నెల్లూరు, (జనస్వరం) : రాజధాని కోసం జీవితాలను త్యాగం చేసి భూములు ఇచ్చిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకున్న తరవాత వెనక్కిపోయినప్పుడు వారికి అండగా నిలబడాలని తెలిపారు. రైతులను మోసం చేసే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించకూడదన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ అమరావతి నుంచి తిరుపతి వరకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లాలో శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర
కార్యదర్శులు, అసెంబ్లీ నియోజక వర్గాల ఇంచార్జులు, నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, వీర మహిళలు
వెంటరాగా కోవూరు తాలూకా సెంటర్ నుంచి బజార్ సెంటర్ వరకు రైతులతో కలసి నడిచారు. అనంతరం బజార్ సెంటర్ లో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం గర్వపడే రాజధాని కావాల్సిన అమరావతి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న పాదయాత్రను బలపర్చడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. రాజధాని కోసం త్యాగాలు చేసి భూములు ఇచ్చిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదేపదే చెబుతూ ఉంటారు. బాధ్యత అంటే ప్రభుత్వ ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతాంగాన్ని మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ఆ రైతుల్ని మోసం చేసే విధంగా ఉండకూడదని అన్నారు.