అనంతపురం ( జనస్వరం ) : ప్రభుత్వ వైఫల్యానికి పదవ తరగతి పరీక్షలు ప్రతీకగా నిలిచాయని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు- నేడు పనులకి కాపలా పెట్టడంతో వారు పిల్లలకి చదువు చెప్పడం మానేసి ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తన మద్యం బ్రాండ్లు అమ్మే షాపులకి కాపలా పెట్టిన ముఖ్యమంత్రే, దిగజారిన ఫలితాలకు ప్రధాన కారకుడని ఆరోపించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని సీపీఎస్ రద్దు, ఫిట్మెంట్ హామీలతో మోసగించడంతో వారు ఆందోళనలతో రోడ్డెక్కి, బోధనకి దూరం చేసింది జగన్ సర్కారే అని మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఒక్క కొత్త టీచర్ని కూడా వేయకపోవడం వల్ల విద్యార్థులకి చదువు చెప్పేవారే లేక ఫలితాలు దారుణంగా వచ్చాయన్నారు. పరీక్షల వేళ విపరీతమైన కరెంటు కోతలు, పరీక్షా సమయం కుదింపు, పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్లతో విద్యార్థులు మానసికంగా బాగా దెబ్బతిన్నారని, ఈ కారణాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. మీడియం గందరగోళం, ఎయిడెడ్ పాఠశాలల రద్దు, పరీక్ష పత్రాల తయారీ విధానంలో లోపాలతో 20 ఏళ్లలో ఎన్నడూ రాని దారుణ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. విద్య శాఖపై సిఎంకు ఉన్న ఆసక్తి ఏ పాటిదో స్పష్టం అయింది అన్నారు.