Search
Close this search box.
Search
Close this search box.

అమరావతి దోషులు ఎవరు ???

అమరావతి

అమరావతి :

          హైదరాబాద్ లాంటి మహానగరాన్ని విభజన కారణంగా రాజధానిగా కోల్పోయిన విభజిత నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తమ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఆశాజనకంగా వినిపించిన పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో హైదరాబాద్ మహ నగరం పోషించిన పాత్రను మనం మర్చిపోలేము. రాష్ట్ర అభవృద్ధికి హైదరాబాద్ నగరం నుండి వచ్చే ఆదాయం ఎంతో తోడ్పాటు చేసింది. అటువంటి ఆదాయం సమకూర్చే నగరాన్ని కోల్పోవడం వల్ల సహజంగానే ప్రజలలో ఒక రకమైన ఆందోళన ఉంది అనేది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో 2014 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానికి ప్రకటించడంతో ప్రజలలో కొత్త ఆశలు చిగురించాయి. ఆ విధంగా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రాజధాని విషయంలో ఈ రోజు నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎక్కడ చూసినా, ఏ వైపు చూసిన స్తబ్ధత నెలకొని ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం ఎవరు ? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిని అడిగినా తమ తమ రాజకీయ అనుబంధాల ఆధారంగా చేసుకుని తమ అభిప్రాయాలు చెప్తారు. కాని ఒక్కసారి మన రాజకీయ ఇష్టాలు పక్కన పెట్టి ఒక సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా పౌరుడిగా ఆలోచిస్తే సరైన సమాధానం దొరుకుతుంది. దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని సుస్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తమ రాష్ట్రానికి రాజధాని ఏది అని ఎవరు అయిన అడిగితే ‘ఇది’ అని చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు ఇద్దరు చేసిన, చేస్తున్న తప్పులు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతి సమస్యకు సంబంధించి న్యాయ వ్యవస్థ ముందు దాఖలు చేసిన వాయిజ్యల విచారణ అనంతరం తీర్పు వెలువరిస్తు అమరావతినే రాజధాని అని వివరంగా స్పష్టం చేసిన కూడా హై కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని అని ఇప్పటికీ అదే వాదన వినిపిస్తూ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా 3 రాజధానుల కట్టి తీరుతాం అని ప్రగల్భాలు పలుకుతోంది. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మనకు ఇంకా 2024 వరకూ రాజధానిగా హైదరాబాదు ఉందని, కొనసాగించుకుందాం అన్న రీతిన మాట్లాడటం ప్రజలను విస్మయానికి, నిరాశకు గురి చేసింది. ఇప్పట్లో రాజధాని సమస్యకు ముగింపు పలికే ఆలోచన జగన్ మోహన్ రెడ్డికి లేదు అని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్ర భవష్యత్తుతో వికృత రాజకీయ ఆటలు ఆడుతున్న జగన్ మోహన్ రెడ్డిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

ఇంకా వీళ్ళు చేసిన తప్పులను చర్చించే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రాజధాని అంటే ఏమిటి ?

    ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం రాజధాని అంటే కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన విషయం. ప్రజలకు దానికి సంబంధం లేదు. ప్రభుత్వ శాఖలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలు అన్ని ఒకే చోట ఉంటే రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రభుత్వ పరమైన, న్యాయ పరమైన కార్యకలాపాలు సమయానుకూలంగా జరుగుతుంది, త్వరతగిన ప్రభుత్వ, న్యాయ, చట్ట సభల మధ్య జరిగే రాకపోకలకు వెసులుబాటు ఉంటుంది కాబట్టి రాజధాని అనేది ఒక చోట ఉండటం అనేది రాజధాని అనే దాని వెనుక ఉన్న అసలు కారణం. అంతే కాని రాజధాని వల్ల ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు కానీ, ఆ దేశ, రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వానికి పరిపాలనలో మాత్రమే లాభం.

అమరావతి: మంచి నిర్ణయమా ? కాదా ?

