పెడన నియోజకవర్గం పరిధిలో కోవిడ్ 19 రోగుల పరిస్టితి ఘోరంగా ఉందని జనసేన నాయకులు యడ్లపల్లి రాంసుధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్టితులు వస్తే [ప్రాణాల మీద ఆశలు
వదులుకోవాల్సి వస్తోంది. గ్రామీణ నియోజకవర్గం అయిన పెడనకు 100 పడకల కోవిడ్ సెంటర్ అవసరం ఉంది. నోడల్ అధికారులుగా ఉన్న ఆర్డీఓ స్థాయి అధికారులు సైతం పెడనలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. అయితే ఘనత వహించిన మన ఎమ్మెల్యే శ్రీ జోగి రమేష్ గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల నియోజకవర్గానికి రావాల్సిన కోవిడ్ సెంటర్లు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు తుడవడానికి అన్నట్టు ఎట్టకేలకు గూడూరులో 25 పడకల కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కోవిడ్ సెంటర్ లో సామాన్య రోగులకు చోటు ఉందా? అక్కడ కేవలం కోవిడ్ సోకిన ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే చేర్చుకుంటామని చెబుతున్నట్టు తెలిసింది. విపత్కర పరిస్టితుల్లో సేవలు ప్రజలందరికీ సమంగా అందాలి. నియోజకవర్గ కేంద్రం పెడనకు మున్సిపల్ హోదా ఉన్నప్పుటికీ కనీసం కోవిడ్ సెంటర్ లేదు.
నిత్యం కొత్త రోగుల తాకిడి :
పెడన, పరిసర ప్రాంతాల నుంచి నిత్యం 30 నుంచి 40 మంది కొత్త రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ బెడ్డు దొరుకుతాయా అని వెంపర్లాడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బెడ్డు కోసం శాసనసభ్యుడి రికమండేషన్ తీసుకువెళ్లినా మచిలీపట్నం పెద్దాసుపత్రిలో పని జరగడం లేదు. ఇంత కంటే సిగ్గుమాలిన వ్యవహారం ఏమి ఉంటుంది. నిత్యం 30 నుంచి 40 మంది ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన రావడం నియోజకవర్గంలో పరిస్థితికి అద్ధం పడుతోంది. ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతుంటే ఎమ్మెల్యే గారు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ముందుకు రావాలి :
జనసేన పార్టీ తరపున ఒకకే డిమాండ్ చేస్తున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం నుంచి సాయం అందకపోయినప్పటికీ సాంత ఖర్చులతోనో, దాతల సాయంతోనో ఎమ్మెల్యేలు కోవిడ్ సెంటర్లు పెట్టించుకుంటున్నారు. శ్రీ జోగి రమేష్ గారు కాసేపు సెటిల్మెంట్లు పక్కన పెట్టి ప్రజల ప్రాణాల మీద దృష్టి సారించాలి. పెడన నియోజకవర్గం కేంద్రంలో 100 పడకల కోవిడ్ సెంటర్ యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. మీవంతు ప్రయత్నం మీరు చేయండి. కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు అవసరం అయితే జనసేన పార్టీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి మేము సిద్దంగా ఉన్నామని అన్నారు. జనసేన పార్టీ అందించే సాయానికి పేరు, కీర్తి కూడా మేము కోరుకోం అని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని కళాశాలల్లో ఎక్కడో ఒక చోట వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఆ ఘనత మీదే అని ప్రచారం చేసుకోండి. నియోజకవర్గం ప్రజల ప్రాణాలు కాపాడండి చాలని అన్నారు.