ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయ పార్టీలు ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. ఒక్కో రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధి కొరకు తమ జెండా, అజెండాలతో ఎన్నికల బరిలో నిలబడి గెలిచి రాష్ట్రాభివృద్ధికి రథసారధులుగా ప్రగతి పథంలో నడిపించే వారధులుగా ఉండాలి. కానీ నేటి రాజకీయాల్లో అవే కొదువ. వారసత్వ రాజకీయాలు, ప్రలోభ రాజకీయాలకు ధీటుగా సామాన్యులు రాజకీయాలు చేసేలా కొత్త శకానికి నాంది పలికింది ‘జనసేన పార్టీ’. రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే ప్రజల ఆదరణతో పాటు చిత్త శుద్ధితో పార్టీ అభివృద్ధికి పాటుపడే పార్టీ కార్యకర్తలు ఉండటం ముఖ్యం. జనసేన పార్టీకి ముఖ్య బలం నిస్వార్థ కార్యకర్తలు ఉండటం. సాధారణంగా రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు, అర్ధ బలం, అంగ బలం ఉన్నవాళ్లే అధికం. జనసేన విషయానికి వస్తే పార్టీ అధినేత, సినీ రంగాన పేరున్న కథానాయకుడు అవడం ఇతర ఏ రాజకీయ పార్టీకి లేని అదనపు అర్హత కోట్ల మందికి అభిమాన పాత్రుడు అవడం ఒక విధంగా ప్లస్ ఒక విధంగా మైనస్. చాలా మంది నేటికి రాజకీయాన్ని వేరుగా, అభిమానాన్ని వేరుగా చూడకపోవటం ఒకింత బాధ కలిగించే విషయం. సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయకుడిగా ఆయన మీద అపారమైన ప్రేమను చూపించగలిగే అభిమానం పదిలం. కానీ ఆయనకు వ్యవస్థల పట్ల ఉన్న సామాజిక స్పృహ, ఆలోచనలు, ఆశయాలు వీటిని గుర్తించలేని గుడ్డితనం మీద దురభిమానాల పొరలు కమ్ముకొని ఉన్నాయి.
పార్టీ ఆవిర్భావం నుండి ఏ కార్యక్రమం తలపెట్టినా అది జనం కోసం, సమస్యల కోసం పోరాటమే. ఎన్నికల్లో ఓడినా ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ జనం గుండెల్లో స్థానం ఏర్పరుచుకోవటం అంత సులువు కాలేదు. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నట్లు ఒక్కో పోరాటం ఒక్కో సమస్యను జనం దృష్టితో చూసి అదే దృక్పథంతో పోరాడుతుంది అనే నమ్మకం మెల్లిగా సాధించింది. స్థానం లేదు అనుకొనే స్థితి నుంచి స్థిరంగా నిలకడగా జనం గుండెల్లో స్థానం ఏర్పరుచుకుంది. ఉడుకు నెత్తురు పారే యువత ఉక్కు సంకల్పంలా తోడయ్యారు. జనానికి కష్టం వస్తే జనసేవ అంటూ సాయం చేశారు. అధినేత నడుస్తున్న దారిని విశాలం చేస్తూ నడక సాగిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తున్నారు పోరాటం చేస్తున్నారు. మార్పు రావాలని అధినేత కోరుకుంటే తొలి అడుగులు వేసి సినిమాలను వినోదంగానే చూస్తూ రాజకీయం చేసే యువ జనసైనికులుగా, వీర మహిళలుగా సమస్యలపై ప్రశ్నిస్తున్నారు పోరాటం చేస్తున్నారు. ఈ తరంలో రాజకీయాధికారం సామాన్యులదే అనే దిశగా ప్రయాణం చేస్తున్నారు. 2018 నాటి ప్రజాపోరాటయాత్ర నుండి నేటి కౌలు రైతు భరోసా యాత్ర వరకూ జనసేన ఎపుడూ ప్రజాపక్షమే అని ఋజువు చేస్తున్నది.
లక్ష్యం ఉంటేనే గమ్యం చేరుకోగలం. గమ్యం చేరాలి అంటే చేయి చేయి కలపాలి సంకల్పానికి ఊపిరి పోయాలి. అడుగులన్నీ కలిస్తేనే దూరాన్ని దాటగలం. అభిమానం అడ్డుగోడగా మారి ఆశయాన్ని అడుగు వేయనీయకుండా అడ్డుపడకూడదు. అవరోధాలను దాటుకుంటూ గెలుపు వైపు మన ప్రయాణం సాగాలి.
– టీమ్ నారీస్వరం