ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారుతోంది, ప్రజాభీష్టం మంట కలిసి నిరంకుశత్వం రాజ్యమేలుతోంది. ప్రజలు ఎన్నుకునే ప్రజల స్వామ్యంలో అధిక మెజారిటీ సాధించి ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయాలు పరిధులు దాటి విపక్షం అంటే విద్వేషం, వినకుంటే విధ్వంసంలా మారిపోయింది.
రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కుల ద్వారా ప్రజలందరూ స్వతంత్రులు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ లో వాక్ స్వాతంత్య్రం లేదు, నచ్చిన రాజకీయ పార్టీకి మద్దతు బహిరంగంగా తెలిపే అవకాశం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు, అధికారంలో ఉన్న తమ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే మిత్రులుగా, తమకు మద్దతు తెలుపని వారిని శత్రువులుగా చూస్తూ ఎన్నో ఏళ్ళు ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం కూడా మళ్ళీ బానిస సంకెళ్లు వేసుకుంది. కన్నూ, మిన్నూ కానక ఎన్నో దుశ్ఛర్యలను, దుర్మార్గాలను, అరాచకాలను సృష్టిస్తూ భయ భ్రాంతులకు గురి చేస్తూ అణిచి వేయాలనే ప్రయత్నం తప్ప సానుకూల దృక్పథం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. ప్రజల పట్ల బాధ్యత లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన రాజ్యాంగ బద్ధమైన హక్కులను హరించి వేస్తూ తమకు అధికారం కట్టబెట్టిన కొద్ది మంది ప్రజల కోసమే పరిపాలన అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అసలు పాలకులకు తమ, పర భేదాలు ఎందుకు? రాష్ట్ర సమస్త ప్రజానీకానికి పాలన చేస్తాం అంటూ చేసిన ప్రమాణాలను చేసిన దగ్గరే విడిచిపెట్టి రాక్షస పాలనకు శ్రీకారం చుట్టి తమ దైన వికృత రూపాలను, తమ లోని ఇంకో కోణాన్ని జనానికి చూపిస్తున్నారు.
మొన్న ఇప్పటం గ్రామంలో జరిగిన రోడ్డు విస్తరణ అంటూ ప్రభుత్వం తమ అధికార జులుం చూపించి ఇళ్లు కూల్చివేయటం కక్ష్య పూరిత చర్య అనేది బహిరంగ రహస్యం. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ ప్రజలు చేసిన తప్పు ఏంటంటే జనసేన పార్టీకి మద్దతుదారులుగా నిలిచి ఈ ఏడాది మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చి సహకరించటం. అమరావతి ప్రాంతంలో ఆవిర్భావ సభ కోసం ఎక్కడా స్థలం ఇవ్వనీయకుండా అధికారాన్ని ప్రయోగించి హెచ్చరికలు చేసినా ఇప్పటం గ్రామ ప్రజలు సభ కోసం స్థలాన్ని ఇవ్వటం అధికార పార్టీకి నచ్చలేదు. మార్చి14 సభ అనంతరమే ఏప్రిల్లో రోడ్డు విస్తరణ అంటూ నోటీసులు ఇచ్చారు. జాతీయ ప్రధాన రహదారికి దగ్గరగా ఉండే చిన్న గ్రామానికి 70 అడుగుల రోడ్డు సరిపోదని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు జాతీయ రహదారి కంటే పెద్దదైన 120 అడుగుల రోడ్డు వేయటానికి సంసిద్ధులయ్యారు. కనీసం బస్ సౌకర్యం లేని కుగ్రామానికి హైటెక్ సొబగులతో రోడ్డు అత్యవసరంగా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రతీకారానికి అధికారాన్ని వాడుకునే స్థితికి దిగజారి పోయింది.
ఇప్పటం గ్రామానికి వెళ్లాలంటే జాతీయ రహదారి నుండి 15 అడుగుల సర్వీసు రోడ్డు, ఊర్లో ఏమో 120 అడుగుల రోడ్డు వేస్తుంటే ప్రభుత్వ పారదర్శకత స్పష్టంగా కనిపిస్తుంది. తమ మాట నిర్లక్ష్యం చేసి వేరే పార్టీ సభకు స్థలం ఇవ్వటం అసలు జీర్ణించుకోలేని ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా నిలిచిన వారి ఇళ్లను కూల్చివేస్తే తమకు కాకుండా ఎవరికి మద్దతుగా నిలిచినా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అని భయం కలిగించడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. నోటీసులు అందుకున్న ఇప్పటం గ్రామ ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా తీర్పు రావాల్సి ఉంది ఈలోగా కూల్చివేత కార్యక్రమం పూర్తి చేసిన ఘనత ప్రభుత్వానిది.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రహదారులు పరిస్థితి ఘోరంగా, దారుణంగా ఉన్నా వాటిని విడిచి, కనీసం గుంతలు కూడా పూడ్చలేని ఈ ప్రభుత్వం, ఒక్క ఇటుక పేర్చి కట్టడం అయినా కట్టని ఈ ప్రభుత్వం అధికారం ఉందనే అహంకారంతో రోడ్డు విస్తరణ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. కూల్చివేతలతోనే పాలన మొదలు పెట్టిన ఈ ప్రభుత్వం, జనం తలుచుకుంటే కూల్చివేత కాదు కుర్చీలో కూర్చొనే అవకాశం కూడా ఇవ్వరని మర్చిపోయింది. జనాగ్రహం ఎవరికీ, ఏ రాజకీయ పార్టీ కి మంచిది కాదు. ఆగ్రహం ఉగ్రరూపం దాల్చి ఉనికికి ప్రమాదం అయ్యే అవకాశం ఎక్కువ. జనం మేలుకుని జాగృతం అయితే రాక్షస పాలన అంతం జరిగి తీరుతుంది.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే....
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com