ఓటు వేయాలా ? వొద్దా అని ఆలోచించొద్దు.....అవి "ఎన్నిక"లు. అని అన్నారు ఒక ప్రఖ్యాత వక్త. " ఓటు అనేది ప్రతీ పౌరుడి హక్కు. మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే" అని హిల్లరీ క్లింటన్ చెప్తారు. బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తిని పొంది, సొంత రాజ్యాంగాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్న తరువాత 1951 ప్రజల పాతినిద్య చట్టం నుండి ఓటు హక్కును మనకు అందించారు. మనదేశం లో 1950 నుండి ఎన్నికల సంఘం ఏర్పాటయింది. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటుహక్కును కల్పించారు. ఓటు ద్వారా తమను పరిపాలించే నాయకులను పౌరులు ఎన్నుకునే ప్రక్రియే "ఎన్నికలు". దీనిలో ఓటు వేసే పౌరులనే "ఓటర్లు" అనడం పరిపాటి.1951 నుండి ఎన్నో సార్లు ఎలక్షన్స్ జరిగాయి. 2011 నుండి మాత్రమే మనదేశం లో "ఓటరు దినోత్సవం" జరుపుకుంటున్నాము. 2011 జనవరి 25, అప్పటి మన దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు వినియోగాన్ని, ఓటు యొక్క విలువను, ప్రాముఖ్యతను, ఓటు పొందే క్రమాన్ని ప్రజలలో అవగాహన తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు 13 వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటు వేయాల్సిన భాధ్యతను గుర్తు చేసుకుంటూ......
జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఓటరు గా గుర్తింపు పొందాలి. " ఓటరు గా గర్వపడండి. ఓటు వేయడానికి సిద్దమవ్వండి అని ఎన్నికల సంఘం నినాదమిస్తుంది. ఓటరుగా గర్వపడటం అంటే? చాణక్య నీతి శాస్త్రం ప్రకారం కోపం, గర్వం ఎవరికి ఎక్కువ గా ఉంటాయి అంటే.. నిజాయితీగా ఉండే మనుషులక అని చెప్తాడు. ఓటరు గర్వపడే లాగా ఉండాలి అంటే మరి నీతిగా ఓటు వేయాల్సిందే. "నీతి" గా ఓటు వేయడం అంటే ? ఈ రోజున దేశంలో కులానికి ఒక పార్టీ. మతానికి ఒక పార్టీ, భాషకు ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ, ఇలా వాట్సప్ గ్రూప్స్ మాదిరి పార్టీలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ..... దేశానికి మంచి నాయకులను, మంచి పాలనను అందిస్తున్నాయా? అని విశ్లేషించే ముందు భారతీయ మొట్ట మొదటి ఓటరు గురించి ఓటరు దినోత్సవం నాడు ఒకసారి తెల్సుకుందాం. కొంచం స్ఫూర్తిని పొందుదాం. మనదేశ మొట్ట మొదటి ఓటరు శ్యామ్ శరన్ నేగి. 1917లో పుట్టి హిమాచల్ ప్రదేశ్ లో టీచర్ గా భాద్యతలు నిర్వహిస్తూ దేశానికి మొట్టమడటి సాటి జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఓటు వేసిన నేగీ. 1917 లో పుట్టాడు. 1947 లో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. వచ్చిన 4 ఏళ్ల కి ఎలక్షన్స్ జరిగాయి. తను చనిపోయే నాటికి 2022 నవంబర్ 5 కి 34 సార్లు జరిగిన ఎలక్షన్స్ లో ఆయన ఓటు వేశారు. 105 సంవత్సరాల వయస్సులో కూడా. తన మొదటి ఓటు వేసే నాటికి ఆయన వయస్సు కూడా 34 సంవత్సరాలు కావడం గమనార్హం. కురు వృద్ద వయస్సులో కూడా ఓటు హక్కును వినియోగించుకున్న భారత దేశ విలువైన ఓటరు తను. ఓటు విలువ తెలిసిన పౌరుడు తను. 105 వయస్సులో కూడా ఓటు వేయాల్సిన అవసరం ఏముంది ప్రస్తుత దేశ పౌరులు ఓటుకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి, పోటీ చేసిన అభ్యర్ధి ఒకే కులస్తుడు ఐతోనో, ఇలా ఏదొక నజరానా ఉంటే తప్ప ఓటు వేయని దుస్తితి ఏర్పడింది. నీతిగా ఓటు వేయడం, నిస్వార్థం గా రాజ్యాంగ బద్దంగా పరిపాలన చేసే నాయకులను ఎన్నుకోవడానికి మనం ఓటు వేస్తున్నామా?
