మన చదువులు – ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
కడప జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఇంట్లో ఆర్థికపరిస్థితి బాగోలేకపోవడంతో 10వ తరగతిలోనే చదువలకు స్వస్తి చెప్పి, కుటుంబాన్ని పోషించడం కోసం కులీ పనులకు వెళ్ళడం మొదలుపెట్టాడు. చిత్తూరు జిల్లాకు చెందిన మురళి బీటెక్ చదివి కూడా తిరుపతి నుండి రంగంపేట వరకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన మరొక యువకుడు నాగార్జున ఎంబిఏ చదివి ఉద్యోగ అవకాశాలు లేక ఒక కిరణషాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కిరణ్ ది కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. దీనితో అతనికున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్, మురళి మరియు కిరణ్ ఇలా ఒక ప్రాంతానికి చెందిన యువత మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల్లో ఏ యువతిని అడిగిన, ఏ యువకుణ్ణి అడిగిన ఇదే పరిస్థితి. కొందరు చదివిన చదువులకు ఉద్యోగాలు లేక పనులుకెళ్తే మరికొందరు ఉద్యోగం చేయడానికి కావల్సిన మెళకువలు లేకపోవడంతో పనుల్లో చేరగా ఇంకొందరు చదువుకోవడానికే వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. చదివిన చదువులకు ఉద్యోగాలు లేక కొందరు, ఉన్న అతి కొద్ది ఉద్యోగాలకు కావల్సిన మెళకువలు లేకపోవడంతో మరికొందరు, చదుకోవడానికీ ఆర్థిస్తోమత లేక ఇంకొందరు… ఇలా రాష్ట్రంలోని చాలామంది యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా కులీ పనులు, వ్యవసాయ పనులు, ఆటోలు నడుపుకుంటూ, ట్యూషన్ లు చెప్పుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. మరికొందరు. వేరే ప్రాంతాలకు/రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు.
కళాశాల యునివర్సిటీ స్థాయిల్లో విద్య ప్రమాణాలు. పెంచి తద్వారా ఉద్యోగం సాధించుకోవడానికి కావల్సిన మెళకువలు చెప్పడంలో. ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. ప్రస్తుత రాష్ట్రంలో గల దాదాపు అన్నీ కళాశాలలు యునివర్సిటిల్లో చదువులు అంతంత మాత్రమే. చదివిన చదువులకు, చేయబోయే ఉద్యోగాలకు సంబంధం లేకుండా తయారయ్యింది పరిస్థితి. విద్యార్థి చదివిన చదువులకు, తాను చేయబోయే ఉద్యోగానికి ఏమాత్రం పొంతనలేదు. దేశ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మారాలి. నాయకులు మార్చాలి. యుద్ధ ప్రాతిపదికన చదువుల మీద నిర్ణయాలు తీసుకొని, మెరుగైనవిద్యతో పాటు దానికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. అప్పుడే దేశమైన, రాష్ట్రమైన అభివృద్ధి పధంలో ముందుకెళ్తుంది. ఇప్పుడున్న యువతకు/విద్యార్థులకు కావలిసింది మూస
పద్దతితో కూడిన చదువులు కాదు. యువత తమను తాము మెరుగుపరచుకునే విధంగా, వాళ్ళు ఉద్యోగం చేయడమే కాదు, పరిశ్రమలు
స్థాపించి మరో నలుగురికి ఉద్యోగం ఇచ్చేలా తయారు చేయాల్సిన బాద్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. అప్పుడే వలసలు, నిరుద్యోగిత, విదేశాలకు వెళ్ళే యువతను దేశ రాష్ట్రాల్లోనే ఉండే విధంగా చేయగలం. ఒక దేశ సామెత ప్రకారం “ఒక దేశం యొక్క నిజమైన సంపద, ఆ దేశ యువతే” అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి యువతను నిరుద్యోగులుగా, కూలీలుగా మార్చే ప్రభుత్వాలు మారాలి. రాజకీయ విధానాలు మారాలి. మన దేశ రాష్ట్ర రాజకీయాలు వారి భవిష్యత్తుకు గొడ్డలి లాంటిది కాకూడదు.
