విశ్వం స్కూల్లో ఘనంగా వినియోగదారుల వారోత్సవ వేడుకలు

తిరుపతి, డిసెంబర్ 20 : జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా తిరుపతిలోని విశ్వం టాలెంట్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన వినియోగదారుల క్లబ్ ఆధ్వర్యంలో“ వినియోగదారుడా మేలుకో – నీ హక్కులను తెలుసుకో” అనే నినాదంతో విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన అవగాహనా సమావేశంలో వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విశ్వం విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి మాట్లాడుతూ, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాణ్యమైన వస్తువులు, సేవలను పరిశీలించే దృష్టి కలిగి, అవగాహనతో కూడిన విజ్ఞానవంతులైన వినియోగదారులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశ్వం స్కూల్ వినియోగదారుల క్లబ్ నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు పి. రాజారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులుగా నష్టం లేదా మోసం జరిగినప్పుడు వెంటనే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, అలాగే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, వినియోగదారుల ఫోరంలో కేసులు దాఖలు చేయడం వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు మాట్లాడుతూ, వినియోగదారుల సంక్షేమం, పరిరక్షణ, హక్కులపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో ప్రతి విద్యార్థి భాగస్వాములయ్యేలా ప్రతి పాఠశాల యాజమాన్యం కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యజమాన్యాల సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఆర్. శ్రీధర్ రెడ్డి, బి. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో ప్రతి పాఠశాలలో వినియోగదారుల క్లబ్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు వినియోగ విజ్ఞానం, నైపుణ్యాలను అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

తూనికలు–కొలతల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మస్తానయ్య మాట్లాడుతూ, తూనికలు, కొలతలలో జరిగే మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం. శ్రీనివాసులు, ప్రతినిధులు దాసముని రెడ్డి, దేవేంద్ర, ఉప తహసీల్దార్లు జయరాజ్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు “వినియోగ విద్య బోధన” అనే చిరు పుస్తకాన్ని అధికారుల చేతుల మీదుగా విడుదల చేశారు.

See also  సమగ్ర వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచుకోవాలి - ఎమ్మెల్యే మాధవి