          పైన పేర్కొన్న విషయాల ఆధారంగా మనం ఆలోచిస్తే అమరావతిని రాజధానిగా నిర్ణయించడం మంచి నిర్ణయం అనే మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకు విశాఖపట్నం రాజధానిగా చేస్తే రాయలసీమ జిల్లాల్లో పని చేసే ప్రభుత్వ అధికారులకు కాని, ప్రజా ప్రతినిధులకు కాని పాలనపరమైన పనుల నిమిత్తం రాజధానికి రావాలి అంటే వచ్చిన పని కోసం ఒక రోజ (చిన్న పని అయితే), మరో రెండు రోజులు రాను, పోను ప్రయాణంలో సరిపోతుంది. అలా అయితే తమ ప్రాంత ప్రజలకు వారి అవసరార్థం అందుబాటులో ఉండటం కుదరదు. ఈ విధంగా చూసుకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారు. అదే అమరావతి లాగా అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాష్ట్రానికి మధ్యలో ఉంటే కొద్దో గొప్పో సమయం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు రోజులు, గంటల తరబడి ప్రయాణాలు చేసే శ్రమ తగ్గి మేలు జరుగుతుంది. (ముందే చెప్పుకున్నాం ప్రజలకు రాజధానికి సంబంధం లేదు అని కావున అది గుర్తు పెట్టుకోండి).

          ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ముంబై, బెంగళూర్, చెన్నై లాంటి నగరాలు అయా రాష్ట్రాల మధ్యలో ఉన్నాయా అనే వితండ వాధం చేసే మేదావులు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్ర ప్రజలకు రాజధాని ఎంచుకొనే అవకాశం రాలేదు. వాళ్ళ ప్రాంతంలో కాలంతో పాటు కొన్ని ఉర్లు పెద్ద నగరాలుగా అభివృద్ధి చెందాయి. కావున అవే రాజధానులుగా కొనసాగించారు అంతే. మనకి మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎంచుకొనే అవకాశం వచ్చింది అంతే. వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఇదే పని చేసే వాళ్ళు ఏమో ఎవరికి తెలుసు, ఎవరు చెప్పగలడు.

చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు :

         అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న గొడవకి ముమ్మాటికీ మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే. విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఉంటూ అక్కడి నుండే పాలన చేస్తూ అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి అన్ని పనులు పూర్తి అయినాక ఇక్కడికి రావాలి కాని ఒక ఇటుక కూడా పేర్చకుండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు. రాజధానికి అభివృద్ధికి ముడి పెట్టీ అవసరానికి మించి రైతుల దగ్గర పంట భూములు తీసుకున్నాడు. ప్రభుత్వ పరిపాలన అవసరాలకు 33 వేల ఎకరాలు పచ్చని పంటలు భూమి ఎందుకు అనేది ప్రశ్నార్థకం?. ప్రభుత్వ పాలనకు సంబంధించి కావాల్సిన కట్టడాల నిర్మాణాలకు ఎంత వరకు కావాలో అంతా వరకు తీసుకుంటే సరిపోతుంది కదా. ఒకటి అర్ధం చేసుకోండి నగరాలను నిర్మించలేము, అవి కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. అంతే కాని సైబరాబాద్ నేనే నిర్మించాను (నిజానికి దానికి పునాదులు పడింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఉన్న సమయంలో) అదే విధంగా అమరావతిని నిర్మించేస్తాను అంటే సాధ్యమవదు. సైబరాబాద్ కూడా అప్పటికే కొన్ని వందల సంవత్సరాల నుండి అభివృధి చెందుతూ వస్తున్న హైదరాబాద్ నగరానికి అనుకోని ఉండటం వల్ల కొంచెం తక్కువ సమయం పట్టింది పెట్టుబడులు ఆకర్షించడానికి కాని అమరావతి పరిస్థితి వేరు. అది అర్ధం చేసుకోకుండా రైతుల దగ్గర వేల ఎకరాల భూములు తీసుకొని సింగపూర్, ఇస్తాంబుల్ వగైరా తరహా రాజధాని అంటూ ఉదరగొట్టి అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఆకాశానికి నిచ్చెన వేసిన చందంగా, నేల విడిచి సాము చేసిన మాదిరిగా ఆకాశ హరణ్యలు, చిహ్నాలుగా నిలిచే కట్టడాలు అని చెప్పి ఆకృతులు కోసం మేదోమధనలు అంటూ చాలా కాలం పాటు కాలయాపన చేశాడు. తరువాత కొన్ని కట్టడాలు కట్టిన కూడా అవి తాత్కాలికం అని చెప్పి, మాట్లాడితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాడిని అని గొప్పలు చెప్పుకొనే వ్యక్తి చేసిన పెద్ద తప్పు. ఆ మాటే అమరావతి అనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తునీ ప్రశ్నార్థకం చేస్తూ జగన్ మోహన్ రెడ్డికి ఆయుధం అయ్యింది. ఉదాహణకు ఎవరు అయిన ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునేవాడు మొదట ఒక ఇంటిని కట్టుకొని ఇది తాత్కాలికం ఇందులో ఉంటూ ఇప్పుడు శాశ్వత ఇల్లు కట్టుకుంటాను అని బుద్ది ఉన్నాడు ఎవడు అయిన చెప్తాడా. అలాగే సింగపూర్ తరహా రాజధాని, ఆకాశ హరణ్యాలు మనకి ఎందుకు. మనకి కావాల్సింది మన రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, సంస్కృతి అద్దం పట్టేలా, మన జీవన శైలికి సరిపడేలా ఉండే రాజధాని. ఇది ఎలా ఉంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని తెలుగులో ఉన్న సామెత లాగా ఉంది.