ఒక దేశం యొక్క నిజమైన పెట్టుబడి, ఆ దేశంలో గల విద్యమీద పెట్టడమే. ఒక ఇంజీనీర్, ఒక డాక్టర్, ఒక న్యాయవాది, ఒక ఉపాధ్యాయుడు, ఒక పోలీసు, ఒక వ్యాపారవేత్త… ఇలా అన్నింటికీ చదువుతో ముడిపడుంది. ఒక పోలీసు సక్రమంగా విధులు నిర్వహిస్తే, సమాజంలో దొంగతనాలు దోపిడులు అన్యాయాలు తగ్గుముఖం పడతాయి. ఒక న్యాయవాది న్యాయం వైపు నిల్చి వాదిస్తే ధర్మం గెలుస్తుంది. ఒక డాక్టర్ అన్ని జాగ్రత్తలతో రోగిని పరీక్షించి వైద్యం చేస్తే, రోగి కోలుకుంటాడు. ఒక _ ఉపాధ్యాయుడు విద్యను, పరీక్షల్లో మార్కులు ర్యాంకులు సంపాదించే సాధనంగా కాకుండా… విద్యార్థి అభివృద్దే, దేశ అభివృద్ధి అని తలచి భోదించినప్పుడే దేశ రాష్ట్ర ముఖచిత్రం మారుతుంది.
చదివే స్థాయిలో రిజర్వేషన్ ఉంచొచ్చు కానీ, ఉద్యోగాల ఎంపిక అర్హత విషయంలో రిజర్వేషన్ కు అంతా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ఉద్యోగాల్లో కాకపోయినా, ఉన్నతస్థాయి. (ఆఫీసర్ స్థాయి) ఉద్యోగాల్లో రిజర్వేషన్ వీలైతే పూర్తిగా తొలగించే (వీలులేనప్పుడు క్రమక్రమంగా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతం తగ్గించే) విధంగా చర్యలు తీసుకొని ప్రతిభకే పట్టం కడితే… అప్పుడు నిజంగా అర్హత కలిగిన నిరుద్యోగులు మాత్రమే ఎంపిక అవుతారు. ఆవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెల్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ జరగాలంటే తక్షణమే ప్రభుత్వము అవలంబిస్తున్న విద్యా విధానాలను ఎంతైనా మార్చాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల శాతాన్ని పెంచాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలి. ప్రైవేట్ పాఠశాలలను అదుపులో ఉంచి, మార్కులు ర్యాంకులు వెనుక పరిగెత్తే సంస్కృతిని మార్చల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్నిచోట్ల విద్యను వ్యాపారం చేసే ప్రైవేట్ వ్యక్తులను, సంస్థలను అదుపులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. విద్య అనేది తప్పకుండ ప్రభుత్వ పరిధిలో ఉంచాల్సిన అతి ముఖ్యమైన విషయం.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల/కళాశాలలో నాణ్యమైన విద్యను భోధించే వైపుగా అడుగులేయాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థికి వృత్తి విద్య కోర్సులతో పాటు, విద్యార్థి యొక్క ఇష్టం వైపుగా అడుగులేసే విధంగా ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థి చదువులు ముగిశాక, ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితి రాదు. విద్యార్థి చదువులో ఉండగానే వారు భవిష్యత్తులో ఏమి కావాలో, దానికి ఇప్పటినుండే ఏమి చేయాలో అనే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఒక ప్రావీణ్యం కలిగిన ఇంజీనీర్ బ్రిడ్జ్/ రహదారి నిర్మిస్తేనే అది కొన్ని సంవత్సరాలపాటు నిలుస్తుంది. అరకొర చదువులు చదివి, డిగ్రీలు సంపాదించి తద్వారా వారికి తెలిసిన రాజకీయ నాయకుల ద్వారా లేదా ఆర్థికస్తోమత బాగుంటే, ఉద్యోగానికి కావల్సిన అర్హతలు లేకపోయిన డబ్బులు కట్టి, ఉద్యోగాలు కొనుక్కొని ఇంజీనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు అయితే దేశం రాష్ట్రం అభివృద్ది వైపు ప్రయాణించలేవు.
