
అనంతపురం, నవంబర్ 14, జనస్వరం : జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 14న, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి అన్నారు. పిల్లల హక్కులు, విద్య, సంక్షేమంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. నెహ్రు వేషధారణతో వచ్చిన గొర్తి వెంకట్ కు విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం కక్కలపల్లి ప్రాథమిక పాఠశాలలో చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలను అమితంగా ప్రేమించేవారన్నారు. అందుకే ఆయనను ‘చాచా నెహ్రూ’ అని పిలుస్తామన్నారు. గతంలోభారతదేశంలో గతంలో నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారని, ఇది ఐక్యరాజ్యసమితి బాలల దినోత్సవానికి అనుగుణంగా ఉండేదని చెప్పారు. 1964లో నెహ్రూ మరణం తర్వాత, పిల్లల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నివాళిగా ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 14కి మార్చారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రపంచ బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న జరుపుకుంటాయన్నారు. ఇది ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ప్రకటనను గుర్తుచేస్తుందన్నారు. అనంతరం పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.









