మంగళగిరిలో ఘనంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా ప్రసన్నకుమార్ బాధ్యతల స్వీకారం

మంగళగిరి, జనవరి 7, (జనస్వరం) : మంగళగిరిలోని ఏపీ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన నల్లే ప్రసన్నకుమార్ MSME డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న ప్రసన్నకుమార్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి బోర్డు డైరెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని పలువురు వ్యాఖ్యానించారు. జనసేన పార్టీలో సోషల్ మీడియా విభాగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, తనలాంటి సామాన్య కార్యకర్తకు ఇంతటి బాధ్యతలు అప్పగించడం జనసేన పార్టీ గొప్పతనానికి నిదర్శనమన్నారు. అంకితభావంతో, నిస్వార్థంగా పని చేస్తే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. MSME రంగాన్ని మరింత బలోపేతం చేసి యువతకు, సామాన్యులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకు ఈ అవకాశం కల్పించిన జనసేనాని పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే ప్రతి కార్యకర్తకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కరికాల జనసేన యూత్ మరియు గొర్రిపూడి గ్రామ కూటమి నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  ధాన్య సేకరణలో ఎక్కడ జాప్యం జరగకూడదు: మంత్రి నాదెండ్ల మనోహర్