అధికారంలోకి రాగానే ఉద్యోగులు కోరుకున్న 27% IR ఇస్తాం. అంతే కాదు సకాలంలో PRC అమలు పరుస్తాం. CPS రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తాం. ఇది 2019 ఎన్నికల నేపధ్యంలో YCP తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చిన తర్వాత 27 % శాతం IR కన్నా తక్కువ ఉన్న ఫిట్మెంట్ ను ప్రకటించి 13 లక్షల మంది ఉద్యోగులను నట్టేట ముంచారు సీఎం జగన్ రెడ్డి… కొత్త PRC లో IR కన్నా 4% శాతం కోత పెట్టారు ఇప్పుడు అమలవుతున్న HRA లో 50% కోత విధించారు. CCA కూడా రద్దు చేశారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పెంచారు. పీఆర్సీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచడంతో జగన్ రెడ్డి రివర్స్ పాలనలో ప్రతి ఉద్యోగి జీతం 15% నుంచి 20% ( 6,000 to 7,000) తగ్గనుంది. దేశ చరిత్రలో 7 DA లను పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డిదే. లక్షలకు లక్షలు జీతాలు ఇస్తూ సలహాదారులను నియమించుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సు చేసిన అంశాలను బహిర్గతం చేయకుండా కరోనాతో ఆదాయం తగ్గిందని అసత్య వాదనతో ఉద్యోగస్తులను జగన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుంది. పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన గురువులను నడిరోడ్డు మీద న్యాయం కోసం పోరాటాలు చేసే దుస్థితికి తీసుకొచ్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే ..
ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు పోసినట్లు అయ్యింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వకపోవడంతో ఈ సంవత్సరం అయిన భారీ పోస్టులతో నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎంతోమంది నిరుద్యోగుల పాలిట ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం శాపంగా మారింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పాలనా యంత్రాంగంలో కీలక సేవలు అందించే ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్రజాస్వామికంగా అర్ధరాత్రి విడుదల చేసిన జీవోలు ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పొడిచే విధంగా ఉండటంతో అశాస్త్రీయంగా ఉన్న PRC జీవోలను వెనక్కి తీసుకోవాలని అటు ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. ఉద్యోగుల సహకారం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యం అనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయి ఉద్యోగుల అవసరాలను డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు నిరంకుశత్వంగా ఒంటెద్దు పోకడలను అవలంభిస్తోంది. ఇటీవల ప్రకటించిన PRC ప్రకారమే వేతనాలను చెల్లించేలా అన్ని ట్రెజరీ ఆఫీసులకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగానే జీతాల్లో మార్పులను చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల PRC పోరు తీవ్రమవుతోంది. PRC ఫిట్ మెంట్ ను 23 శాతానికి పరిమితం చేయడంపై ఇప్పటివరకూ అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు.. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై మరింత మండిపడుతున్నారు. ముఖ్యంగా IR కంటే తక్కువగా PRC ఫిట్ మెంట్ ప్రకటించడం, HRA లో కోతలు విధించడం, ఇకపై రాష్ట్రస్ధాయిలో PRC ఉండబోవని ప్రభుత్వం చేసిన ప్రకటనతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నూతన PRC విధానాన్ని ఆమోదించి ఉద్యోగస్తులను సర్ది చెప్పడానికి అంటూ ఒక కమిటీని చేస్తున్నామంటూ మరికొంత కాలం కాలయాపన చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఏదేమైనా CPS, PRC, IR విషయాల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– టీమ్ నారీస్వరం