నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 253వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం శ్రీవాణి స్కూల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించిన మాజీమంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి తలచుకుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మూడేళ్ళు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి అనేదే చేయకుండా కేవలం మూడు కాలువల బినామీ కాంట్రాక్టుల కోసం పేద ప్రజల ఇళ్ళు పగలగొట్టడంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరి అయిపోయిందని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల ముందు గెలవబోయేది తానే అనే ధీమా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లో కనిపించిందని కానీ ఇప్పుడు 2024 ఎన్నికల ముందు గెలుపు ధీమా కాదు కదా కనీసం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదోనన్న అభద్రతాభావం కనిపిస్తోందని అన్నారు. అందుకే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనకు అవకాశం దొరికినప్పుడల్లా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని, ఎమ్మెల్యే టికెట్ తనకే అనే ప్రచారం చేసుకుంటున్నారని, తన పరిస్థితి అంతలా దిగజారిపోయిందని అన్నారు. రేపటి ఎన్నికల్లో వైసీపీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసినా లేదా ఇంకెవరైనా పోటీ చేసినా కూడా జనసేన పార్టీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని, నెల్లూరు సిటీ ప్రజలు వైసీపీ చీటీ చించేశారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గారిపై ప్రజలు చూపుతున్న ఆదరణ పవనన్న ప్రజాబాటలో స్పష్టంగా కనిపిస్తోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.