మానవ పరిణామ క్రమం లో మార్పు చాలా సహజం. ఆది మానవుడు ఆధునిక మానవుడుగా రూపాంతరం చెందడానికి మానవ శరీర నిర్మాణంలో, మేధస్సులో వచ్చిన అనేక మార్పులు దోహదం చేసాయి. పారిశ్రామిక విప్లవం యంత్ర నాగరికతకు స్వాగతం పలికింది. తాటి ఆకుల మీద ఎంతో విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న నాగరికత, తదనంతర కాలంలో గ్రంథ ముద్రణ వైపుగా ప్రయాణించింది. కాగితాన్ని కనిపెట్టడం, ముద్రణా యంత్రం కనిపెట్టడడం వలన ఈ మార్పు సాధ్యమయ్యింది. తాళ పత్రాలలో నిక్షిప్తమైన జ్ఞానం ఏ కొన్ని వర్గాలకో పరిమితమైతే, ముద్రణా యంత్రం ఆవిష్కరణతో ఎక్కువ మంది ప్రజలకు విద్యా వైజ్ఞానిక విషయాలు అందుబాటు లోకి వచ్చాయి. దీని వలన జాతి మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరి అవగాహన స్థాయిలు మెరుగుపడ్డాయి. అదే విధంగా విద్యా రంగంలో శాస్త్రీయ పరిశోధనల ప్రాముఖ్యం కూడా పెరుగుతూ వచ్చింది. విద్యా వ్యవస్థ లో సాహిత్యానికి ఉన్న ప్రాముఖ్యత ను క్రమంగా శాస్త్ర, సాంకేతిక విషయాలు ఆక్రమిస్తూ వచ్చాయి. ప్రాచీన విద్యా విధానం అంతా జ్ఞాన సముపార్జన కోసం రూపొందింది. అప్పట్లో విద్య అంతా కూడా వాస్తవిక ప్రపంచం తో కాకుండా ఎక్కువగా భావ ప్రపంచంతో ముడిపడి కొనసాగింది. బ్రిటీష్ వారి రాకతో మన దేశీయ విద్యా విధానంలో కూడా శాస్త్ర సాంకేతిక అంశాల ప్రాధాన్యం పెరిగింది. కంప్యూటర్ ఆవిష్కరణ తో మారుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ కూడా ఆధునికత ను సంతరించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచ వ్యాప్తంగా సమాచార పరస్పర మార్పిడి సాధ్యం అయ్యింది. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రచారంలో ఉన్న భావజాలాలు అనుసంధానం చేయబడ్డాయి. అంతర్జాలంలోని వేదికలను ఉపయోగించుకుని వివిధ భావజాలాలు సంఘర్షించుకోవడంతో పాటు అనుసంధానం కావడం కూడా మొదలెట్టాయి. ఈ దశ లోనే విద్య అంతర్జాతీయ పోకడలను తనలో ఇముడ్చుకోవడం ప్రారంభం అయ్యింది. ఒకప్పుడు వ్యక్తి ప్రధానంగా సాగిన విద్యలన్నీ సమిష్టి ప్రధానంగా రూపాంతరం చెందాయి. ఏ తోట కూర కాడకో కవిత్వం చెప్పడం విద్యగా చలామణి అయ్యే కాలం కనుమరుగయ్యింది. మానవ సమాజం ఆరోగ్యంగా మరియు సౌకర్యవంతంగా జీవించడానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక పరికరాల ఆవిష్కరణ ఈ దశలోనే సాధ్యమయ్యింది. యాంటీ బయోటిక్స్ రంగంలో ప్రయోగాలు జరగడం వలన ఎన్నో కొత్త మందులను కనుగొనడం సాధ్యం అయ్యింది. ఇంత వరకు కాలానుగుణంగా మార్పులను నెమ్మదిగా సంతరించుకున్న విద్యా విధానం, కోవిడ్ నేపథ్యం లో అనేక డిజిటల్ సొబగులను సంతరించుకుంది. విద్యా వ్యవస్థ లో డిజిటల్ గురువులు, సినిమా రంగం లో డిజె థిల్లూ లు ప్రవేశించారు. దాదాపు ఇదే సమయంలో ప్రవేశపెట్టిన ఆధునిక విద్యా ప్రణాళిక ఎన్నో నైపుణ్యాభివృద్ధి కోర్సులను డిగ్రీ స్థాయి లోప్రవేశపెట్టింది. సాంప్రదాయక కోర్సు ల స్థానం లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు వచ్చి చేరాయి. దీనికి సమాంతరంగా మరియు సంపూరకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం లో అనేక మార్పులు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకోవడం గమనార్హం. 