ఓటు "విలువ " వేలల్లో చూస్తున్న పౌరులు, కుల మత, లింగ, జాతి, ప్రాంత, భాష విభేదాలతో ఓటు వేసినంత కాలం కామన్ మాన్ గానే మిగిలిపోతాము. ఒక టీ వాల ప్రధాన మంత్రి అయ్యాడు అంటే అది ప్రజాస్వామ్యం లో మార్పు, ఓటరు తీర్పు అనుకున్నాం. కానీ "వాల" వెనుక ఒక మత పరమైన సంస్థ, అపర కుబేరుడు హస్తం ఉన్నాయి అనీ తెలిశాక... ఓటరు మళ్ళీ మోసపోయాడు. ఎవరిని నమ్మాలి? ఏం చూసి ఓటు వేయాలి? మనదేశం ఏమైపోతుందో? ఆలోచించే సమయం పౌరుడికి లేదు. అలా అని సంపాదించుకునే పనులు లేవు. ఉద్యోగాలు, వ్యసాయం, సంక్షే మం, స్వేచ్ఛ, ఆడవారికి రక్షణ, ఇవన్నీ పురోగతి దిశగా ఉన్నాయా? స్వార్దం తప్ప, దేశ సేవ , దేశ భక్తి, నాయకులలో కనపడుతున్నాయా? మనిషికి కష్టం వొస్తే... నష్టం కలిగితే.... అన్యాయం జరిగితే ... పోలీస్ స్టేషన్ కి, అధికారుల దగ్గర కి వెళ్ళడం మానేసి, పొలిటికల్ లీడర్ దగ్గర కి పోయి, కులం పేరు చెప్పి... పనులు జరిపించుకునే కు సంస్కారంతో నేడు దేశ ప్రజలు బ్రతుకుతున్నారు తప్ప, నేను నీతిగా... డబ్బు తీసుకోకుండా, కులం చూడకుండా, నిస్వార్థంతో, కేవలం జాతి మనుగడకు, అభివృద్ధికి, మాత్రమే ఓటు వేసాను అనే ఓటరు నేడు మన దేశంలో ఉన్నాడా? ఓటు విలువ చాటి చెప్పకుండా... ఓటు హక్కుని ఇచ్చి, ఓటరు దినోత్సవం పేరుతో ఓటర్ల లో ఉత్తేజాన్ని నింపుటకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. ఇలాంటి ఉపయోగకర కార్యక్రమాలు కూడా వ్యతిరేక పార్టీ మొదలు పెట్టినవి, అధికార పార్టీలు ఆచరించవు. ఒక ప్రభుత్వం పెట్టిన పథకం ఇంకో ప్రభుత్వం కొనసాగించదు. ఇది మన దేశకర్మ. మన ఓటుకు పట్టిన పీడ. ఇలాంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నాము. ఇప్పటి జాతీయ ఓటరు దినోత్సవం నేడు నీలో మార్పు తేవాలి? నిస్వార్థా నికి నువ్వు ఓటువేయాలి. నీ ఓటుకు నీ దేశ అభవృద్దే విలువ కట్టాలి. ఇదే నేటి నీ నినాదం కావాలి. నీ "ఎన్నిక" ఎవరిని? ఎందుకు? అనేది ఓటు పోటుతో నిరూపించు. జై హింద్.
రచన: కల్పన మధిర
కలం. : రత్నమణి హారం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com