రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలుతో కూడిన రాజకీయమే ఉండేది. హుందాగా, ప్రభుత్వాల పని తీరు, లేదా పార్టీల విధానాలపై విమర్శలు సంధించుకునే వారు. కానీ నేటి రాజకీయాల్లో హుందాతనం, విలువలు కాకి ఎత్తుకెళ్ళి పోయింది, బూతులు, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, తప్పుడు కేసుల బనాయింపులతో మూడు పూవులు, ఆరు కాయలుగా వృద్ధి చెంది రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను గౌరవించని ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యమనేది ప్రమాదంలో పడిపోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తోంది. ఉచితాల కోసం బటన్ నొక్కి ఖాతాల్లో వేస్తే చాలు ఇక ఏ అభివృద్ధి అవసరం లేదు అన్నట్లు ప్రవర్తిస్తుంది.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు, మంచి చెప్పినా వినే పరిస్థితి లేదు సద్విమర్శలు తీసుకోలేరు. ఏది ప్రశ్నించినా వ్యక్తిగత దూషణలు, రాజ్యాంగం అంటే పరిహాసం అయిపోయింది. అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిన వ్యవరిస్తున్నారు. ప్రజాస్వామ్యమంత అరాచకం మరొకటి లేదు. ప్రజాస్వామ్యానికి మరో ప్రత్యామ్నాయం లేదు అన్న ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నాం కాబట్టి అది ఎంతటి అరాచకంగా ఉన్నా భరించాల్సిందే. నైతిక ప్రవర్తన విషయంలో పాలకులకో న్యాయం ప్రజలకో న్యాయం. ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అదే ప్రజాస్వామ్యం అనుకోవటం సమంజసంగా అనిపించట్లేదు. రాష్ట్రంలో పాలన, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల కంటే ఎక్కువగా పోలీసు యంత్రాంగం అధికారంలో ఉన్న పార్టీ కనుసన్నల్లో వారి ప్రాపకం కోసం ప్రతిపక్ష పార్టీలు, సామాజిక మేధావులను అణచివేయటం సామాన్యుని గళాన్ని వినిపించే జన వాణి కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకున్న విశాఖ ఘటన ద్వారా తేటతెల్లం అయింది.
రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులను హరించి వేస్తుంటే రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పాలకులు హక్కులను కాలరాస్తే రాజ్యాంగాన్ని ఎవరు కాపాడతారు? ప్రశ్నించిన వారిని వెంట పడి వేధించడం, గృహ నిర్బంధం చేయటం, దాడులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులను బనాయించడం, అరెస్టులు చేయడం, మీడియాలో వారిపై అసత్య ప్రచారం చేయడం ఇదా ప్రజాస్వామ్యం? ప్రజాభిప్రాయాన్ని ప్రజా అవసరాలను పట్టించుకునే దిక్కే లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడం మాని అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వివక్ష, మహిళలపై అత్యాచారాలు, వ్యక్తిగత దూషణలకు ఆలవాలంగా తయారయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు ఏ స్థాయికి దిగజరిపోతున్నారు గత వారం రాష్ట్రంలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. ప్రజల దృష్టిలో వారి స్థాయి ఏంటో కూడా గమనించకుండా అవతలి వారిదే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే పార్టీని బద్ధ శత్రువులా చూడటం పరిపాటిగా మారిపోయింది, విధాన పరమైన ప్రశ్నలకు, వ్యక్తిగత దూషణలు సమాధానంగా వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే ఏదైనా మాట్లాడొచ్చు అనే ధోరణి కొనసాగుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ , ప్రభుత్వానికి, పార్టీ కి మధ్య తేడా చూపించట్లేదు రాజకీయ స్పందనకు పరిపాలన మధ్య సరిహద్దులు ఉండట్లేదు.
రాజకీయంలో ప్రత్యర్థి పార్టీని ఓడించాలంటే ప్రజలను మెప్పించుకోగలగాలి ప్రత్యర్థి పార్టీ కంటే తమా పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాల గురించి వివరించుకొని అని ప్రజలకు నమ్మకం కలిగించుకొని నిలబడాలి. బండబూతులు తిట్టడం, దౌర్జన్యాలు చేయటం, దాడులకు పాల్పడటం రాజకీయం కానే కాదు. ఈ రాష్ట్రంలో ఇదే గొప్ప రాజకీయంగా మారిపోయింది. మాటకు మాట చెప్తే తప్పు కాదు విధానాలు, వ్యవస్థల తీరు పై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగజారిపోయి మాట్లాడటం ఆనవాయితీగా మారిపోయింది. ప్రజాస్వామ్యాన్ని పరిహాసిస్తున్న ఈ దిగజారుడు రాజకీయాలు మారాలి.
ప్రజాస్వామ్యంలో ఎంత గొప్ప నాయకుడు అయినా అహంకారంతో వ్యవహరిస్తే, ప్రజలు గద్దె దించుతారు ఇది చరిత్ర చెప్పిన సత్యం. రాజకీయాల్లో అధికారాన్ని దక్కించుకోవడం చాలా కష్టమని, దక్కిన అధికారం నిలబడేదీ తక్కువ కాలమేనని ప్లేటో ఏనాడో చెప్పారు. నిజానికి రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన అనేవి రాజ్యాంగం హామీగా ఇచ్చిన హక్కులు. హక్కుల పరిరక్షణే ప్రజాస్వామ్య మనుగడకు ముఖ్యం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com