ప్రజల చేత ప్రజలు కొరకు రూపొందించుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటూ బాల్యంలో పుస్తకాలలో చదువుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క విలువ దాని ప్రభావం భారత రాజకీయ వ్యవస్థలో ఎంత ఉందో అని మురిసిపోయే వాళ్ళం. స్వార్థం పిట్రేగిపోతున్న నేటి రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తుంది. ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు కనిపిస్తున్నాయని అనడంలో సందేహం లేదు. దీనికి కారణం మారిన రాజకీయ నాయకుల ఆలోచన ధోరణి లేదా అధికారులు అనేది కొందరికి మాత్రమే శాశ్వతం అనే భ్రమ. అధికారం కొందరికి సొత్తు అనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని మసకబారుస్తూ నియంత పోకడను ఆవలంబిస్తున్నారు... ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రేపటి తరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి ప్రజా సమస్యల పట్ల కనీస ఆవగహన లేకుండా అధికారమే పరమావధిగా, పదవుల కోస౦ సాంకేతికంగా అమలు కానీ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం కృషి చేయడం కాదు కదా వాటి ఊసే ఎత్తడం లేదు అంటే నేటి రాజకీయ వ్యవస్థ ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉందో అర్థమవుతుంది... వాటిని నెరవేర్చమని ప్రశ్నించే గొంతులను కూడా నొక్కే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటే నేటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా పాతాళంలోకి తొక్కి వేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా? లేక నియంత ప్రభుత్వ౦ నడుస్తుందా? అనిపిస్తుంది. అధికారంలోకి రాకముందు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ కావాలి అంటూ నేను విన్నాను- నేను ఉన్నాను అంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయకపోవడమే కాకుండా తమ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులను తమ ఆధిపత్య, నియంతృత్వ ధోరణితో ఉద్యమాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బాబు వస్తే జాబు అంటూ గత ప్రభుత్వం యువతను మోసం చేస్తే అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తరవాత క్యాలెండర్ విడుదల చేయడం, కుటుంబాలను వదిలి కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్న నిరుద్యోగుల ఆశలపై ఏ విధంగా నీళ్లు చల్లారో, రోడ్డున పడ్డ తమ ఆశయాలను, ఆశలను ప్రశ్నించిన నిరుద్యోగులపై ఏ విధంగా కేసులు పెట్టారో వారిని ఏ విధంగా బెదిరించారు అందరికీ తెలిసినా విషయమే.
అధికారంలోకి వచ్చినా వారం రోజుల్లో CPS రద్దు చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలకు కూడా చేయలేదు కదా.. CPS రద్దు కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులను, ఉద్యోగులను ఎంత మానసిక వేదనకు గురి చేశారో ఏ విధంగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు తెలిసిన విషయమే. ఉద్యోగులతో, సంఘ నాయకులతో చర్చించకుండా పరిష్కార మార్గాన్ని చూపకుండా పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఉద్యోగుస్తుల ఇంటికి పోలీసులను పంపించడం, ఉద్యమంలో పాల్గొంటే ఆరు నెలల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా అంటూ నోటీసులు ఇవ్వడం, నేరస్తులుగా ఉద్యోగస్తులను రాత్రుళ్ళు పోలీస్ స్టేషన్ కు రప్పించుకొని కూర్చోబెట్టడం సంతకాలు పెట్టించుకోవడం లాంటి పరిస్థితులను గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న నియంతృత్వ పాలనని చూస్తూనే ఉన్నాం.
ఏదేమైనప్పటికీ ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు అధికార యంత్రాంగాలు వారి హక్కులను కాలరాయడానికి పనిచేస్తున్నాయంటే మార్పు రావాల్సింది వ్యవస్థల్లోనా రాజకీయ నాయకుల్లోనా లేక ప్రజల్లోనా అనే ప్రశ్న ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రశ్నించే గొంతుకను నొక్కి వేసే ప్రయత్నం చేస్తే ఈనాడు నిలువరించగలము ఏమో కానీ శాశ్వతంగా ఈ నియంతృత్వ ధోరణి, వైఖరి గెలుస్తుందని చెప్పలేము. ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా సమాధానం చెప్పే రోజు వస్తుందని ఆంధ్రప్రదేశ్లోని జగన్ రెడ్డి ప్రభుత్వమే కాదు ప్రజల చేత ఎన్నుకొన్న ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా తమ నియంతృత్వ పోకడలకు తగిన మూల్యం చెల్లించాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com