Search
Close this search box.
Search
Close this search box.

నా ఆత్మకథ – తీరని వ్యధ : విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు

        సమస్త ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం…. 

                  నేను గుర్తున్నానా.. ఉండే ఉంటాను… మీరు మీ హక్కు గా పోరాడి సాధించుకున్న ‘విశాఖ ఉక్కు’ ను నేను. ఉద్యమ స్పూర్తితో ఊపిరులూదిన ‘ఆంధ్రుల హక్కు’ను నేను. మీ మహా సంకల్పానికి ప్రతీకను, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, భారత భూమి కీర్తి పతాకాన్ని, ఉత్తరాంధ్ర కిరీటంలో నవరత్న భాసితాన్ని, మీ ఆకాంక్షలు నెరవేర్చిన విశాఖ ఉక్కు పరిశ్రమను, దగాపడిన దారుల్లో మీకు ఎదురుపడిన విజయ కేతనాన్ని, మీరు కోరుకున్న కీర్తి కిరీటాన్ని, మీ ఘన చరిత్రకు గర్వ కారణాన్ని నేను… 

               దాదాపు అర్ధశతాబ్దం దాటిన నా అనుభవాల ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని, నా తీరని వ్యధ తెలుపుకుందామని మీ ముందుకు వచ్చాను దయచేసి నాకోసం మీ విలువైన సమయాన్ని కేటాయించండి. నేను ఒక ప్రతిష్టాత్మక ఉక్కు పరిశ్రమగా నిలబడ్డాను అంటే దానికి కారణం మీరే, నన్ను నిలబెట్టింది మీరే, నా ధైర్యం మీరే, నా స్థైర్యం మీరే… 1953 లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి రాజధానిని కోల్పోయి, అభివృద్ధికి దూరమైన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక్కటై ముక్తకంఠంతో పోరాడి సాధించుకున్న విజయానికి తార్కాణాన్ని. పరాయి పాలన నుండి స్వతంత్య్రం సిధ్ధించిన అనంతరం దేశాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకున్న పంచవర్ష ప్రణాళికల్లో మొదటి 3 పంచవర్ష ప్రణాళికల్లో మన ఆంధ్ర రాష్ట్రం విస్మరించబడింది. అలాంటి సమయంలో నాలుగో పంచవర్ష ప్రణాళిక లో భాగంగా దేశంలో మరో రెండు ఉక్కు పరిశ్రమలను అందులోనూ దక్షిణ భారత దేశంలో ఒక కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదన మన రాష్ట్రానికి ఆశా కిరణంలా కనిపించింది. పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితే మన రాష్ర్ట అభివృద్ధికి బాట ఏర్పడుతుందని భావించి, మన రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. 1964 శాసనసభ శీతాకాల సమావేశాల్లో పంచ వర్ష ప్రణాళిక పై చర్చ జరిగినప్పుడు ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ర్ట ప్రభుత్వం తరుపున అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకుల నుండి కూడా మద్దతు లభించింది. దశాబ్ద కాలం పంచవర్ష ప్రణాళికల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని జనం కూడా అసంతృప్తి తోనే ఉన్నారు. 