5జి శకం ప్రవేశించడంతో మానవ సహజ మేధ మీద కృత్రిమ మేధ పట్టు సాధించబోవడం అనివార్యంగా మారింది. ఇక ముందు, తరగతి గదులు నల్ల బోర్డ్ లేక తెల్ల బోతాయి. అసలు ఎటువంటి భవనాలు లేకుండా, సాంప్రదాయ గదులు లేకుండా విద్యార్ధులు ఇంట్లో కూచుని విద్యను అభ్యసించవచ్చు. అలాగే విద్యార్థులు జ్ఞాన సముపార్జన ధ్యేయంగా కాకుండా నైపుణ్యాభివృద్ది ధ్యేయంగా విద్యను అభ్యసించనున్నారు. ఈ కృత్రిమ మేధను ఉపయోగించుకుని వివిధ యాప్ లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
చాట్ జిపిటి లాంటి అనేక చాట్ బాట్ లు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. తరగతి గదిలో అధ్యాపకుల అవసరమే లేని తరం రాబోతోంది. అలాగే ప్రతి అంశానికి సంబంధించిన నోట్స్ మరియు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్లను కూడా చాట్ జిపిటి ని ఉపయోగించి విద్యార్థి స్వయంగా తయారు చేసుకోవచ్చు. మెటావర్స్ ద్వారా చెపుతున్న అంశాన్ని కృత్రిమంగా తెర మీదే సృష్టించవచ్చు. మానవ మేధస్సు ను కృత్రిమ మేధ అన్ని రంగాలలో, ముఖ్యంగా విద్యా రంగంలో జయించబోతూ ఉంది. బోధనకు, ప్రయోగాలకు, చివరకు మూల్యాంకనం కూడా కృత్రిమ మేధను ఉపయోగించి చేయడం జరుగుతుంది. దీని వలన ఎక్కడా అవకతవకలకు అవకాశం ఉండదు. పిల్లల హాజరు ఇప్పటికే ముఖ ఆధారిత యాప్ ను ఉపయోగించి వేస్తున్నారు. దృశ్య శ్రవణ బోధనలో కూడా పెను మార్పులు రాబోతున్నాయి.పోడ్ కాస్ట్ ద్వారా ఆడియో బోధన కొనసాగుతుంది. ఇప్పటికే రాతను ధ్వని గా మార్చే టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. మీ గాత్రం బాగా లేకున్నా, మీ రాత ప్రతిని శ్రావ్యంగా మార్చే అరువు గొంతులు ఇప్పటికే ఆన్లైన్ లో సిద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు విద్యార్థిని నియంత్రించడం, గమనించడం అయ్యవార్లకు తలకు మించిన వ్యవహారంగా ఉండేది. ఇప్పుడు వివిధ యాప్‌ల ద్వారా విద్యార్థి ప్రతి కదలికను గమనించవచ్చు. టైపు రాని వారికి, వేళ్ళు సరిగా లేని వారికి స్పీచ్ టూల్స్ ఉన్నాయి. ఇవి మీ స్వరాన్ని అక్షరంగా మార్చి విద్యార్థులకు అందిస్తాయి. ఇప్పుడు సమాజానికి కావలసినది జ్ఞానం బరువును మోసే వ్యధా భరిత విద్యార్థులు కాదు. సృజనాత్మక మేధావులుగా విద్యార్థులు మారాలని ఆధునిక విద్యా విధానం కోరుకొంటోంది. ఉద్యోగాలు ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలను కల్పించే స్థాయికి విద్యార్థి ఎదగడమే ఆధునిక విద్యా ప్రణాళిక యొక్క లక్ష్యం.
