గత కొన్ని వారాలుగా ఆంధ్రా ప్రజానీకాన్ని మాత్రమే కాక పక్క రాష్ట్రాలను కూడా ఉలిక్కిపడేలా చేసిన వార్త "ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు రవాణా అవుతున్న గంజాయి".
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా గంజాయి సాగు జరుగుతోందని మన నాయకులకు తెలియదా! స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదా? ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.90 లక్షల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గత పదేళ్లతో పోలిస్తే గతేడాది స్వాధీనం చేసుకున్న గంజాయే ఎక్కువ అని 26/10/2021 తారీఖున జరిగిన విలేకరుల సమావేశంలో డిజిపి గౌతమ్ సవాంగ్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
విశాఖ ఏజన్సీ ప్రాంతంలో దాదాపు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందన్న సంగతి ప్రభుత్వ అధికారులకు, పాలక పక్ష నాయకులకు తెలియదంటారా? ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు విలేకరుల సమావేశం పెట్టి ఆంధ్రా నుంచి రవాణా అవుతున్న గంజాయి అని చెప్పాకే ఆంధ్రా పోలీసులకు, అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలిసిందా? జనసేనాని గంజాయి సాగు, రవాణా అంశం మీద ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వెంటనే హుటాహుటిన పోలీస్ దొరలు ఎందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను ఒప్పుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతోనో, అనాలోచితంగానో ట్వీట్లు చేయలేదు. ఆయన దగ్గర ఈ గంజాయి వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం ఉంది. ఈ సమస్య పై ఆయనకు సమగ్ర అవగాహన కూడా ఉంది. ఈ అంశాన్ని ప్రజలు రాజకీయ కోణంలో చూడరాదు, ఇదొక సామాజిక సమస్యలా చూడాలి.
మనం గమనిస్తే జనసేన అధినేత 2018 ఉత్తరాంధ్ర పర్యటన సందర్బంగా ఈ గంజాయి సాగు మరియు రవాణా అంశాన్ని తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. నిరక్షరాస్యులను, నిరుద్యోగులను మాదకద్రవ్యాల మాఫియా ఎలా ట్రాప్ చేసి వాడుకుంటుందో చాలా స్పష్టంగా వివరించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వ అధినేత తన భవిష్యత్తే అగమ్యగోచరంగా ఉందని గ్రహించి సొంత పనులు చక్కబెట్టే ప్రయత్నాలలో ఉన్నారు తప్ప ఈ గంజాయి వ్యవహారం పై ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్టు కానరట్లేదు. నిరుడు పదేళ్లలో కన్నా గతేడాది 2020 -21 అత్యధికంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే ఈ సమస్య తీవ్రతను మనం అర్ధం చేసుకోవచ్చు.
"సరిహద్దు కూడా లేని ఆంధ్రా నుంచి గంజాయి మా రాష్ట్రానికి రవాణా అవుతోందంటే ఖచ్చితంగా ఇది ఆంధ్రా అధికార యంత్రాంగం వైఫల్యమే" ౼ పోలీస్ ఉన్నతాధికారి, కేరళ
"దోషులను విచారిస్తే విశాఖ ఏజన్సీ ప్రాంతాల నుంచే గంజాయిని తరలిస్తున్నట్టు తెలిపారు" ౼ పోలీస్ ఉన్నతాధికారి, కర్ణాటక
ఇక్కడ మరో ముఖ్య అంశం ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకినాడ పోర్టులో పట్టుబడ్డ పలువురు స్మగ్లర్లను పెద్దమనుషులుగా అభివర్ణించడం! ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఇంకా ఎన్ని అరాచకాలు, అక్రమాలు ఏ ముసుగులో సాగుతున్నాయో అన్న అనుమానం కలుగకమానదు. ఏదేమైనా చక్కటి పర్యాటక ప్రాంతంగా, ప్రశాంతమైన నగరంగా ఖ్యాతిగాంచిన విశాఖపట్నం నగరం మీద ఈ గంజాయి వ్యవహారం ఒక మాయని మచ్చే అని చెప్పొచ్చు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్నాళ్ళకు రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి అన్నది నిర్వివాదాంశం. వైసీపీ నాయకులు ఆగ్ర నేతలు మాట్లాడుతూ మా ప్రభుత్వంలోనే జరిగిందా గత టీడీపీ ప్రభుత్వంలో జరగలేదా ? అన్న మాటలు వారి నుండి వినిపిస్తుంటే, వాళ్లేనా మేము దోచుకోకూడదా అన్న చందాన తీరు కనిపిస్తోంది. గంజాయి వ్యవహారంలో గురించి దేశం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంటే మన తెలుగు మీడియా వాటిని పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం.
Written By
@27dots_ ( ట్విట్టర్ )
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com