తాత్త్విక ఔషధంతో సమస్యలు తొలగించుకోవచ్చు : డాక్టర్ ఉమర్ అలీషా

తిరుపతి, నవంబర్ 16, జనస్వరం :  ఆధ్యాత్మిక తాత్త్విక ఔషధం ద్వారా సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, తిరుపతి – వసంత్ నగర్ శాఖ నిర్వహణలో జరిగిన కార్తీక మాసం ఆధ్యాత్మిక జ్ఞాన మహాసభలో పాల్గొన్న పీఠాధిపతి ఉమర్ అలీషా మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో ఎన్నో అపజయాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా విజయాన్ని సాధించాలి అనే పట్టుదలతో ప్రయత్నిస్తే భగవంతుని కృపతో విజయాలను సాధించవచ్చు. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకున్నట్లయితే సమాజంలో సుఖసంతోషాలు ఏర్పడి, శాంతి సుస్థిరతులు కలుగుతాయని అన్నారు. మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్ధంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవాలి అంటే శరీర తత్వానికి మంత్రసాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మ తత్వానికి ధ్యాన సాధన అనే త్రయీ సాధన ఆచరించాలని ప్రబోధించారు. ఆధునిక విజ్ఞానం అయిన కృత్రిమ మేధాశక్తి ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ కూడా మానవ మేధాశక్తిని నిర్లక్ష్యం చేయకుండా, మెదడుకు పదును పెట్టుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ జొన్నవిత్తుల శ్రీరామ చంద్ర మూర్తి మాట్లాడుతూ ఈ పీఠం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక బోధన జరుగుతుందని అన్నారు. మరొక అతిథి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పరీక్షా నియంత్రణ అధికారి, ఆచార్య ఏ. సచ్చిదానందమూర్తి మాట్లాడుతూ సద్గురు మూర్తి యొక్క బోధనలు పామరులకు సైతం అవగాహన అయ్యేవిధంగా ఉండి, అందరూ ఆచరించే విధంగా ఉంటున్నాయని, ఈ తత్వాన్ని అందరూ అనుసరించాలని సూచించారు. మరొక అతిథి శ్రీ డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సర్వమత సమానత్వాన్ని తెలియజేస్తున్న ఈ జ్ఞాన మార్గాన్ని అందరూ తెలుసుకోవాలని అన్నారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న శ్రీ కృష్ణ స్వామి మాట్లాడుతూ వేదాంత తత్వాన్ని ఈ పీఠ సద్గురుమూర్తి సమన్వయపరిచి బోధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హంసిని శ్రీ నృత్య ప్రదర్శన, తాత్విక బాలవికాస్ చిన్నారులు, తాత్విక యువవికాస్ బృందం నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆనందింపజేశాయి. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేద మహిళలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించడం జరిగింది. కార్యక్రమంలో అశేషంగా పాల్గొన్న ప్రజలందరికీ పీఠాధిపతి ఉమర్ ఆలీషా దర్శన, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ ఎన్.టి.వి. ప్రసాద్ వర్మ, అవధాని ఉమామహేశ్వరరావు, నరసింహ వర్మ, శ్రీనివాస్, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

See also  ఉపాధ్యాయులపై బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించిన మదనపల్లె జనసేన నాయకులు