పారిశ్రామిక విప్లవం తొలి దశలో రూపొందిన విద్యా విధానం పరిశ్రమలో పనిచేయడానికి అవసరమైన కార్మికులుగా విద్యార్థులను తయారుచేయడానికి మాత్రమే ఉపయోగపడింది. అదే విధంగా ముద్రణా యంత్రం కనిపెట్టబడిన దశలో రూపొందిన రెండవ శకం విద్యా విధానం కేవలం సాహిత్యాన్ని అక్షర బద్ధం చేయడానికి మరియు వివిధ భావజాలాల వ్యాప్తికి మాత్రమే తోడ్పడింది. ఇదే విద్యా విధానం బ్రిటీష్ వారి పాలనలో విద్యార్థులను కార్యాలయాల లో గుమాస్తాలు గా మార్చడానికి ఉపయోగపడింది. ఈ దశ లో బోధించబడిన విద్య ఇటు బ్రిటీష్ వారికి దాస్యం చేయడానికో లేదా వారి మీద జాతీయ విద్య పేరు తో ద్వేషం చిమ్మడానికో ఉపయోగపడింది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలి నాళ్లల్లో దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి అప్పటి విద్యలు ఇతోధికంగా సహకరించాయి. కంప్యూటర్లు ప్రవేశించడంతో మూడో శకం విద్య ప్రారంభమయ్యింది. అప్పట్లో తలెత్తిన Y2K సమస్య వలన సాప్ట్ వేర్ విద్య వైపు అందరూ మళ్లడం జరిగింది. ఈ దశలన్నిటిలో కూడా విద్య ఉపాధి కల్పనకు మాత్రమే సహకరించింది. ఇంటర్నెట్ ప్రవేశించిన తరువాత విద్యా రంగం రూపు రేఖలు మారిపోయాయి. భౌగోళిక కుగ్రామం గా ప్రపంచం మారిపోవడంతో వాణిజ్య ప్రధానమైన కోర్సు లకు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు ప్రవేశాలు లేక బోసిపోయిన కామర్స్ లాంటి కోర్సులకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశాల మధ్య వలసలు పెరిగాయి.
అభివృద్ధి చెందిన దేశాలకు, వర్ణమాన దేశాలకు మధ్య అంతరం పెరిగింది. సంపద కొద్ది మంది చేతులలో పోగుపడడం ఈ అంతర్జాల ఆధారిత నాల్గవ దశ విద్యా విధానంలోనే మొదలయ్యింది. ఏవో కొన్ని కంప్యూటరు లాంగ్వేజులు నేర్చుకుని అప్పట్లో నెట్టుకొచ్చేవారు. ఉద్యోగం మీద ఆధారపడడం అంతర్జాల యుగం లో రూపొందిన 4 వ దశ విద్యా విధానంలో కూడా పోలేదు. కానీ ఇప్పుడు కృత్రిమ మేధ పుణ్యమా అని ఉపాధి వెతుక్కునే స్థాయి నుంచి విద్యార్థి ఉపాధి కల్పించే స్థాయి కి ఎదుగుతున్నాడు. డిగ్రీ చదువుతున్నప్పుడే నైపుణ్యాలను అతనికి ఇష్టమైన రంగం లో అలవరుచుకుంటున్నాడు. బోధనలో ఇప్పుడు ఇంటర్నిప్ ఒక భాగం. ఇక టెక్నాలజీనే టీచర్లు చేసే పనిని చక్క బెట్టేస్తుంది. టీచర్ల స్థానంలో రోబోలు రాబోతున్నాయి. విద్యార్థి మేధో స్టాయిని అనుసరించి బోధనా పద్దతులను మార్చుకునే రోబోలు రాబోతున్నాయి. ఈ మర మనుషుల మేధస్సు తో మనం పోటీ పడడం అసాధ్యం. ఎందుకంటే ఇవి కొన్ని లక్షల