమైన వైద్య సేవలను ఆమె ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత విస్తృత చికిత్సలు, ఆధునిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం పెంచాల్సిన అవసరం ఉందని టీటీడీ అధికారులకు సూచించారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తానని లోకం నాగ మాధవి తెలిపారు.









