గ్రంథాలయాలు సామాజిక చైతన్య కేంద్రాలు : డాక్టర్ వి.ఆర్ రాసాని

– తిరుపతిలో అలరించిన కవిసమ్మేళనం

తిరుపతి, నవంబర్ 16, జనస్వరం : పౌర గ్రంథాలయాలను సక్రమంగా వినియోగించుకుంటే సామాజిక చైతన్య కేంద్రాలుగా విలసిల్లుతాయని ప్రముఖ సాహితీవేత్త, ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ రాసాని వెంకట్రామయ్య అన్నారు.
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక అన్నమయ్య కూడలిలోని గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయంలో ఆదివారం కవిసమ్మేళనం నిర్వహించారు. ప్రజా కళావేదిక వ్యవస్థాపకులు అరవ జయపాల్, ప్రథమశ్రేణి గ్రంథాలయాధికారి జె. శివ ప్రసాద్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి.ఆర్. రాసాని హాజరై మాట్లాడారు. విశిష్ట అతిథులుగా శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ డి. యువశ్రీ, ప్రముఖ కవి, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాసాని మాట్లాడుతూ, పుస్తకమే గురువు, స్నేహితుడు, తల్లి, తండ్రి అన్నారు. సామాజిక జీవన మార్గదర్శి, జ్ఞానోపదేశం చేసే గురువు లాంటిదన్నారు. ఈ సందర్బంగా “ఎదురీత అస్త్రమైతే” అనే స్వీయ కవితను రాసాని వినిపించారు. డాక్టర్ డి. యువశ్రీ మాట్లాడుతూ జ్ఞానమే నిజమైన సంపద అన్నారు. ఆలోచనల విస్తరణకు, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. డిజిటల్ గ్రంథాలయాల యుగంలో కూడా ముద్రిత అక్షరాలు, పుస్తకాల ప్రాధాన్యత తగ్గలేదన్నారు. గ్రంథాలయాల నేపథ్యం మానవ నాగరికత చరిత్రతో ముడిపడి ఉందన్నారు. మనిషి జ్ఞానాన్ని, అనుభవాన్ని భద్రపరచాలనే అవసరం గ్రంథాలయాల రూపానికి కారణమైందన్నారు. గ్రంథాలయం కేవలం పుస్తకాలున్న స్థలం మాత్రమే కాదని, జ్ఞానానికి ఆలయం, విద్యకు వేదిక, సంస్కృతికి నిలయమని వివరించారు. మన పూర్వీకులు పుస్తకాన్ని దేవతగా భావించారని పేర్కొన్నారు. అజ్ఞానం నుంచి మనలను జ్ఞానానికి తీసుకెళ్లగలిగే ఏకైక మార్గం పుస్తకమేనని నిర్దేశించారని చెప్పారు. కవి గుత్తా హరిసర్వోత్తమ నాయుడు మాట్లాడుతూ, పుస్తకమున్నచోట గొప్ప వెలుగు వుంటుందన్నారు. నాగరికతకు గుర్తు అక్షర జ్ఞానమే నన్నారు. గ్రంథాలయాలు మన జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. చదువుకునే అలవాటును పెంచడంతోపాటు మన ఆలోచనలను విస్తరింపజేసి వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయన్నారు. కవి అరవ జయపాల్ మాట్లాడుతూ, పుస్తక అధ్యయనంతోనే సామాజిక చైతన్యం సాధ్యమన్నారు. సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించేది చదువు మాత్రమేనన్నారు.
అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన కవులు వారి కవిత్వాలు ఆలపించగా, జానపద కళాకారులు పాటలతో కార్యక్రమాన్ని రంజింపచేశారు. అనంతరం గ్రంధాలయాధికారి జె. శివ ప్రసాద్ కవులు జానపద కళాకారులందరినీ దుశాలువ, మేమొంటోలతో సన్మానించారు. చివరగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన కవులందరినీ సన్మానించడం చాల సంతోషంగా వుందన్నారు.

See also  కూచిపూడి కళాకేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా రంగ ప్రవేశం

అలరించిన కవి సమ్మేళనం :

ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ కవి గుత్తా హరి సర్వోత్తమ నాయుడు అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ విఆర్ రాసాని తొలుత కవితా గానం చేశారు. రాసాని (ఎదురీతే అస్త్రమైతే), డాక్టర్ కొత్వాలు అమరేంద్ర (అక్షరం), జి. సుబ్రమణ్యం (గ్రంథాలయం), కరణం విమల (మరో రోజు), రాళ్లపల్లి రజని (ఎగిరే చిలకమ్మా), టి. రవీంద్రబాబు (జ్ఞానాలయం), సోము ఉమాపతి (ఇది ఒక ఆలయం), కరణం నేక్షిత (ఇటుకనవుతాను), డాక్టర్ గోపాల్ (అమ్మ మనసు), కృష్ణకుమారి (జానపదం) కవితలు చదివి వినిపించారు. సామాజిక చైతన్య కవితలతో ఎంతగానో అలరించారు.