ప్రపంచంతో మన యువత పోటీ పడేలా ఎప్పటికప్పుడు, మన విద్య విధానాలను సమీక్షించుకుంటూ.. ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే మన విద్య విధానాల్లో అవి అవలంబించి తద్వారా ప్రపంచానికి అవసరమయ్యే యువతను, నైపుణ్యాన్ని
సాధించే దిశగా అడుగులేయాలి. ఎప్పటికప్పుడు విద్యార్థుల చేత సెమీనార్లు నిర్వహిస్తు, వారిని ప్రభుత్వ అభివృద్ధిలో భాగం చేస్తూ వారి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోవాలి. గ్రామ మండల స్థాయిల్లో విద్యర్థులను భాగస్వామ్యం చేసి, వాళ్ళను వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి. పాఠశాల స్థాయి నుండే వారికి సేవాగుణం అలవరచాలి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక ప్రత్యేక పాఠాన్ని ప్రవేశపెట్టాలి. దానికోసం ఇప్పుడున్న ఉపాధ్యాయిని/ఉపాధ్యాయులను అన్నీ విధాలుగా ప్రోత్సహించి వాళ్ళను సన్నద్ధం అయ్యేలా చూడాలి. విద్యార్థి దశలోనే పిల్లలకు మానవతా విలువలు నేర్చించాలి. తద్వారా సమాజంలో జరిగే అత్యాచారాలు, ఆడవారి మీద దాడులు తగ్గుముఖం పడతాయి. ప్రభుత్వ పాఠశాల/కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయునులు వాళ్ళ సొంత బిడ్డల వలె విధ్యార్థులకు భోదించి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది కేవలం నెల జీతం అందుకొని, కేవలం విద్య అనేది పాఠ్యాంశ పుస్తకాలకే సంబంధించినది, మార్కులు ర్యాంకులకు సంబంధించినది అనే అభిప్రాయాన్ని వీడనాడలి. ఉపాధ్యాయులు భోదించిన విషయాలే విద్యార్థులకు అతి ముఖ్యం కనుక ఉపాధ్యాయుల్లో ఉన్న ఇలాంటి కొంతమంది కేవలం జీతం కోసం అనే ఆలోచన వీడనాడి ఒక దేశానికి అవసరమయ్యే విద్యార్థులను తయారుచేస్తున్నాం అని భావించాలి.
నేటితరం తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒత్తిడి లేకుండా చేసి, వాళ్ళను వారి భవిష్యత్తుకు సంబంధించి స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలి. మార్కులు ర్యాంకులు చుట్టూ పిల్లల విధ్యాభ్యాసాన్ని చూడకూడదు. వారు మానసికంగా ఎదిగేవిధంగా, సొంత నిర్ణయాలు. తీసుకునేలా. వాళ్ళకు వివిధ విషయాల పట్ల అవగాహన కలిపించే విధంగా చొరవ చూపాలి. చదువంటే కేవలం ఉద్యోగం తెచ్చుకొని తద్వారా సంపాదించే డబ్బు అనే ‘భమలోనుండి బయటకు వచ్చి చూడాలి. మన చదువులు, ఒకరు పెట్టిన కంపెనీలో ఉద్యోగం చేయడానికే కాదు…. మన విద్యార్థులే’యువతే స్వతహాగా ఒక కంపెనీ పెట్టి నలుగురికి ఉద్యోగం ఇచ్చి ఉపాధి కలిగించేలా మన విధ్యావిధానాలు మర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా మన దేశ రాష్ట్ర యువతను ప్రోత్సహించాలి. మన దేశ యువత ఇక్కడే ఉండి, వివిధ సాఫ్ట్వేర్ సంస్థలను, కంపెనీలను, చిన్నతరహా మధ్యతరహా పరిశ్రమలను స్థాపించి విదేశీయులు సైతం మన కంపెనీల్లో పనిచేయడానికి, మన దేశం వైపు చూసే పరిస్థితి తీసుకురావాలి. మన దేశ రాష్ట్ర జ్ఞాన సంపద అయిన మన దేశ దేశ యువతను వేరే దేశాలకు పోకుండా, మన దేశ అభివృద్ధికే తోద్చడేలా, వారికి ఇక్కడే మంచి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.
ప్రపంచంలో ఏదైనా కొత్త ఆవిష్కకరణ జరిగిందంటే, ఇతర దేశాల వైపు చూసే మన దేశ ప్రజల పరిస్థితి మారాలంటే, మన దేశం రాష్ట్రంలో గల విద్యర్థులకు పాఠశాల స్థాయి నుండే వారికి ప్రయోగాలు, ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించాలి. ప్రపంచ మార్కెట్ మనవైపు చూసేలా మన కొత్త ఆవిష్కరణలు జరగాలి. విద్యర్థులను శాస్త్రవేత్తలుగా ఎదిగేలా తద్వారా మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేసేలా పాఠశాల స్థాయి నుండే మొదలయ్యే విధంగా. తోడ్చాటు అందించాలి. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మన భారతదేశాన్ని జ్ఞాన భారతంగా చూసే రోజులు కనిపిస్తాయి. ఈ విధంగా దేశం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే, ప్రపంచ దేశాల ముందు భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. అది నాణ్యమైన విద్యతోనే సాధ్యం అవుతుంది
చివరగా “అవసరం ఒక కొత్త ఆవిష్కరణకు ఎలా అయితే దారితీస్తుందో”, “నాణ్యమైన విద్యవిధానం, ఉత్తమ విలువలు” ఒక దేశ భవిష్యత్తును మారుస్తాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
By
కొన్నిపాటి రవి
ట్విట్టర్ ఐడి : @KPR_India