
నెల్లూరు (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 163వ రోజున 48వ డివిజన్ వి.బి.ఎస్.కళ్యాణ మండపం ప్రాంతంలో నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 2019లో అధికారంలోకి రాగానే 2020 ఉగాది లోపు పేదలకు ఇళ్ళు కట్టించి గృహప్రవేశం చేయిస్తామన్న సీఎం జగన్ రెడ్డి గారి పలుకులు గాలి మాటలుగా మారాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వైసీపీ ప్రభుత్వం ప్రతి రోజూ మాట తప్పుతూ, మడం తిప్పుతూ ఉందన్నారు. జగనన్న కాలనీల పేరుతో ఇళ్ళు లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 6 అంకణాల స్థలాలు అంటూ బులుగు పచ్చ రంగు కాగితాలు ఇచ్చారని, నెల్లూరు సిటీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు అయినా ఏ ఒక్క పేద కుటుంబానికైనా కట్టించిందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ మోసాలను ప్రతి ఇంటికీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ప్రజలే తమకు ఇంకా చక్కగా ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ వివరిస్తున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.