ఒక రాష్ట్ర పురోగతిని, అభివృద్ధిని అంచనా వేసే విషయాల్లో ముఖ్యమైనవి పేదరికం, యువత మొదలైనవి. అత్యధిక సంఖ్యలో యువత ఉన్న రాష్ట్రాల్లో వారి ఆర్థిక పురోగతి మీద ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరోక్షంగా ఆధార పడి ఉంటుంది. కానీ దీనికి నిరుద్యోగం పెద్ద అడ్డంకి. నిరుద్యోగం అనేది నైపుణ్యం మరియు ప్రతిభావంతులైన వ్యక్తులు ఉద్యోగం చేయాలనుకున్నా అవకాశాలు లేని పరిస్థితి. కానీ అనేక కారణాల వల్ల సరైన ఉద్యోగం దొరకడం లేదు. నిరుద్యోగం అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు కానీ నిరుద్యోగం అంటే వ్యక్తికి ఉద్యోగం లేదని మాత్రమే కాదు, నిరుద్యోగం వారి నైపుణ్యానికి సరిపడ హోదాలో కాకుండా తక్కువ హోదాలో పని చేసే వాళ్లని కూడా నిరుద్యోగులుగానే చూడాలి. వివిధ రకాల నిరుద్యోగులలో శాశ్వత ఉద్యోగం లేకపోవడం, కాలానుగుణ నిరుద్యోగం, సాంకేతిక నిరుద్యోగం, నిర్మాణాత్మక నిరుద్యోగం లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా, కొన్ని ఇతర నిరుద్యోగాలు: దీర్ఘకాలిక నిరుద్యోగం మరియు సాధారణ నిరుద్యోగం అన్నింటికంటే మించి, అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని జనాభా పెరుగుదల, కుంటుపడిన ఆర్థికాభివృద్ధి, కాలానుగుణ వృత్తి, కుటీర పరిశ్రమల పతనం. పలు రాష్ట్రాల్లో నిరుద్యోగానికి ఇవి ప్రధాన కారణాలు. దానికి తోడు ప్రభుత్వం దీనిని కఠినంగా పరిగణించి శాశ్వత పరిష్కారం వెతకకుండా, దీనిని కూడా ఒక ఎన్నికల పరికరంలానే భావించడం. ఇవన్నీ ఇలాగే కొనసాగితే నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది కాకుండా, పేదరికం పెరుగుదల, నేరాల సంఖ్య పెరుగుదల, శ్రమ దోపిడీ, రాజకీయ అస్థిరత, మానసిక ఆరోగ్యం మరియు నైపుణ్యాల నష్టం వంటి ఆర్థిక వ్యవస్థలో కొన్ని విషయాలు నిరుద్యోగానికి ఆజ్యం పోస్తాయి.
ఇక మన రాష్ట్ర పరిస్థితికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ రెండేళ్ల నుంచి చర్చనీయాంశంగానే ఉంది. పరిస్థితి తాజాగా అదుపు తప్పిపోయిందన్న అభిప్రాయం ఆర్థిక శాఖ అధికారుల్లోనూ బలంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి ఆర్థిక లోటు ఏకంగా 662 శాతం అధికంగా నమోదైంది. అది అసాధారణం. ఇలాంటి పరిస్థితిల్లో వ్యవస్థ కుప్పకూలడం మినహా ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్లీ నిలబెట్టే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు రాష్ర్ట ప్రభుత్వ ఏక పక్ష ధోరణి నిర్ణయాలతో రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రావడానికి మొగ్గు చూపట్లేదు.75% లోకల్ యువతకు ఉద్యోగం లాంటి నిర్ణయాలు మంచివే అయినా పరిశ్రమలు వాటిని స్వీకరించే పరిస్థితులు లేవు. పరిశ్రమలు రాకపోగా, ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ పాద యాత్రలో చెప్పిన ముఖ్యమంత్రి దాని ఊసే ఎత్తడంలేదు.. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం “పండగకి కొత్త అల్లుడు” అన్న చందంలో భారీగా ప్రచారంలో చేసుకుని ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు అందరూ మెల్లగా విరమణ చేస్తున్నారు.
గత ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్ర నిరుద్యోగం 20% గా నమోదు కాగా, ఈ సచివాలయాలు లాంటి ఉద్యోగాలతో వాటిని ఉద్యోగం అని చెప్పి దాన్ని 3% కి తీసుకొచ్చారు. కానీ అదే ముఖ్యమంత్రి జీతాలు పెంచమంటే ఇవి ఉద్యోగాలు కాదు సేవ, మీకిచ్చేది జీతం కాదు – సేవాభృతి అనడం అతిశయోక్తి. దీని ప్రకారం మన రాష్ట్ర నిరుద్యోగ రేటు ఇంకా ఆ 20% అనే చెప్పొచ్చు. పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ వేశారు. అవి ఇప్పటికీ భర్తీ కాలేదు. నిరాశ నిస్పృహలతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారు. తమకు ఉద్యోగాలు ఏవి అంటూ కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేయిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. చివరి సారిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం భర్తీ చెయ్యాల్సిన ఉద్యోగాలు 2లక్షల పై చిలుకు కాగా అందులో పేరుకి సుమారుగా 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదే కాకుండా రిటైర్మెంట్ 62 ఏళ్ళకి పెంచి యువత ఆశలని మట్టి పాలు చేశారు. ఇది ఇలాగే సాగితే దొంగతనాలు, నేరాలు పెరిగే అవకాశం చాలా ఉంటుంది అని గణాంకాలు చెప్తున్నాయి.
ప్రభుత్వం నిరుద్యోగ యువతని రాజకీయపరంగా వాడుకోకుండా ఇచ్చిన మాట మీద నిలబడుతుంది అని ఆశిద్దాం.
– టీం నారీస్వరం