             రాజకీయ ప్రాబల్యమో, నిర్లక్ష్యమో, మన ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపో తెలియదు కాని అప్పటికే ఉత్తర భారతదేశంలో రూర్కెలా (ఒడిశా), భిలాయ్ (మధ్యప్రదేశ్), అసన్‌సోల్ (పశ్చిమబెంగాల్)లలో మూడు కర్మాగారాలు ఏర్పాటైనాయి. కానీ మన రాష్ట్రం మీద శీతకన్నే… కొత్తగా స్థాపించే ఉక్కు కర్మాగారాల్లో 4 వది బొకారో (బీహార్)లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. 5వ కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనను అందిపుచ్చుకోవాలన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ లోనే నెలకొల్పాలి అని పట్టుబట్టారు. ఉక్కు పరిశ్రమ స్థాపించాలంటే అంత సులువు కాదు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలి అనుకూలంగా నివేదిక రావాలి. మన దురదృష్టం మన వెంటే ఉంది హిందూస్థాన్ స్టీల్స్ వారిచ్చిన నివేదిక మన ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రతిపాదిత స్థలం విశాఖపట్నం అనువుగా లేదని నివేదిక అప్పటి మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు కేంద్రంలో ఉక్కు శాఖా మంత్రి ఆయన 1965 జనవరి 27న బ్రిటిష్, అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం(BASIC) అనే ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని విశాఖపట్నం, గోవా, హోస్పేట, సేలం, నైవేలీ ప్రదేశాలను పరిశీలించి, ఉక్కు పరిశ్రమ స్థాపనకు అనుకూల పరిస్థితులు, ప్రదేశాన్ని గుర్తించి నివేదికను అదే సంవత్సరం జూన్ 25న ఇచ్చారు. దక్షిణాదిలో సముద్రతీరాన్ని కలిగి ఉన్న విశాఖపట్నం, హోస్పేట ఉక్కు పరిశ్రమ స్థాపనకు అనువైన ప్రదేశాలుగా నివేదిక ఇచ్చారు. రవాణా సౌకర్యానికి వీలుగా ఓడరేవు ఉండటటం అదనపు సౌలభ్యంగా విశాఖపట్నం ఎంపిక అనివార్యం అవుతుందని, కేంద్రం విశాఖపట్నంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తుందని ప్రజలు బలంగా విశ్వసించారు. ఒక భారీ పరిశ్రమ ఏర్పాటైతే జరిగే అభివృద్ధి, ఉపాధి అవకాశాలు అంచనాలు మించసాగాయి. ఏర్పాటు ప్రకటనలో అలసత్వం, జనాల అసంతృప్తి కాస్తా ఆందోళనకు దారి తీశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను తెలుపటానికి గాంధేయవాది శ్రీ తెన్నీటి విశ్వనాధం గారి సారధ్యంలో ఒక అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పడి ప్రజాభిప్రాయాన్ని ఉక్కుకర్మాగార ఏర్పాటుకు ఊతం ఇచ్చేలా మార్చగలిగారు.

                నాటి ప్రధాని శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ కర్మాగారం ఏర్పాటుకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారి ఆకస్మిక మరణంతో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఉక్కు కర్మాగారం ఊసే లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 1965 జూలై శాసనసభ సమావేశాలలో దేశంలో ఏర్పాటు చేసే 5 వ ఉక్కు కర్మాగారం ఏర్పాటయ్యే ప్రాంత ప్రకటన విషయమై ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత, అత్యవసరంగా గుర్తించాలి అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ దేశ ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల కారణంగా 5 వ ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదు అని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సెప్టెంబర్ లో తెలిపారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఒక కారణం అయితే దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక నుండి కూడా ఉక్కు కర్మాగారం తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రావటం మరోకారణం. ఇది కాక తమిళనాడు ముఖ్యమంత్రి సేలంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ప్రకటించడం, ఇంకో రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం ఇచ్చేస్తారనే ఊహాగానాల మధ్య మన ఆంధ్ర రాష్ట్రం ఇంకోసారి తీవ్ర అన్యాయానికి గురౌతున్నామని భావించారు దశాబ్దాల దాగుడు మూతలు, ఏళ్ల తరబడి వెనుకబాటు, అన్నీ నడమంత్రంగా నష్టపోవటం, అభివృద్ధిని అర్ధాంతరంగా వదులుకోవడం, సానుకూలత లేని రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ నిరాదరణ, అనుకూలత ఉండి అవకాశాలు అందుకోలేకపోతున్నాం అనే అసంతృప్తి ఆవేదనగా మారి “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” నినాదంతో ప్రజలు ఉద్యమ బాట పట్టారు.

