కొండపల్లి స్కూల్ లో MHPS ఆధ్వర్యంలో 69వ అంబేద్కర్ వర్ధంతి నివాళులు

కనగానపల్లి, అక్టోబర్ 7, (జనస్వరం) : కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 69వ డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. కమిటీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక్క వర్గానికే చెందిన వ్యక్తి కాదని, ప్రపంచం గర్వించదగ్గ భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు, హక్కులు, విధులను స్పష్టంగా వివరించి సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. ఆయన చూపిన మార్గం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. భారతదేశంలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని నాయకులు గుర్తు చేశారు. విద్యనే నిజమైన ఆయుధమని ప్రజలకు బోధించి, చదువు ద్వారా సమాజాన్ని మారుస్తానన్న దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగారని తెలిపారు. మహిళా హక్కులు, కార్మిక వర్గ రక్షణ, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం వంటి విలువలను రాజ్యాంగంలో స్థిరపరిచిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షులు కాలువపల్లి నాగన్న, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రాము, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం, రామచంద్రతో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

See also  పుట్టపర్తి నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు