ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన విలువైన సంపదలు భూమి, గాలి, నీరు, వృక్షాలు వీటి మీద ఆధారపడి జీవనం సాగించే మానవులకు తరగని సంపద లభ్యత పర్యావరణం అయితే సకల జీవ రాశులకు ప్రాణాధారం అయిన పర్యావరణం చేతులారా మార్పులు చేస్తూ నష్టపరుచుకుంటున్నారు. అభివృద్ధి అంటూ, ఆర్ధిక అవసరాలు అంటూ అమ్మ లాంటి ప్రకృతిని దాడి చేసి దోచుకుంటున్నాం.
మన జీవితంతో ముడిపడి ఉన్న భూమి, నీరు, గాలి మన పరిసరాలను, వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. భూమి మీద మొక్కలు నాటి నీరు పోసి పెంచి ఆ మొక్కలు అందించే స్వచ్ఛమైన గాలిని పీల్చాలి ఇది ధర్మం కానీ అభివృద్ధి, ఆధునికత పేరుతో భూమిని తవ్వుతున్నాం, చెట్లు నరికేస్తున్నాం, నీరు నిలిచేందుకు తావు లేకుండా చేస్తున్నాం. సహజత్వాన్ని కోల్పోతే సంకటాలు ఎదురవుతున్నాయి. వృక్షాలలో నిండైన అడవులు పచ్చదనంతో అలరాలాల్సిన ప్రదేశాలను వాటిని నరికి వేసి ఇనుము, సిమెంట్లతో కాంక్రీటు జంగల్ గా మార్చుకుంటున్నాం. ప్రాణం పొసే ప్రాణ వాయువును ప్రాణాంతకంగా మార్చుకుంటునన్నాం. స్వచ్ఛత నిండిన గాలి, నీరు, భూమిని బాగు చేయలేనంత కలుషితంగా మురికి కూపాల్లా మార్చుకుని వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాం. వాతావరణంలో మార్పులు ఏర్పడి భూతాపం పెరిగి పర్యావరణానికి ప్రమాదాన్ని తెస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం, విష పూరిత రసాయనాలు, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరగటం, పరిశ్రమలు వదిలే వ్యర్ధాలు పర్యావరణానికి మరింత హాని చేస్తున్నాయి.
ప్రకృతి సహజత్వాన్ని, పవిత్రతను పాడు చేసి విషమయం చేసుకుంటూ వైపరీత్యాలకు కారణం అవుతున్నాం మన మనుగడకు కారణం మైన ప్రకృతిని మనమే నాశనం చేసుకొని మనలను కాపాడాల్సిన ప్రకృతి కబళించే పరిస్థితిని సృష్టించుకుంటున్నాం. తుఫానులు, భూకంపాలు, నీటితో కళ కళ లాడాల్సి చెరువులు నదులు సైతం ఎండిపోయే పరిస్థితి. అనా వృష్టి లేదా అతి వృష్టి, ఆకారణ వరదలు, భూగర్భ జలాలు ఇంకిపోవడం జీవ వైవిధ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ముఖ్యమైనవి మనం జీవించడానికి నీరు అత్యవసరం భూగోళం పై మూడు వంతులు నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది ఒక్క శాతం మాత్రమే. నీళ్లను పొదుపుగా వాడి వృధాను తగ్గించాలి. వ్యవసాయం చేసేటప్పుడు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడటం వల్ల భూ పొరల్లోకి రసాయనాలు చేరి కాలుష్యం అవుతుంది. పట్టణాలు, నగరాల్లో వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, చెత్తను కాల్చడం వల్ల గాలిలోకి ప్రమాద కరమైన రసాయనాలు చేరుతున్నాయి. విపరీతమైన శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్నాయి.
మనం నివసించే భూమి, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితం. ఆ ప్రభావం వల్ల కలిగే నష్టాల నుండి బయట పడాలంటే ప్రకృతి పరిరక్షణ తప్ప ప్రత్యామ్నాయం లేదు అలాంటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరిగింది, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం మొదలు అయింది. 1972లో జూన్ 5 వ తేదీన అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి పర్యావరణానికి సంబంధించిన సదస్సు స్వీడన్ లో జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది
ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలుసుకున్నారు. దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడే హక్కు ప్రభుత్వాలకు ఇచ్చిన మొదటి దేశం మనది. దాదాపు ఈ పర్యావరణ పరిరక్షణ కోసం 10 వివిధ రకాల చట్టాలను చేశారు ఎన్ని చట్టాలు ఉన్నా బాధ్యత మరిచి ప్రవర్తిస్తుంటే ప్రకృతి ప్రకోపాలకు భారీ మూల్యం చెల్లించుకుంటూ ఉండాలి. నేలపైన, నీటిలో ఉన్న అన్ని జీవరాశులు గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. నీరు, నేల, గాలి కలుషితమైతే మన పరిసరాలు, మన శరీరాలు కలుషితం కాకుండా ఉంటాయా అందుకే ప్రకృతి పరిరక్షణ అవశ్యం ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమేకాదు. భావితరాలకు భద్రమైన, ఆరోగ్యకరమైన జీవితాలను ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం పాటు పడే జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం గా “పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం” ఉంది. అందులో భాగంగానే మన నుడి మన నది, సుజల సీమ లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షిస్తే భావి తరాల భవిష్యత్తు కు సాయం చేసినట్లే.
– టీమ్ నారీస్వరం