స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి సుమారు 118 వేల మందిను పదవులకు దూరం చేసిన వైసీపీ ప్రభుత్వం 50 నుంచి వంద నామినేటెడ్ పదవులు ముష్టి వేస్తే బీసీల ఆత్మ గౌరవం నిలబడుతుందా అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. బీసీలను సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు,కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాకుండా అడ్డుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి ముమ్మాటికి బీసీ ద్రోహి అన్నారు. ఆదివారం కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయములో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను వాడుకోవాలని కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. బీసీలతో పల్లకీ మోయించడానికే 50 శాతానికి పైగా నామినేటెడ్ పదవులు ఇచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. ముఖ్యమైన పోస్టులను ఒకేసామాజిక వర్గానికి కట్టబెట్టి, ఉనికిలో లేని, చెల్లుబాటుకాని పోస్టులు బడుగు, బలహీన వర్గాలకు కేటాయించారని అన్నారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాపు విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోకూడదనే కుట్రతోనే విదేశీ విద్య పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. పెళ్లికి ఆర్థిక అండ లేకుండా చేసి పేద యువతులను బాధపెడుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీమైనార్జీల్లో అన్ని వర్గాలకు, వారి కుల కార్పొరేషన్లతో కలిపి మొత్తం 750 పదవులు ఇస్తే, ఒక సామాజిక వర్గానికి వెయ్యికి పైగా పదవులు ఇచ్చారని ఆయన తెలిపారు. గ్రంథాలయ కార్పొరేషన్‌కు నియామకాలు చేపట్టవద్దని కోర్టు చెప్పినా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు నియమించారని అని అన్నారు. ఆర్టీసీలో రకరకాల రీజియన్లు పెట్టి పదవుల పందేరం చేపట్టారని విమర్శించారు. ప్రభుత్వం తరపున మాట్లాడాలన్నా ప్రభుత్వ పథకాలు ప్రకటించాలన్నా సజ్జలరామకృష్ణారెడ్డే సోలో పర్ఫార్మెన్స్ చేస్తారని విమర్శించారు. శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణ సజ్జల చేతుల మీదుగానే జరుగుతాయని పోతిన అన్నారు. బీసీ, ఎన్సీ, ఎన్టీ, మైనార్టీ మంత్రులు గుర్తుకు రారు అని విమర్శించారు. రాష్ట్రంలో బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి, ఆత్మగౌరవం ఒక్క జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని పోతిన మహేష్ గారు అన్నారు.