Search
Close this search box.
Search
Close this search box.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ – హిందూస్తాన్ జింక్ అనుభవం ఏం చెప్తోంది ?

                 ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యగా మారింది. ఎంతోమంది ఉద్యోగుల, కార్మికుల భవిషత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ వాదనేమో, ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉంది అని, ప్రభుత్వానికి భారంగా మారుతుంది అని అంటున్నారు. కానీ ఎంతోమంది ప్రాణత్యాగాలు  చేసి సాధించిన ఈ ఉక్కు కర్మాగారాన్ని వదులుకోవడానికి విశాఖ వాసులు అంత సిద్ధంగా లేరు అనేది మాత్రం వాస్తవం. కానీ చాలామంది బీజేపీ నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖ లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు అని సర్దిచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాటల్లో నిజానిజాలు తెలుసుకునే ముందు, ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి, కొన్ని విషయాలు తెలుసుకుందాం.

            సుమారు రెండు దశాబ్దాల క్రితం, అంటే 2002 సంవత్సరంలో అప్పటి వాజపేయి ప్రభుత్వం, విశాఖపట్నంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ జింక్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీనుకున్నారు. అప్పటి నుంచి కొంచం కొంచంగా ప్రభుత్వ వాటా ఆ సంస్థలో తగ్గించుకుంటూ వస్తున్నారు. చాలా మంది కార్మిక సంఘాలు ప్రతిఘటించినా లాభం లేకుండా పోయింది. Sterlite (ఇప్పుడు వేదాంత) గ్రూప్ హిందూస్తాన్ జింక్ సంస్థను చేజిక్కించుకున్నారు. ఆ సమయంలో మన రాజకీయ నాయకులూ చేసిన వాగ్దానాలు, వాటి పర్యవసానాలు తెలుసుకుంటే, ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ ఆందోళన ఎందుకో అర్ధం అవుతుంది. అప్పుడు చెప్పిన మొదటి మాట, ఈ కర్మాగారం ఎక్కడికి వెళ్ళదు, విశాఖ లోనే ఉంటుంది అని. కానీ, కొద్దికొద్దిగా ఉత్పత్తి తగ్గించుకుంటూ, సంస్థను విశాఖకు దూరం చేసింది వేదాంత యాజమాన్యం. అందుకు కారణం లేకపోలేదు. ప్రైవేట్ సంస్థలు ఎప్పుడూ లాభార్జన మీదే దృష్టి పెడతాయి. వాళ్ళకి కార్మికుల వ్యధలు, ప్రజల మనోభావాలు అనవసరం. అప్పుడు సంస్థకు కావలసిన గనులన్నీ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నందున, అక్కడే ఇంకా విస్తరణ పనులు చేపట్టారు.

                విశాఖ దగ్గర్లో గనులు లేవు కాబట్టి ఇక్కడ ప్లాంట్ నడపడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడు వేదాంత యాజమాన్యానికి ఈ ప్రభుత్వ ఉద్యోగులు భారంగా కనిపించారు. అప్పట్లో విశాఖపట్నం ప్లాంట్లో ఉన్నది 1500 – 2000 (సుమారుగా) మంది ఉద్యోగులే. అయినా వారి సంక్షేమం కోసం చేసిన ఆలోచనలు శూన్యం. సంస్థ మంచి లాభాల్లో కొనసాగుతున్నా కూడా, వారికి ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ఏ లాభాలు కలిగించలేదు. చాలా మంది ఉద్యోగులను బలవంతంగా VRS (స్వచ్చంద పదవీ విరమణ) చేసేలా ఒత్తిడి చేశారు. VRS తీసుకోకపోతే రాజస్థాన్ కు బదిలీ చేసేయాలని నిర్ణయం తీసుకున్నారు. 20 – 25 ఏళ్ళుగా విశాఖపట్నంలో స్థిరపడి, ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటున్న చాలా మంది ఉద్యోగులు అలా రాజస్థాన్ వెళ్లలేకపోయారు.  చేసేది లేక, కొంతమంది ఉద్యోగాలను వదులుకున్నారు. అలా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి, ఇప్పుడు పెన్షన్లు కూడా లేవు. ఉద్యోగుల పిల్లలకోసం నిర్మించిన జింక్ స్కూలును కూడా ప్రైవేట్ కు అప్పచెప్పారు వేదాంత యాజమాన్యం. విశాఖపట్నంలో అప్పుడు జింక్ లో పని చేసిన ఉద్యోగుల్ని కదిలిస్తే, ఇలాంటి వ్యధలు ఇంకా ఎన్నో తెలుస్తాయి. అలా 2012 -13 ప్రాంతంలో విశాఖలో జింక్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసేసింది వేదాంత యాజమాన్యం. ఇప్పుడు గాజువాక సమీపంలోని మింది ప్రాంతంలో నిరుపయోగంగా ఆ వందల ఎకరాల భూములు వేదాంత సంస్థ చేతిలో ఉన్నాయి.