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు :

              ప్రతిపక్ష నేతగా ఆనాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా నాకు, మా పార్టీ ఎమ్మెల్యేలకు సమ్మతమే అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో గెలిచిన తరువాత కొన్ని నెలలకే అమరావతి మీద పిల్లి మొగ్గలు వెయ్యడం మొదలు పెట్టాడు. పరిపాలన వికేంద్రీకరణ కోసం అంటూ, హైదరాబద్ విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నేను చెయ్యను అంటూ అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులు నిర్మిస్థాను అంటూ కొత్త రాగం అందుకున్నాడు. కాని తను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో రాష్ట్ర సచివాలయం (ఇదే నిజమైన పరిపాలన విభాగం అది ఎక్కడ ఉంటే అదే రాజధాని) పెడతాను అన్నాడు. అంటే మళ్లీ అభివృద్ధిని కేంద్రీకరించినట్టేగా. నిజంగా తన ఆలోచన అభివృద్ధి వికేంద్రీకరణ అయితే రాష్ట్ర సచివాలయం శ్రీకాకుళంలోనో లేదా కర్నూల్ లో పెట్టాలి. అప్పుడే కదా నిజమైన అభివృద్ధి కర్నూల్ లో జరుగుతుంది. పైగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఎక్కువ శాతం రాయలసీమ నుండే అయిన కూడా అభివృద్ధి చెందలేదు అనే బాధని రాయలసీమ ప్రజలకు తీర్చడం స్వయాన రాయలసీమ బిడ్డ అయిన జగన్ మోహన్ రెడ్డి బాధ్యత కదా.

