భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ చూడని వినని నియంత పాలన, వారానికి ఒక సమస్య పక్షానికి మరొక సమస్య తెరపైకి, ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొక సమస్య గురించి చర్చ జరగడం సాంప్రదాయబద్ధంగా సంస్కృతిగా ఆంధ్రప్రదేశ్లో మారింది అనడంలో అతిశయోక్తి లేదు.. సూటిగా చెప్పాలంటే ఈ వారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సమస్య అనాలో లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన డైవర్షన్ పాలిటిక్స్ అనాలో కూడా అర్థం కాని ఒక బండ రాయిని ప్రజల నెత్తి మీద వేసిసింది. తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్న చందాన ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పును గూర్చిన అంశం.. తాజాగా ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 21 న ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం దక్కింది. ఉభయ సభల ఆమోదం లభించడంతో గవర్నర్ ఆమోదం ద్వారా అది చట్టంగా మారుతుంది. ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ రాజముద్ర వేసిన తర్వాత గెజిట్ విడుదల కాగానే అధికారిక వ్యవహారాలన్నీ డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పరిగణించడానికి వీలవుతుంది. అయితే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఒకరికొకరు పోటీ పడుతూ విమర్శలు చేసుకుంటూ నిందించుకుంటూ మీడియాకి ఎక్కి రాష్ట్ర పరువును గంగలో కలుపుతున్నారు.
అరుంధతీ కనబడదు, అధ్వాన్నం కనబడదు, అరవై వరహాల అప్పుమాత్రం కనబడుతుంది అన్నట్లు అప్పుల ఊబిలో కూరిపోతున్న రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చర్చించకుండా, గాల్లో దీపం పెట్టి రాష్ట్రాన్ని అమ్మేస్తూ భవిష్యత్తు తరాలకి అంధకార ఆంధ్రప్రదేశ్ ని అందించాలని కంకణం కట్టుకున్నట్టు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ ఎంత బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు అందరికీ కనిపిస్తున్న విషయమే... ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లేదా దివంగతులైన నాయకుల పేరిట ప్రభుత్వ పథకాలు, సంస్థలు లేదా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఆ పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారం చేపట్టాక ఆ పేర్లు మార్చడం అనేది మన దేశ రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో భాగమైపోయింది. అది సుపరిపాలనకు ఏ విధంగానూ తోడ్పడదు అని తెలిసినా వారిని ప్రజలు మర్చిపోతారు మరింకేదో అనుకొని వారి స్వ ప్రయోజనాల కోసం స్వార్ధంగా వ్యవహరించడం అనేది బాధాకరమైన విషయం.
ప్రజా ప్రయోజనాలే పాలకులకు పరమావధిగా ఉండాలి. ప్రజాభిమానం పొందడానికి కేవలం పథకాలకు లేక ఇలా యూనివర్సిటీలకు పేర్లు పెట్టడం వలన ప్రజల్లో శాశ్వతంగా ఉంటాయి అనే అపనమ్మకాన్ని పాలకుడు కలిగి ఉండడం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి... ఏదేమైనా ఇప్పటికీ వీధుల నుంచి మొదలు మహా నగరాల వరకూ పేర్లను మార్చడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. అయితే, ఆ మార్పుల వెనుకగల కారణాలేమిటి, నెరవేరే ప్రయోజనాలేమిటి అన్నది పరిశీలించినట్లయితే నిజంగా అవి ప్రజల మనోభావాలకు, చారిత్రక ప్రాధాన్యతకు పెద్దపీట వేసేవా లేక ఎవరో కొందరి ప్రయోజనాల కోసమా అన్నదీ చూడాలి.
స్వాతంత్ర్యానికి ముందు మన భారతదేశం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నామో మన జాతీయ ఉద్యమ నాయకులు ఏ విధంగా పోరాడారో స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి సమావేశాల్లో చర్చల్లో చెప్పడం కాదు వారి త్యాగాలకు మనం నివాళి అర్పిస్తూ గాంధీ, నెహ్రూ , తిలక్ వంటి జాతీయోద్యమ నాయకుల పేరిట ఈ పథకాలకు పేర్లు పెట్టడం వల్ల వారి త్యాగాన్ని ఏ స్థాయిలో గుర్తించాము అనేది తెలియజేయాలి. కానీ ఎవరో కొంతమంది తమ స్వార్థాల కోసం స్వప్రయోజనాల కోసం కులం, మతం, కుటుంబం బ్లడ్ బ్రీడ్ అని చెప్పుకుంటూ తమను తాము ఎక్కువగా చూపించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో లేదా చరిత్రలో తమ ఉనికి ఉంది అని గుర్తించమని ప్రజలని ఒక మాయలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని అనడంలో సందేహం లేదు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒకరి పేరు మరొకరు చెరిపేసుకుంటే చరిత్ర కూడా మిగలదు అనే విషయాన్ని నాయకులు మర్చిపోతున్నారు. అసలు మారాల్సింది నాయకులా లేక పేర్ల మార్పులా లేక వ్యవస్థల్లో మార్పా అనే ప్రశ్నను అటు రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రజలు కానీ ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com