
నివర్ తుపాన్ రైతాంగాన్ని కడగండ్ల పాల్జేసింది
కరోనా మహమ్మారి నుంచి రాష్ట్రం కోలుకోక ముందే నివర్ తుపాన్ రూపంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం దాదాపు 12 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లిందని, రైతాంగం కడగండ్ల పాలైందని చెప్పారు. వరి, పత్తి, మిరప, పొగాకు, శనగ, వేరుశనగ, అరటి, పండ్లతోటలు, ఉద్యానపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. వీటితోపాటు పశుసంపదను కూడా రైతులు కోల్పోవడం దురదృష్టకరమని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నివర్ తుపాన్ ప్రభావిత జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల జనసేన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ వల్ల జరిగిన నష్టం, రైతాంగం పడుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయి పరిస్థితులను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోవడం దురదృష్టకరం. అప్పుల పాలవుతున్న రైతులను మరింత కుంగదీసేలా ఈ నష్టాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తులకు సన్నాహకంగా ఉండటం చాలా అవసరం. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కేంద్రం నుంచి నిధులు వస్తాయి. వాటిని సక్రమంగా వినియోగించాలి. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీరు కూడా అందని దుస్థితి నెలకొంది. ప్రజలు తాగు నీటిని ఎక్కువ ధర వెచ్చించి కొనుక్కోవలసి వస్తోందని నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు.
• పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు ఏవీ?
విపత్తుల సమయంలో ప్రభుత్వం కనీసం ప్రజల్ని అప్రమత్తం చేయడంగానీ, ముందస్తు హెచ్చరికలూ జారీ చేయడంగానీ సక్రమంగా లేదు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సైక్లోన్ షెల్టర్లను రాష్ట్ర ప్రభుత్వం గత 20 ఏళ్లుగా సరిగా నిర్వహించడం లేదు. తిత్లీ తుపాన్ సమయంలో క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు ఆ షెల్టర్ల పరిస్థితిని గమనించాను. తుపాను హెచ్చరిక కేంద్రాల్లో ఆధునిక పరిజ్ఞానం, వ్యవస్థలు ఉన్నా ప్రజలను అప్రమత్తం చేసి వారికి ఇబ్బంది లేకుండా చూసే నాయకత్వం కరవైంది. ఇంత వరకు పాలించే ప్రభుత్వాలు ఎంతసేపు మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనే ఆలోచించారే తప్ప… తుపాను హెచ్చరిక కేంద్రాలు, పునరావాస కేంద్రాలను ఎలా బలోపేతం చేయాలన్న ఆలోచన చేయలేదు. ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాత్ రూములు, సరైన తిండి దొరక్క వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేసి ఉంటే ఈపాటికి సగం సమస్యలు పరిష్కారమయ్యేవి.
• రైతుల బాధలు పట్టడం లేదు
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేన పార్టీ కచ్చితంగా రైతులకు అండగా ఉంటుంది. పంటనష్టం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయిందన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేయించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. రైతులు పడుతున్న ఇబ్బందులు తెలిపి సాయం చేయాలని కోరుతాం. అవనిగడ్డ నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఆ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న లాకులకు మరమ్మతు చేయించాలని 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అక్కడి నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వానికి రైతుల బాధలు పట్టడం లేదు. రైతులకు సకాలంలో పంట నష్ట పరిహారం అందేలా మన పార్టీ పక్షాన బాసటగా నిలుద్దాం. పునరావాస కేంద్రాల్లో తగిన సదుపాయాలు లేక ఇబ్బందులుపడుతున్నారు. అదే విధంగా తాగు నీరు కూడా లభించడం లేదని తెలిసింది. పార్టీ నాయకులు, జనసేన శ్రేణులు వారి పరిధిలో తుపాన్ ప్రభావిత బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నాను” అన్నారు.
• రైతుకి కన్నీరు తప్ప ఏమీ మిగల్లేదు-శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా నష్టపోయారు. వరుసగా నాలుగు పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతినిపోయాయి. రైతుల కళ్లలో కన్నీరు తప్ప ఏమీ మిగలని పరిస్థితి. అంతా అతలాకుతలం అయిపోయింది. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎంత కష్టపడ్డారో అంత నష్టాన్నీ చవిచూసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోగా, గుంటూరు జిల్లాలో లక్షా 50 వేల హెక్టార్లు మేర ఎన్నడూ లేని విధంగా పంటలు నీటిపాలయ్యాయి. రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ తరఫున ప్రజా క్షేత్రంలో పోరాటం చేద్దాం. తుపాన్ ప్రభావిత జిల్లాలన్నింటిలో ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన సహాయం వెంటనే వారికి అందేలా ఒత్తిడి తీసుకు రావాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ పరిస్థితుల్లో అంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి” అని కోరారు.
• ప్రభుత్వంలో అప్రమత్తత లోపించింది
టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిని శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. డా.పి.హరిప్రసాద్, డా.బి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ “పండ్ల తోటలు వేసిన రైతులు, వరి సాగు చేసిన రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. పంటలు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి” అన్నారు. శ్రీ జి.రాందాస్ చౌదరి మాట్లాడుతూ “చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో టమోటా, వేరుశెనగ వేసినవారు నష్టపోయారు. వేల సంఖ్యలో పశుసంపద చనిపోయింది. ఇప్పటి వరకూ అధికారులు నష్టాల వివరాలు తీసుకోలేదు. రహదారి వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిని ఉంది” అన్నారు. శ్రీ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ “కడపలో బుగ్గ వంకకు సంబంధించి నిర్వహణ లేకపోవడం వల్ల నగరంలోకి వరద చేరింది. పలు కాలనీల్లో 10 అడుగులపైనే నీళ్ళు నిలిచాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం” అని తెలిపారు. శ్రీ అళహరి సుధాకర్ మాట్లాడుతూ “కావలి ప్రాంతంలో పలు గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ పాడైయిపోయింది. రుద్రకోట పంచాయతీలోని గుమ్మడిబొందల ప్రాంతానికి గత అయిదు రోజులుగా సంబంధాలు తెగిపోయాయి. అక్కడికి అధికారులు ఎవరూ చేరుకోలేదు. ఈ నియోజకవర్గంలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. వాటర్ క్యాన్లను ప్రజలు బ్లాక్ లో కొనుక్కోవలసి వస్తోంది” అని చెప్పారు. శ్రీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ “ఆత్మకూరు ప్రాంతంలో సోమశిల రిజర్వాయర్, సంగం బ్యారేజ్ నిర్వహణలో ప్రణాళిక లేదు. ప్రభుత్వంలో అప్రమత్తత లోపించింది” అన్నారు. శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లాలో పంటలు పూర్తిగా నష్టపోయాయి. రూ.192 కోట్ల మేర నష్టం వచ్చినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది” అన్నారు. శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ “నివర్ వల్ల గుంటూరు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విపత్తు నిర్వహణ విషయంలో జిల్లా అధికార యంత్రాంగంలో సన్నద్ధత లోపించింది” అన్నారు. శ్రీ బి.సాయిబాబు, శ్రీ కమతం సాంబశివరావు, శ్రీ రాయపూడి వేణుగోపాల్, శ్రీ అక్కల రామ్మోహన్ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలిపారు.