ఎన్నికల హామీ జిల్లాల సంఖ్యను పెంచేందుకు జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు జగన్ రెడ్డి గారు ప్రకటించి, నోటిఫికేషన్ ఇచ్చి, 30 రోజుల గడువులో అభ్యంతరాలు స్వీకరించి తుదిగా ఏప్రిల్ 4 నుండి కొత్త జిల్లాల ప్రారంభానికి గెజిట్ ఇచ్చారు. కొత్త జిల్లాలు ప్రకటించి ఒక నెల పూర్తి అయింది. గతంలోని కొత్త జిల్లాల పునర్విభజన ప్రతిపాదన, దాని కొరకు ఏర్పాటైన కమిటీని ఆచరణలోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లా ఏర్పాటు కొరకు ప్రజాభిప్రాయలు, ప్రతిపాదనలు సేకరించటానికి కొంత సమయం గడువు ఇచ్చి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత సేకరించిన ప్రజాభిప్రాయలు, రాష్ట్ర కమిటీ సిఫార్సులు 13 జిల్లాల కలెక్టర్లకు పంపి నోటిఫికేషన్ ఇచ్చేలోగా అభ్యంతరాలు తెలియచేయాలి.
వాస్తవానికి కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో సరిహద్దులు, ఆయా జిల్లాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల స్థానికత, అక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయాల విషయంలో తక్కువ సమయంలో సేకరించి ఒక నిర్ణయానికి రావటం కష్టం. పైగా 1974 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చట్టం ప్రకారమే జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా, 2020 జనాభా లెక్కల కోసం నోటిఫికేషన్ జారీ అయి ఉన్నందున జనాభా లెక్కలు పూర్తి అయ్యేవరకు గ్రామాలు, పట్టణాల సరిహద్దులు మార్చడం పట్ల నిషేధం ఉంది. గతంలో ఏర్పాటైన జిల్లాల విభజన ప్రక్రియ ఈ కారణం వల్లనే ఆగిపోయింది. ఆ నిషేధం కేంద్రం ఇంకా రద్దు చేయలేదు. కరోనా వల్ల జనాభా గణన కొనసాగలేదు. ఇది కాకుండా 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజలకు విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగ సమాన అవకాశాలు కల్పించుటకు 6 సూత్రాలతో కూడిన ప్రణాళిక 371డి అధికరణ ద్వారా కల్పించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాసనం చేసేందుకు వీలు ఉండదని 371డి(10) తెలియచేస్తుంది. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో సెక్షన్ 97, అధికరణ 371డి ని సవరించారు. విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కి 371డి అధికరణ వర్తిస్తుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం వల్ల జోన్లు, రెవిన్యూ డివిజన్ లలో మార్పులు వస్తాయి. ఇలా మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. జిల్లా స్వరూపాల మార్పు కారణంగా స్థానికత మారిపోతుంది. జోన్లు, రెవిన్యూ డివిజన్లు మారిపోతాయి. అభ్యంతరాల పరిశీలన అధ్యయనం చేయకుండానే కొత్త జిల్లాల ఏర్పాటు చేయటం జరిగిపోయింది. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు దగ్గర అవ్వటం కోసం పునర్విభజన చేశాం అని ప్రభుత్వము చెప్తున్నా రాజకీయ కారణాలు ఉన్నాయి.
ప్రజాభిప్రాయ సేకరణకు, వినతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా అస్తవ్యస్తంగా జరిపారు అని విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి. లోక్ సభ నియోజకవర్గాలకు దృష్టిలో పెట్టుకొని పునర్వ్యవస్థీకరణ జరిగింది. 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారాయి అందులో కొన్ని జిల్లాలకు జిల్లా ప్రాధాన్యతలను బట్టి అక్కడి ప్రముఖ వ్యక్తుల పేర్లను కొన్ని జిల్లాలకు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొత్త జిల్లాలు ప్రకటించే గెజిట్ లోనే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా గా ప్రకటించకుండా ఆలస్యంగా ప్రకటించటం. కారణంగా అభ్యంతరాలు వచ్చాయని చెప్పటం, ఎన్నో జిల్లాలకు అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రశాంతంగా ఉన్న కోనసీమలో కులాల పేరిట, రాజకీయ ఎత్తుగడల చాటున నలిగిపోతుంది రాజకీయ కాష్టం రగిలించిన మంటల్లో కాలిపోతుంది. పునర్విభజన జనం మధ్య వర్గ పోరాటాలుగా మార్చింది, రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన స్వార్ధపూరిత కుట్రలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా సాక్ష్యంగా నిలిచిపోయింది. అభివృద్ధి కోసం, పాలన సౌలభ్యం కోసం జరగాల్సిన పునర్విభజన రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే మోయలేనంత ఆర్ధిక భారం రాష్ట్రం భరిస్తూనే ఉంది. పాలన సౌలభ్యం బాగుంటుంది సౌలభ్యానికి సౌకర్యాలు అమర్చే సదుపాయం ఉండాలి. ఆర్ధిక వనరులు లేకుండా సౌకర్యాలు కల్పించటం సాధ్యం కాదు. పాలన కోసం తీసుకొనే నిర్ణయాల జీవో లు పారదర్శకంగా జనానికి అందుబాటులో ఉంచలేని ప్రభుత్వం ప్రజల కోసం పునర్విభజన చేశారంటే నమ్మశక్యం కాదు. ప్రజల భావోద్వేగాలు రాజకీయ లబ్దికి వాడుకోవటమే ప్రధాన లక్ష్యం. జనానికి జిల్లా కేంద్రాల మధ్య దూరం తగ్గించే పనిలో జనం మధ్య దూరాలు పెరిగాయి. రాజకీయమే గెలిచింది జనం ఎప్పటిలాగే దగా పడ్డారు.
– టీమ్ నారీస్వరం