తూర్పు గోదావరి, (జనస్వరం) : జగన్ రెడ్డి గారి నాయకత్వంపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా గొంతు నొక్కే ప్రయత్నాలు తప్ప, సమస్యకు పరిష్కారం ఆలోచించాలన్న జ్ఞానం పాలక పక్షానికి కరవయ్యిందన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తుపై బెంగతో ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారన్నారు. యువతకు అండగా జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా నిరసన తెలుపుదామన్నా పోలీసుల అండతో ఇబ్బంది పెట్టాలని చూసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆర్ధికలోటు వేధిస్తోందని, వేలకోట్లు ఎటువెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అర్దిక స్థితి గాడి తప్పి ఉందనే విషయం దేశమంతటా తెలిసింది అన్నారు. గురువారం రాజమండ్రిలో రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించిన కార్యకర్తలకు బీమా పత్రాలు, ఐడీ కార్డులతో కూడిన కిట్లను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాజనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ జిల్లా జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిన కార్యకర్తలను అభినందించడం మన ప్రధమ కర్తవ్యం. ఒకవైపు కరోనా మహమ్మారి విబృంభిస్తున్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రమాదం జరిగినప్పుడు దేశ, విదేశాల్లో ఉన్న పార్టీ సానుభూతి పరులు స్పందించి బాధిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. అటువంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తులు పార్టీలో చాలా మంది ఉన్నారు. వారందరి స్ఫూర్తితోనే కియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించాం. దేశంలో చాలా పార్టీలే ఉన్నాయి. 15 నుంచి 20 ఏళ్లు పాలించిన పార్టీలు ఉన్నాయి. కానీ ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు ప్రమాద బీమా రూ. 5 లక్షలు ఇస్తున్న ఏకైక పార్టీ మాత్రం జనసేన పార్టీయే. అటువంటి పార్టీ కోసం ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకొని క్రియాశీలక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కార్యక్రమం ప్రారంభించిన నాలుగునెలల్లోనే లక్షకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. వాటిని మరింత పెరిగేలా అందరం కృషి చేయాలి. పార్టీ కోసం కష్టపడే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదని” హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ డి.ఎమ్. ఆర్.శేఖర్, శ్రీమతి పి.సరోజ, శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, శ్రీమర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ బండారు శ్రీనివాస్, శ్రీ పాటంసెట్టి సూర్యచంద్ర, శ్రీ వై.శ్రీనివాస్, శ్రీమతి బొడపాటి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.