మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో యువతను నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యం అయిన గంజాయి రవాణాలో మొదటి స్థానం అక్రమించటం ఓహో ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. శాంతి భద్రతల, తనిఖీ వ్యవస్థల పని తీరుని తేటతెల్లం చేస్తూ సాధించిన చీకటి సామ్రాజ్యపు ఘన చరితం. ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ లో స్వాధీనం చేసుకున్నంత గంజాయి దొరకలేదని సాక్షాత్తూ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్) NCB ఇచ్చిన నివేదిక 2021 లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో దొరికిన గంజాయిలో దాదాపు 26.7 శాతం అంటే 2 లక్షల కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్ లో స్వాధీనం చేసుకున్నారు. అంటే ఏ స్థాయిలో గంజాయి అందుబాటులో ఉందో అర్ధం అవుతుంది. దేశాలు దాటి రాష్ట్రాలు, రాష్ట్రాల నుండి చిన్న గల్లీల వరకు ఎన్నో రకాల మాదక ద్రవ్యాలు నిత్యావసర వస్తువుల్లా సులువుగా దొరుకుతున్నాయంటే, నిఘా వ్యవస్థకు, రక్షణ వ్యవస్థకు చిక్కకుండా జరిగే చీకటి వ్యాపారం ఏ స్థాయిలో వేళ్లూనుకొని వటవృక్షంలా మారి పోయిందో ఊహించటం కష్టమే. ఎక్కడో మొదలైన ఈ విష సంస్కృతి మూలాలు నలు చెరుగులా వ్యాపించి ఉధృతంగా వ్యాపిస్తోంది. అధికార యంత్రాంగాలకు, పని చేసే సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవటం, తనిఖీ విధానాలు అమలుకు తగిన యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవటం, చుట్టూ వ్యాపించి ఉన్న సాగర తీరం వల్ల అక్రమంగా మాదకద్రవ్యాల సరఫరా ఆటంకం లేకుండా సాగిపోతుంది.
గంజాయికి శాస్త్రీయ నామం కేనబీస్. గంజాయిలో శారీరక, మానసిక ఒత్తిడి తగ్గించటానికి ఉపయోగపడే డెల్టా 9 టెట్రాహైడ్రో కెనాబినోల్ అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఆహారం, మందుల తయారీకి వాడేవారట. తర్వాతి కాలంలో ప్రమాదకరమైన ఈ గంజాయి వాడకాన్ని నిషేధించారు. గంజాయి మొక్కలు పెంచటం, రవాణా చేయటం చట్టరీత్యా నేరం. నేరం కాబట్టే రహస్య పద్ధతుల్లో రవాణా చేస్తూ దొరికి పోతుంటారు. నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారం 16 - 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న విద్యార్థులు, చిన్న పిల్లలకు గంజాయి మత్తుకు అలవాటు చేస్తారు. అలవాటు అయ్యాక అది వ్యసనంగా మారి నిరంతరం కావాలని కోరుకునేలా చేసి, వాళ్లకు ప్రత్యేకంగా సరఫరా చేసేందుకు ఒక పెద్ద వ్యవస్థనే స్మగ్లర్లు నడిపిస్తుంటారు. పట్టణ ప్రాంతాలలో విచ్చలవిడిగా, గంజాయిని అలవాటు చేసి బానిసలుగా మారిన వారికి తెలిసేలా ఉంచి సిగరెట్ల రూపంలోను, చిన్న చిన్న ప్యాకెట్లుగాను తయారు చేసి సరఫరా చేస్తుంటారు. మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, సిగరెట్, బీడీ, గుట్కా, జర్ధా, తంబాకు, గంజాయి, బంగ్, నల్లమందు, కొడైన్, పెథిడిన్, హెరాయిన్, కొకైన్, ఇవ్వన్నీ మత్తు కలిగించేవే ఒక్కో దాని ప్రభావం ఒక్కోలా ఉండి వ్యసనంగా మారి భవిష్యత్తు అంధకారంగా చేస్తాయి.
మత్తు పదార్ధాలను వాడటం వల్ల నాడీ వ్యవస్థ ద్వారా మెదడులోని నాడీ కణాల మీద ప్రభావం చూపుతుంది. నాడీ కణాలు ఉత్తేజితం అవుతాయి. డోపమైన్ అనే హార్మోను విడుదలవుతుంది. దాని వల్ల మత్తుగా కొత్త అనుభూతి పొందుతారు. ఇలా మొదలైన అలవాటు మత్తు పదార్ధాలకు దూరం ఉండలేనంత వ్యసనంగా మారిపోయి బానిసలుగా మారిపోతుంటారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడితే జీవన విధానమే మారిపోతుంది. కృత్రిమ అనుభూతులకు అలవాటు పడి సహజమైన సంతోషాలకు దూరం అయిపోతారు. ధ్యాస మొత్తం ఆ మత్తు పదార్థం చుట్టే తిరుగుతూ ఉంటుంది. వాటి కోసం ప్రాకులాడటం దొరకపోతే ప్రవర్తన మారిపోయి. కోపం, అసహనం ఎక్కువవుతాయి. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తారు. బజారులో దొరికే వస్తువు కాదు కాబట్టి రహస్యంగా కొనుక్కోవాలి కొనాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బు లేకపోతే దొంగతనాలు చేయడం, మత్తుకు బానిస అయితే అది దొరకక పోతే ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి.
మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవటం ప్రాణానికి హాని. ప్రాణం ఉన్నా లేనట్లు నిర్జీవంగా, నిస్సత్తువగా, నిస్తేజంగా మారిపోతారు. శారీరకంగా, మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి, నియంత్రణ కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఇలాంటి ఉన్మాద స్థితిలోనే నేరాలు చేస్తుంటారు, అత్యాచారాలకు పాల్పడుతుంటారు. ప్రమాదాల బారిన పడుతుంటారు. ఎక్కడ చూసినా యువతపై ఎక్కువగా మత్తుపదార్థాల ప్రభావం ఉంది. అందుకే మాదక ద్రవ్యాల బారిన పడకుండా రేపటి భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలి.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com