సమానత్వం కోసం, సమానమైన పనికి సమాన వేతనం కోసం, పని చేసే స్థలాలలో భద్రత కోసం, నిర్దిష్టమైన సమయపాలన కోసం, ఓటు హక్కు కోసం పిడికిలి బిగించి ఉద్యమంగా పోరాడిన మహిళా శక్తికి చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు మార్చి 8. ఆంక్షల కంచెల అడ్డు తొలగించుకొని, ఆత్మ విశ్వాసం నింపుకొని, ఆకాంక్షల అంచులు చేరుకోవాలని శ్రమకు తగిన వేతనం, లింగ వివక్షత లేకుండా సమాన హక్కులు, పని చేసే చోట హింసకు తావు లేకుండా రక్షణ కల్పించాలని ముక్తకంఠంతో విప్లవానికి శ్రీకారం చుట్టి ప్రదర్శన నిర్వహించిన వందేళ్ల నాటి విప్లవం కాస్తా నేడు సంబరాలు చేసుకొనే దినోత్సవాలుగా మారిపోయాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించిన నాటి నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో చూపిన ప్రతిభ ఆధారంగా వారిని గౌరవిస్తుంది. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యం, వారి హక్కుల గురించి అవగాహన కల్పించటంలో దిక్సూచిగా ఉంటుంది. నిన్నటి గతం నుండి నేటి పాఠాన్ని నేర్చుకోవటం సాధించిన విజయాల స్పూర్తితో అవరోధాలను దాటుకుంటూ, ఆటంకాలను ఎదుర్కొంటూ, అసహాయతలను అవలీలగా అధిగమిస్తూ తమ ఉనికి కోసం, మనుగడ కోసం, హక్కుల కోసం, ఆశయాల కోసం దిక్కులన్నీ ఒక్కటి చేసైనా నిగ్గదీసి నిలదీసే ఉక్కు మహిళలై, అవకాశాలను అందుకునేందుకు తమ అసాధారణ శక్తి సామర్ధ్యాలతో, అసమాన నైపుణ్యాలతో ఏ రంగంలో అయినా తమ కీర్తి కిరీటాన్ని ఎగురవేస్తున్నారు. ఓ వైపు నేల నుండి నింగికి చేరి విజయ కేతనాలను ఎగురవేస్తూన్నా పని చేసే చోట వివక్షత, వేధింపులకు, అవమానాలకు గురవుతున్నారు. అత్యాచారాలు, అక్రమ రవాణా, హత్యలు పరిష్కారమే దొరకని సాధారణ సమస్యలుగా మారిపోయాయి. చట్ట సభల్లో మహిళల భాగస్వామ్యం 33% రిజర్వేషన్ మాటలకే పరిమితమైంది.
జీవితంలో తల్లిగా, చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా ఒక తరానికి ఇంకో తరానికి వారధిగా, సంస్కృతి సంప్రదాయాల సారధిగా మార్గదర్శనం చేసే ప్రతి మహిళ విజేతనే. ఎన్నో సమస్యల సుడి గుండాలను దాటుకుంటూ విజయ తీరాలను చేరే ప్రతి వనిత ఛాంపియనే. ఆకాశమే తమ హద్దుగా అన్నింటా ఆడపడుచులు ఎదగాలి. తమ కలలను సాకారం చేసుకోవాలి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
౼ టీం నారీ స్వరం