                  హిందూస్తాన్ జింక్ లో 45 % వాటాను 2003  లో 769 కోట్లకు అప్పటి వాజపేయి ప్రభుత్వం వేదాంత సంస్థకు అమ్మింది. ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం ఆ వాటా విలువ సుమారు 40 వేల కోట్లు. అంటే దాదాపు 50 రెట్లు పెరిగింది. అంత లాభసాటి వ్యాపారం జరిగినా కూడా, ఈ ప్రైవేటీకరణ వల్ల దెబ్బతిన్న ఉద్యోగులకి మాత్రం, ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంక జరుగుతుంది అనే ఆశ కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తరువాత కూడా ఇలాంటి కథలు, వ్యధలు మనం చూడాలి, వినాలి. అది తప్పదు. ఇలాంటి ఉదాహరణలు ఈ దేశంలో ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రైవేటీకరణ వల్ల లాభాలు పెరుగుతాయి, సంస్థ అభివృద్ధి అవుతుంది అంటూ ఎంతో మంది మేధావులు, ఆర్థికవేత్తలు చెప్తారు. కానీ ఉన్న ఉద్యోగుల, వారి  మీద ఆధారపడిన వాళ్ళ భవిషత్తు గురించి ఎలాంటి చర్చా ఉండదు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే మాటలు ఎంత నిజాలో, ఈ హిందూస్తాన్ జింక్ ఉదాహరణ చుస్తే మనకు అర్ధం అవుతుంది.

                అసలు మన విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉండడానికి ముఖ్య కారణం సొంత గనులు లేకపోవడమే కదా. ఏటా 3472 కోట్లు నష్టాలు కేవలం సొంత గనులు లేకపోవడం వల్ల వస్తోంది. చాలా మంది మేధావులు చెప్తున్నారు, గనుల్ని వేలంపాటలో ప్రైవేట్ ఉక్కు కంపెనీలు సొంతం చేసుకుంటున్నాయి, అందులో తప్పేముంది అని. సరే, కాసేపు అది నిజమనే అనుకుందాం. మరి ఏ స్టీల్ ప్లాంట్ పెట్టారని, బ్రాహ్మణి స్టీల్స్, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళకి గనుల్ని కేటాయించారో, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాలి. పోనీ గనులు ఇవ్వడం కుదరదు అనుకుందాం. ఇదే విశాఖలో ఇంకో పరిష్కారమార్గం కనిపించే ఉదాహరణ కూడా ఉంది. BHPV ప్రభుత్వ రంగ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని BHEL లో విలీనం చేసి, సంస్థను కాపాడారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, సొంత గనులున్న SAIL (స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా) లాంటి సంస్థల్లో విలీనం చేస్తే భావి తరాలకి ఎంతో మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని, ఎంతో మంది ప్రాణ త్యాగాలకు ఒక విలువ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం. పోరాడుదాం.

 

Written  By

                                                                                                                                                                                                                     @unbroken_warmth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way