ఆర్డిటి ఎఫ్‌సీఆర్‌ఏ మంజూరు చేయాలని డిమాండ్ 

అనంతపురం, ఆగష్టు 18, (జనస్వరం) : అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం ఆర్డిటి ఎఫ్‌సీఆర్‌ఏ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డిటి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ కళ్యాణమండపం నుండి ప్రారంభమైన ర్యాలీకి వందలాది మంది చేరడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. నినాదాలతో ఊరేగుతూ వచ్చిన అభిమానులు అనంతరం ఎమ్మార్వో కార్యాలయాన్ని చేరుకున్నారు. అక్కడ ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని అందజేస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్‌సీఆర్‌ఏ మంజూరు చేయాలని కోరారు.

అభిమానులు మాట్లాడుతూ, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వేలాది మందికి అండగా నిలుస్తున్న ఆర్డిటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ ఆమోదం అత్యవసరమని పేర్కొన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ లభిస్తే మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందించగలమని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరితగతిన స్పందించాలని డిమాండ్ చేశారు.

ఈ ర్యాలీలో రాచానపల్లి ఎం. సుబ్రహ్మణ్యం, చిన్నకుంట జై సి నారాయణ, ఎన్‌ఎన్ కుంట తిరుపాల్, రామాంజనేయులు, పెద్దక్క, మన్నీల గోపాల్, తేజ, వెంకట్రాముడు, నల్లప్ప, రాచనాపల్లి భీమన్న, సోముల దొడ్డి శ్రీరాములు, ఉప్పరపల్లి తనుజ, కందుకూరు జ్యోతి, ఆకుతోటపల్లి డేవిడ్, నారాయణపురం సుష్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లో విశేష ఆసక్తి కలిగించిన ఈ ర్యాలీ శాంతియుతంగా సాగింది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆర్డిటి ఎఫ్‌సీఆర్‌ఏ మంజూరుకు తమ మద్దతు తెలిపారు. అభిమానులు తీసుకొచ్చిన ఫ్లకార్డులు, బేనర్లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం విజయవంతం కావడంపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

See also  పెన్నా వంతెన పూర్తయ్యేదెప్పుడో ? నెల్లూరు జిల్లా జనసేన నాయకులు