
నెల్లూరు, అక్టోబర్ 16, (జనస్వరం) : నెల్లూరు బలిజ భవన్‌లో ఆదివారం నిర్వహించిన కాప్స్ రాక్స్ కార్తీకమాస వనభోజనాలు ఘనంగా జరిగాయి. వేలాదిగా బలిజ సమాజం పాల్గొన్న ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రుద్రహోమం, శివలింగాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిస్ఫూర్తిని నింపాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ దంపతులు బలిజ భవన్ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో కోటి రూపాయలు సొంత నిధుల నుంచి, మరో కోటి రూపాయలు సిఎస్ఆర్ నిధుల నుంచి విడుదల చేయనున్నట్టు తెలిపారు. సమాజ అభివృద్ధికి ఐక్యత ఎంతో కీలకమని చెప్పారు.
మునుపటి పాలనలోనే మూడు ఎకరాలు 20 సెంట్ల ప్రభుత్వ భూమిని బలిజ భవన్ కోసం కేటాయించడంతో పాటు కోటి రూపాయల ఫండ్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో పేదల వివాహాలు, శుభకార్యాలు జరుపుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కాప్ రాక్స్ నెల్లూరు జిల్లా అడ్మిన్ పసుపర్తి కిషోర్ ఆధ్వర్యంలో జరిగగా, బావిశెట్టి కిషోర్, గునుకుల కిషోర్, నాగళ్ళ కృష్ణ, పవన్ కుమార్, రమేష్, జగదీష్, కోటేశ్వరరావు, పీఠాధిపతి రాజరాజేశ్వరానంద స్వామితో పాటు అనేక మంది బలిజ బంధువులు పాల్గొన్నారు.









