బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారులకు సహాయం అందించిన ఎమ్మెల్యే లోకం మాధవి

నెల్లిమర్ల, అక్టోబర్ 09, (జనస్వరం) : బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాల పరిస్థితిని గమనించిన నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కొండరాజుపాలెం గ్రామంలో బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. అదనంగా ప్రతి కుటుంబానికి బియ్యం బస్తా మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కష్టసమయంలో మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలనే ఉద్దేశంతో స్థానిక ఫిషరీ, హ్యాచరీ కంపెనీల సహకారంతో మొదటి విడత సహాయాన్ని అందించినట్టు తెలిపారు. రెండో విడతలో కూటమి నాయకులు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కూడా త్వరలో బాధిత కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న మత్స్యకారుల పరిస్థితి ప్రభుత్వానికి, ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని చెప్పారు. బాధిత కుటుంబాలు ఒక్కరోజైనా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందుగా తమ వంతు సహాయం అందించామని పేర్కొన్నారు. త్వరలోనే మత్స్యకారులను భారత్‌కు తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని మత్స్యకారుల కుటుంబాలకు ఐక్యంగా అండగా నిలిచారు.

See also  గ్రామ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించిన జనసేన నాయకులు