టెర్రా బైట సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలవు. సాధారణ గురువుకు అది సాధ్యం కాదు. ఇక ఈ రోబోలు ఎటువంటి పరిస్థితులకైనా అలవోకగా అలవాటు పడతాయి. వీటికి పున:శ్చరణ తరగతులను నిర్వహించాల్సిన అవసరం రాదు. అదే గురువులకైతే అనేక స్థాయి లలో శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. ఈ విషయం లో ఉన్నత విద్యా కమిషనరేట్ వారు ఇప్పటికే చూపిన చొరవను అభినందించాలి. రోబోలు ఒక చిన్న మీటను నొక్కితే చాలు, ఏ భాషలో బోధించడానికైనా సిద్దమవుతాయి. అదే గురువులందరూ ఒకే విధమైన భాషా పటిమను కలిగివుండరు. రోబోలు జబ్బు పడవు. సెలవు మీద వెళ్లవు. సమయపాలన ను ప్రదర్శిస్తాయి.
మానవ గురువులకున్న ఏ మేధో పరమైన పరిమితులు రోబో లకు ఉండవు. ఇవన్నీ ఐదవ శకం విద్యా వ్యవస్థ లక్షణాలు. ముందు తరాలలో తరగతి గదులలో అనురాగాన్ని, అధికారాన్ని ప్రదర్శించిన గురువులు ఈ కృత్రిమ మేధస్సు దెబ్బకు తెర మరుగు కానున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా ఈ తరంలో కృత్రిమ మేధస్సు తో పనిచేసే రోబో గురువులు ఎల్ల వేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటారు. ఏ భాషలో నైనా, ఏ స్థాయి లోనైనా ఇట్టే బోధిస్తారు. మనుషుల స్థానంలో యంత్రాలు బోధించడం వలన ఏదో ఒక భావజాలాన్ని విద్యార్థుల మీద రుద్దడం అంటూ ఈ విద్యా విధానంలో జరగదు. బోధనా సౌకర్యాల కోసం పెద్ద, పెద్ద భవనాలు, ప్రయోగశాలలు నిర్మించాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బోధనోపకరణాలను విద్యార్ధికి సమకూర్చవచ్చు. బోధనా నాణ్యత కూడా పెరుగుతుంది. గణిత బోధన కూడా సులభతరం కానున్నది. అనేక రంగాలలో ఉపాధి కూడా పెరుగుతుంది. ఇంటర్నిప్ వలన విద్యార్థి దశ లోనే ఉద్యోగ నిర్వహణ కు కావాల్సిన నైపుణ్యాలు అలవడుతాయి. సంప్రదాయ రంగాలలో ఉన్న ఉద్యోగాలు కనుమరుగయినప్పటికీ, అనిమేషన్ మరియు గేమింగ్ లాంటి రంగాలలో ఉపాధి పెరుగుతుంది. మరి ఇలాంటి ఐదవ శకం విద్యా వ్యవస్థ లో సాంప్రదాయక గురువు ఒక గత కాలపు జ్ఞాపకంగా మిగలక తప్పదు. అదే విధంగా ఇప్పటి గురువులు ఈ నవ శక విద్యా వ్యవస్థ లో అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే కృత్రిమ మేధో విన్యాసాలను పుణికి పుచ్చుకోకా తప్పదు. ఈ తరం గురువులు అందుకే సాంకేతిక పరిజ్ఞానంతో తమకున్న విషయ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తే వారి మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా పది కాలాల పాటు కొనసాగుతుంది.