నాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా విద్యుత్తు చార్జీలను " బాదుడే బాదుడు" అని చెప్పిన నేటి ముఖ్యమంత్రి నేడు సామాన్యుని వెన్ను విరిగేలా బాదటంలో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.
"ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య" అన్నట్లు ఓట్లు వేసి గెలిపించిన ఓటరు మహాశయులు ఇప్పుడు లెక్కలో లేరు. అంతా నా ఇష్టం అన్నట్లు ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంతో జనం బేజారు అవుతున్నారు. గెలవటానికి వేసిన ఎన్నికల రాజకీయ ఎత్తుగడల ముందు గెలిపించిన ప్రజలు చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల ముందు సామాన్య ఓటరును ఆకట్టుకునేలా వాగ్దానాలు ఇబ్బడిముబ్బడిగా చేసి అధికారం వచ్చాక సామాన్యునిపై మోయలేని భారం మోపటం అధికారం చేపట్టిన రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి పక్షంలో ఉండి పలికిన చిలక పలుకులు, సూక్తి ముక్తావళి అధికార పక్షంగా మారాక జి వోల పేరుతో జీరోగా మారిపోయాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు, ఎన్నో కొత్త రకాల పన్నులు చాలవు అని విద్యుత్తు చార్జీలు భారీగా పెంచి ఈ నెల నుండి కొత్త టారీఫ్ లు అమలు అవుతాయని చెప్పటం సామాన్యులకు షాక్ ఇచ్చినట్లే. ఓ వైపు వేసవికాలంలో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉండే ఈ సమయంలో హఠాత్తుగా చార్జీలు పెంచి కొత్త టారీఫ్ లు ప్రకటించటం ప్రజల అవసరాలను ధరలు పెంచే అవకాశంగా మార్చుకున్నారు. ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాల్సింది పోయి ధరలు పెంచి దాదాపు 1400 కోట్ల భారం జనంపై వేస్తున్నారు. సర్దుబాటు చార్జీలు (ట్రూ అప్) 3900 కోట్లు వాయిదాల పద్దతిలో వసూలు చేయనున్నారు. ఆగష్టు నుంచి పెంచుతాం అని చెప్పి అర్ధాంతరంగా 4 నెలలు ముందుగానే అదనపు చార్జీలు ఈ నెల నుండి వసూలు చేయాలని నిర్ణయించారు. వినోదం పేదవాడికి అందించాలని సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించిన ప్రభుత్వానికి నిరంతర వినియోగం ఉండే విద్యుత్తు చార్జీలను పెంచటం ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియచేస్తుంది.
ఏ ఇతర రాష్ట్రాలలో లేనంతగా విద్యుత్తు చార్జీలు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదే. అదనపు చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, అపరాధ రుసుముల పేరిట వసూలు చేస్తూ సామాన్యున్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక్క సామాన్యుడు మాత్రమే కాదు అన్ని రకాల వినియోగదారులపై ఈ అదనపు చార్జీల భారం అధికంగా ఉండనున్నది. రెండు లైట్లు, ఫ్యాన్లు, టి వి, ఫోన్ వాడకం లేని కుటుంబాలు నేడు అరుదు. కనీస విద్యుత్తు వినియోగం 150 - 200 యూనిట్లు ఉంటుంది. ప్రస్తుతం 200 యూనిట్లకు ఒక యూనిట్ ధర 4.43 చొప్పున చార్జీలు ఉన్నాయి ఒక్కసారిగా యూనిట్ ధర 1.57 పెంచారు. గృహ వినియోగదారులను 6 కేటగిరీలుగా చేసి కొత్త ధరలను నిర్ణయించారు.
ఒకప్పుడు ఓట్ల కోసం 200 యూనిట్లు పేదవారికి ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు పేదవారు 30 యూనిట్లు లోపు విద్యుత్తు వాడితే యూనిట్ కి 45 పైసలు, 31-75 యూనిట్లకు 91 పైసలు, 76-125 యూనిట్లకు 1.40 పైసలు, 126-225 యూనిట్లకు 1.57 పైసలు, 226-400 యూనిట్ల కు 1.16 పైసలు, 400 యూనిట్లు దాటి వినియోగించే వారికి 0.55 పైసలు చొప్పున విద్యుత్తు చార్జీలు పెంచటం ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం లాంటిదే. విద్యుత్ వినియోగం పెరిగితే టారిఫ్ మారిపోతుంది టారిఫ్ మారితే యూనిట్ ధర పెరుగుతుంది. ఎటు చూసినా కాయా కష్టం చేసి కడుపు నింపుకొనే పేదవాడికే భారం ఎక్కువ. పేదవారి అత్తెసరు ఆదాయం మీద పన్నులు, ధరల పేరుతో అదనపు భారాన్ని మోపుతున్నారు. మన రాష్ట్రంలో APEPDCL, APCPDCL, APSPDCL సంస్థల ద్వారా సరఫరా చేస్తున్న విద్యుత్ వినియోగం ద్వారా రావాల్సిన ఆదాయానికి ఇప్పటి ధరల మధ్య తేడా వలన 10 వేల కోట్ల లోటు ఏర్పడింది. గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్ మార్పు చేస్తే కొంత లోటు భర్తీ అవుతుందని డిస్కమ్‌ల నుండి 890 కోట్ల గాను ప్రతిపాదనలు వస్తే APERC [ Andhra Pradesh Electricity Regulatory Commission ] ద్వారా 1400 కోట్లు వసూలు చేయనున్నారు.
వ్యవసాయానికి సాయంగా ఇచ్చే రాయితీ ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇవి మిగతా సర్దుబాటు ఖర్చులు (True up charges)గా 36 వాయిదాల్లో వసూలు చేయాలని ప్రతిపాదనలు. కానీ, 18 నెలల్లో వసూలు చేయనున్నారు.
మోసపూరిత ఎన్నికల హామీలు, ఆర్ధిక భారం పెంచిన విద్యుత్తు చార్జీలు ప్రజల గోడు పట్టని ప్రభుత్వ నిర్ణయాలు అంధకారంలోకి 5 కోట్ల ఆంధ్రుల జీవితాలు.
- Team Naareeswaram
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com