జీజీహెచ్‌లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని, సీటీ స్కాన్ వాడుకలోకి తీసుకురావాలని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించి కోవిడ్ రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు ప్రభుత్వం అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ జొన్నా ప్రభాకర్‌ను కలిసి ఆసుపత్రి సమస్యలపై మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ ఆరోగ్య సంజీవిని పెద్దాసుపత్రేనని, ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, నర్సులు, కాంపాండర్లు, పారిశుధ్య సిబ్బంది తమ శక్తిమేర కృషిచేస్తున్నారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ప్రభుత్వం నుండి అందే అరకొర వసతులతో వీరు శక్తికి మించి పనిచేస్తున్నారని, వీరి జీతాలను ప్రభుత్వం రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కోవిడ్ సందర్భంగా పనిచేసిన డాక్టర్లకు, సిబ్బందికి ఇప్పటికీ జీతాలు చెల్లించలేదని, అవి చెల్లిస్తే మరింత మంది వచ్చి ఇక్కడ పనిచేస్తారని సిబ్బంది కొరత ఉండదని తెలిపారు. అదేవిధంగా ఆక్సిజన్ సరఫరా వేగంగా లేనట్లు తాము గుర్తించామన్నారు. నెల్లూరు పొగతోటలో మెడికల్ మాఫియా జరుగుతోందని కొంతమంది డాక్టర్లు అత్యాశకు పోయి పొగతోటలోని కొన్ని ఆసుపత్రుల్లో అనధికారికంగా సుమారు 150 బెడ్లు సమకూర్చి రోజుకు ఒకబెడ్‌కురూ. 40 వేలకు పైగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటిపై జిల్లా కలెక్టర్ దృష్టిసారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అవసరం ఉన్నా లేకున్నా సీటీ స్కాన్ రాస్తున్నారని, సీటీస్కాన్ సెంటర్లలో లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సీటీ స్కాన్ యంత్రాన్ని వాడుకలోకి తెస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్‌రెడ్డి, మోషే, హేమంత్, రాయల్ తదితరులు పాల్గొన్నారు.