
కావలి ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి సీఎం జగన్ పారదర్శకత నిరూపించుకోవాలి
– జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
⇨ రాష్ట్రవ్యాప్తంగా ఉండే పేదలకు ఇళ్ళ స్థలం కేటాయించడం తన ఆశయం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారని, ఆ ఆశయాన్ని జనసేన పార్టీ తరఫున తాము స్వాగతిస్తున్నామన్నారు జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి.
⇨ నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఒక ప్రక్క సీఎం ఆశయం ఒకలా ఉంటే, మరో ప్రక్క ఎమ్మెల్యేల ఆశయాలు వేరేలా ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన హౌస్ ఫర్ ఆల్ అవినీతి కంటే కొన్ని వందల రెట్ల అవినీతికి ఇప్పటి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని విమర్శించారు.
⇨ జనసేన పార్టీతో సహా మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తుంటే ఆధారాలు చూపించండి అంటూ రంకెలేసే అధికార పార్టీ నాయకులకు కావలి భూదందాలో జరిగిన అవినీతి ఆధారాలతో సహా అన్ని పత్రికలు, మీడియా ఛానెళ్ళు ఫోకస్ చేసినా కూడా కనిపించట్లేదా, గుడ్డి వారైపోయారా అంటూ ఆయన ప్రశ్నించారు.
⇨ కావలి ప్రాంతంలో గత ప్రభుత్వంలో టిడ్కో ద్వారా సేకరించిన 97 ఎకరాలకు తోడు బుడమకుంట ఇందిరమ్మ కాలనీ వద్ద 35 ఎకరాలు కలిపి ప్రభుత్వానికి నష్టం లేకుండా 132 ఎకరాలను పేదలకు పంచేందుకు సబ్ కలెక్టర్ శ్రీధర్ సిద్ధం చేస్తుంటే ఆయన్ను ఆకస్మిక బదిలీ చేయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
⇨ ఇదే అంశంలో ఆర్డీవో సుధాకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 3 రోజులకే సెలవు పై వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
⇨ రెండవ ప్రతిపాదన క్రింద బుడమగుంట ఇందిరమ్మ కాలనీకి అతి సమీపంలో రైతులు ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధపడితే కమీషన్ సెట్ కాలేదని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు అడ్డుపడింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
⇨ ఇక మూడవ ప్రతిపాదన క్రింద ముసునూరు ప్రాంతం వద్ద ఎమ్మెల్యే తన బినామీలతో జూలై లో రిజిస్టర్ చేయించిన ఎకరా 10 నుండి 12 లక్షల రూపాయలు విలువ చేసే భూములను 59 లక్షలకు ఫైనల్ చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా అని అన్నారు.
⇨ ఈ అవినీతిని అడ్డుకునే ప్రయత్నం చేసిన అప్పటి కలెక్టర్ మిరియాల వెంకట శేషగిరిబాబు ని ఘోరంగా అవమానించి సెలవు పై వెళ్లేలా చేసి అక్రమ బదిలీ చేయించిన విషయం జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా అని ఆయన అన్నారు.
⇨ అటు తర్వాత జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ బదిలీ కావడం, నుడా వైస్-ఛైర్మన్ డాక్టర్ నవ్య సెలవుకి దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఈ వైసీపీ వారు ఎలాంటి విపత్కర పోకడలకు శ్రీకారం చుట్టారో తెలుస్తోందని విమర్శించారు.
⇨ 11 కోట్ల రూపాయలు విలువ చేయని భూములకు 66 కోట్ల రూపాయలుగా చూపించి 55 కోట్ల రూపాయలను కొల్లగొట్టే అవినీతి వ్యూహం రచించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని తన పారదర్శకత నిరూపించుకోవాలని కోరారు.
⇨ వైజాగ్ లో ఇదే తరహాలో విజయసాయిరెడ్డి పేరు చెప్పి అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కొయ్యా ప్రసాద్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసిందని, మరి నెల్లూరులో ఆధారాలతో సహా కనిపిస్తున్న ఈ అవినీతి కుంభకోణంపై విచారించి కావలి ఎమ్మెల్యేను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రశ్నించారు.
⇨ జిల్లాలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి తెలపాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు.
⇨ ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారా అని ప్రశ్నించారు.
⇨ వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా తన ఫోన్ కాల్ డేటా ను, తమ అనుచరుల కాల్ డేటాను సైతం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనధికారికంగా సేకరించిన సమాచారం తన వద్ద ఉందని, ఈ అనైతిక వ్యవహారానికి పాల్పడిన అధికారులు కూడా ఎవరో తనకు తెలుసని, త్వరలోనే ఈ అంశంపై జిల్లా ఎస్పీని కలవనున్నట్లు తెలిపారు.
⇨ ఫోన్ కాల్స్ డేటాను సేకరిస్తే భయపడే దానికి తామేమి అవినీతి కార్యక్రమాలు చేయట్లేదని, ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలు, వారి పీఏలు, అనుచరుల కాల్ డేటాను తెప్పించుకుని పరిశీలిస్తే అనేక అవినీతి కుంభకోణాలు బయటపడతాయని తెలిపారు.