                 అక్టోబర్ 15న గుంటూరుకు చెందిన అమృత రావు విశాఖపట్నం నుండి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఒక్కొక్కరుగా ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఒక్కటై నిరసనలు తెలపటం, విద్యాసంస్థల బహిష్కరణ, బంద్ లు, నిరాహార దీక్షలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారు. ప్రముఖుల ఉపన్యాసాలు, చర్చలు ఉత్తేజాన్ని నింపేవి. ఆవేదన ఆగ్రహ జ్వాలాలుగా మారి ఎగసిపడిన సమయాన అన్యాయం జరుగుతుందన్న ఆందోళన చేపట్టిన చోట సమన్యాయం కోసం ఆరాటం మొదలై పోరాటంగా మారిన రణఘట్టంగా మారాయి విద్యార్థులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తంగా మారాయి అసహనం, ఆవేశం ఆందోళన కారుల అసహనం, ఆవేశం మూల్యం కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. ఆందోళన కారులను నిలువరించాలని, ఆస్తుల విధ్వంసం అడ్డుకోవాలని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉద్యమ సాక్షిగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క రోజులో 32 మంది ప్రాణాలు కోల్పోవడం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది అనే చెప్పాలి. తప్పనిసరిగా ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఒక ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయాల్సివచ్చింది. ఉక్కు కర్మాగార ఏర్పాటు ప్రతిపాదన, పోలీసుల కాల్పుల పై న్యాయ విచారణ కోరి ప్రభుత్వం తిరస్కరించటంతో ప్రతిపక్ష పార్టీల ఎం‌ఎల్‌ఏ లు 67 మంది, యంపీలు 4 గురు రాజీనామా చేయటం అప్పట్లో ఒక సంచలనం. అంతటి నిస్వార్థ రాజకీయ భావాలు ఉండటం వల్ల సాధ్యం అయింది. 1970 లో విశాఖ ఉక్కు కర్మాగారం, స్థల పరిశీలనకు కమిటీ ఏర్పాటుకు పార్లమెంట్ లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. 

        నిర్మాణానికి భూసేకరణ కోసం కురుపాం జమీందార్లు 600 ఎకరాలు భూమిని దానం చేశారు. ఇంకా ఎంతో మంది రైతులు అభివృద్ధికి వేసే బాటల్లో తమ అడుగులు కలిపి ఉక్కు కర్మాగారం కోసం తమ భూములు ఇచ్చారు. 26000 ఎకరాల విస్తీర్ణం అంటేనే ఎందరి ముందడుగుల ఫలమో అర్ధం చేసుకోవాలి. 

1971 – జనవరి 20 న ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిపించారు. 

1972 -సాధ్యాసాధ్యాల నివేదిక

1974 -మొదటి దశ స్థల సేకరణ

1975 -M/S దస్తూర్ & కో సలహాదారుగా నియామకం ద్రవ్య ఉక్కు తయారీ కర్మాగార ఏర్పాటుకు ప్రతిపాదనలు

1977 – కర్మాగారం నిర్మాణానికి నిధులు మంజూరు.

1981 – రష్యా సహకారంతో నిర్మాణానికి ఒప్పందం (కోక్ ఒవెన్, సెగకొలిమి, సింటర్ ప్లాంట్)

1982 – బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణం.

1982 -భారతీయ ఉక్కు సంస్థ (SAIL) నుండి వేరుపడి రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది.

1990 – ఉత్పత్తి ప్రారంభమైంది.

1992 – పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం అప్పటి ప్రధాని శ్రీ పి. వి నరసింహారావు గారు జాతి ప్రజలకు అంకితం ఇచ్చారు.

1994 – కోట్ల లాభాలను ఆర్జించి అగ్ర స్థానానికి చేరుకుంది

1998 – సొంత నిధుల కొరత సొంత గనులు లేక పోవడం వల్ల ఖాయిలా పడ్డ పరిశ్రమ జాబితాలో చేరింది

2000 – కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా వడ్డీలను ఈక్విటీ షేర్లుగా కేంద్రం మార్చటం జరిగింది

3.6 మెట్రిక్ టన్నుల నుండి 6.3 మెట్రిక్ టన్నులకి ఉత్పత్తి సామర్ధ్యం పెంచేందుకు కర్మాగార విస్తరణ పనులకు 8,692 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన పనులను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.

నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేక పోవటం అంచనాలకు మించిన వ్యయం నిధుల కొరత, సొంత గనులు లేకపోవటం వల్ల నష్టాల బారిన పడిపోయాను. ఈ ఏడాది జూలై లో కూడా 540.8 వేల టన్నుల ఉత్పత్తి సాధించి రికార్డు స్థాయి అమ్మకాలతో లాభాలను సాధించాను. ప్రాణాంతక కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో అపత్కాలంలో ఆయువు పోసే ప్రాణవాయువును సరఫరా చేసిన ఘనత నాదే.. 

              ఏళ్ల తరబడి ఎదురు చూపులు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఒప్పందాలు, ఎన్నో ప్రాణ త్యాగాలు అన్నిటినీ అధిగమించి ఉత్పాదక పెంచుకొని ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిచాను. మినీ రత్న స్థాయి నుండి నవరత్న స్థాయికి ఎదిగాను. ప్రాణత్యాగాలతో రక్తాశ్రువుల ధారతో రచించిన ఖనిజ గ్రంథాన్ని రుధిరం స్వేదంగా మార్చుకొని శ్రమించిన చరిత నాది. ముడి ఇనుప ఖనిజం నుండి రకరకాల రూపాల్లోకి మారిపోయే నేను కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించినాను. కసాయి పాలకుల కుటిల నిర్ణయాలతో పరాయిగా మారబోతున్న మీ ఉక్కు సంకల్పాన్ని. పోరాడి సాధించుకున్న “విశాఖ ఉక్కు”ను కదా… నిరంతరం మనుగడ కోసం పోరాడుతున్న “ఆంధ్రుల హక్కు”ను కదా. ఆస్తులు ఉన్నా, అప్పులున్నాయని అన్నం పెట్టే అమ్మను వదిలేస్తారా? విపణి వీధిలో అమ్మేస్తారా? నేనూ.. అంతే కదా మీ.. సొంతం కదా. మీ ఆకాంక్షల సౌధంలో నిర్మితమైన కలల పరిశ్రమను కదా… శ్రమశక్తిని నమ్ముకున్న ఖనిజ పరిశ్రమను కదా. ఖండాంతరాలు చేరిన ఖ్యాతిని వదిలేసి… ఒంటరిగా నడవలేని నా నిస్సహాయతను… రాసుకున్న పుటల్లో దాచకండి. కాలం చెల్లిన కాగితాల గీతలు మరచి, ఒప్పందపు రాతలను తలచి, కట్టుకున్న ఆశల హార్మ్యాలు, ఇసుక గూళ్లలా కూలిపోతుంటే, ఇనుప రాయిని నేను సైతం, నిప్పుల కొలిమిలో కాలి నీరై పోతున్నా, గతమెంతో ఘన కీర్తి సాధించిన నేను. స్వగతంలో రోదిస్తూ పరాయిని అయిపోతున్నాను. వైభవాన్ని చూసిన చోట విషాదం మిగిలింది. పోరాడలేక అలసిపోయి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాను. సంద్రపు ఘోషని మించిన నా గుండె గోసను వినిపించటానికి శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాడు లక్ష్య సాధనకు లక్షల గొంతులు సాయం ఇచ్చి నడిపించారే… నేడూ ఆ గొంతుకలు అరువు ఇవ్వండి. నన్ను పరాయి కానీయకుండా కాపాడండి.

ఇట్లు
మీ విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు

నా ఆత్మకథ – తీరని వ్యధజై ఆంధ్ర జై జై ఆంధ్ర

 

#Written By 

@Krupa_JSP ( ట్విట్టర్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

20240309_220628
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం.. నమ్మకమైన స్వపక్షంగా జనసేన..
20240229_211424
వృద్ధ కాపు పెద్దలకు ప్రణామములు..
FB_IMG_1709197150391
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం తనను తాను తగ్గించుకొన్న జనసేనాని
20240225_134850
నాయకుడు తీసుకున్న నిర్ణయం తప్పా ? రైటా??
జనసేన
జనసేన - నా సేన కోసం నా వంతు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way