          ఇంకా హైకోర్టు కర్నూల్ లో పెడతాను అంటాడు కాని హైకోర్టు పెట్టడం వల్ల అది ఉన్న ప్రాంతంలో జరిగే అభివృధి ఎంటో జగన్ మోహన్ రెడ్డికే తెలియాలి. నిజానికి హై కోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అనేది వాస్తవం. ఇప్పటికే అమరావతిలో హైకోర్టు పెట్టడం వల్ల అది మార్చడం అంతా సులువు కాదు, సాధ్యం కూడా కాదు. అయినా తనకు లేని అధికారం తను ఎలా ఉపయోగిస్తాడు అనేది జవాబు లేని ప్రశ్న. అసెంబ్లీ విషయంలో కూడా సమాధానం లేని ప్రశ్న సంవత్సరానికి 3 సార్లు మాత్రమే సమావేశాలు జరిగే అసెంబ్లీ ఉండటం వల్ల అమరావతిలో జరిగే అభివృధి ఎంటో జగన్ మోహన్ రెడ్డి గారి బుర్రకే తెలియాలి. తన మూడు రాజధానుల ఆలోచనకు ప్రజలలో మద్దతు కూడపెట్టడానికి అమరావతిని ఒక కులానికి అంటగట్టడం, మూడు రాజధానులను వ్యతిరేకించే వాళ్ళని ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకులుగా చిత్రీకరించడం, అమరావతి రైతులను డబ్బులు ఇస్తే వచ్చే నటులు అంటూ అవమానించడం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు తన మీడియా, అనుచర గణాన్ని అడ్డుపెట్టుకొని చేశాడు.

పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏమిటి ?

        మన రాజ్యాంగం ద్వారా నిర్మితమైన మన భారత దేశ ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అంటూ వికేంద్రీకరణ ఇప్పటికే జరిగింది. దానికి బలం చేకూరుస్తూ గ్రామ స్థాయిలోని పంచాయితీలకు కూడా అధికారాలు వికేంద్రీకరణ అనేది చేసిన కూడా రాజకీయ కారణాలు చేత సరిగ్గా అమలు జరగడం లేదు. జరపడం లేదు అధికారంలో ఉన్న వాళ్ళు అంటే ఇంకా బాగుంటుంది. వాటిని అమలు చేస్తే చాలు గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా తమ గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు అందుకుంటారు. ఇంకా న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే హై కోర్ట్ కి అనుసంధానంగా జిల్లా న్యాయ స్థానాలు అని ఇప్పటికే ఉన్నాయి. కావాలి అంటే ప్రాంతీయ స్థాయిలో బెంచ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో అయితే విశాఖ, కర్నూల్ నగరాలలో బెంచ్ ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇది నిజమైన పరిపాలన వికేంద్రీకరణ అంటే.

రాజధానికి అభివృద్ధికి సంబంధం ఉందా ?

        ఇప్పుడు అభివృద్ధి విషయానికి వస్తే అన్ని రంగాల పరిశ్రమలు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా వివిధ ప్రాంతాలలో అక్కడి వనరులు ఆధారంగా చేసుకొని దానికి అనుసంధానం అయిన పరిశ్రమలు, దానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యొచ్చు. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో పలాస, సోంపేట లాంటి చోట్ల జీడిపప్పు పంట సాగు అధికంగా చేస్తారు అలాంటి చోట జీడిపప్పు ఆధారం చేసుకొని చేసే వ్యాపార పరిశ్రమల స్థాపన చేస్తే అక్కడి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంతే కానీ రాజధాని తీసుకువెళ్ళి శ్రీకాకుళం దగ్గరలో విశాఖలోనో లేకపోతే శ్రీకాకుళం పట్టణాన్ని రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృధి అయిపోదు. అలా అయిపోతే ఈ రోజు విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ నగర పక్కనే ఉన్న రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు. రాజధానికి అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల ప్రజలు అర్ధం చేసుకొని ప్రభుత్వాలను అడగల్సింది అభివృద్ధి చెయ్యమని కాని రాజధాని కావాలి అని కాదు. చెయ్యాల్సిన నినాద ” రాజధాని ఒక్క చోట, అభివృధి అన్ని చోట్ల “.

        అమరావతిని రాజధానిగా నిర్ణయించిన సమయం నుండి స్పష్టతతో, రైతులకు అండగా నిలిచి, ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్రా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, ఆలోచనతో నిలబడిన నాయకులు, పార్టీల గురించి వచ్చే ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సురేష్ చంద్ర  (Twitter ID:- @SureshChandrAAA)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way