
వేలేరుపాడు, మార్చి 30 (జనస్వరం) : వేలేరుపాడు మండలం చిగురుమామిడి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాలుగు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. సోమవారం జరిగిన ఈ సంఘటనలో నాలుగు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో చండ్రుగొండ నర్సింహులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించడంతో భారీగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్థులు మంటలను అదుపు చేసేలోపే రవి, సింగబాబు, శ్రీను ఇళ్లకు మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఇళ్లలోని సామగ్రి, బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. బంగారం సైతం కరిగిపోయినట్లు బాధితులు తెలిపారు. గ్రామస్థుల కృషితో చివరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబాలు మిర్చి రైతులు కావడంతో పంట అమ్మిన డబ్బులు కూడా కాలిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.









