Search
Close this search box.
Search
Close this search box.

భారతీయం – వైదిక సంప్రదాయం

భారతీయం

సనాతన ధర్మంగా నేడు పిలవబడుతున్న హిందు మతం ప్రాచీన భారత దేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సంస్కృతి. ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతలలో కెల్లా అతి పురాతనమైన, ప్రాచీనమైన సంస్కృతి. సృష్టి ఆరంభం నుండి సృష్టిలోని సమస్త జీవరాశులను సమానంగా చూస్తూ వసుదైక కుటుంబం అనే మౌలిక సూత్రం పునాదులుగా చేసుకొని మనుగడ సాగిస్తున్న భారతీయ సంస్కృతి. సనాతన ధర్మం అంటే మతం కాదు ప్రాచీన కాలం నుండి భారత దేశంలో నివసిస్తున్న ప్రజలు అనుసరిస్తున్న ఒక జీవన విధానం. ఆ జీవన విధానమే ధర్మంగా పరిగణించబడింది. వాస్తవానికి ఈ జీవన విధానానికి ఒక నిర్దిష్టమైన పేరు అంటూ ఏమీ లేదు. సనాతనం అంటే శాశ్వతమైనది అని, ధర్మం అనగా ఆచరణీయ కార్యం అనే అర్ధాల నుండి ఈ ధర్మానికి సనాతన ధర్మం అనే పేరు వాడుకలోకి వచ్చింది.

  ప్రాచీన కాలంలో పర్షియా రాజ్య సరిహద్దులు దాటి భారత దేశములో ఉత్తర భూభాగాన ప్రవహిస్తున్న సింధు నది ఒడ్డును చేరుకున్న పార్శిలు ఇక్కడ నివసిస్తున్న ప్రజల ఆచార వ్యవహారములు, దేవతలను ఆరాధించే విధానములు, వైదిక కర్మలు పరిశీలించగా వేదాలను అనుసరించి దైనందిక జీవన విధానం, మనిషి మనుగడ కొనసాగుతూ ఉండటంతో ఈ జీవన విధానాన్ని మతం అనే అభిప్రాయంతో ప్రజలను హిందువులు అని, భారత దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచేవారు. కారణం పార్సీ భాషలో ‘స’ అనే అక్షరం లేదు దానికి బదులుగా ‘హ’ అనే అక్షరం వారు ఉపయోగించేవారు. అందువలన సింధు కాస్త హిందు పదంగా రూపాంతరం చెందింది. హిందు అనే పదం ఒక భౌగోళిక గుర్తింపు నుండి వచ్చింది. పార్శిల దృక్కోణం చేతన జీవన విధానం కాస్త హిందు మతంగా పరిగణనలోకి వచ్చింది. అందువల్ల ప్రపంచంలోని ఇతర మతాల ప్రభావం లేని కాలంలో భారత దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని హిందువుగా గుర్తించేవారు. కాని ఇప్పుడు వేదాల ఆధారంగా జీవన విధానాన్ని ఆచరించే వారిని మాత్రమే హిందువు అని పిలుస్తున్నారు. భారత దేశానికే తలమానికమైన ఈ సంస్కృతికి వలసదారులైన పార్సిలు తమ ఆలోచన తీరుతో మతం అనే కోణం జొప్పించి భారత దేశ అస్తిత్వానికి మూల ఆత్మ అయిన జీవన శైలిని ధర్మం అనే స్థాయి నుండి కేవలం ఒక మతం అనే స్థాయికి పరిమితం చేసి తీవ్ర నష్టం చేకూర్చారు. అదే విధంగా పార్శీలు నుండి హిందుస్థాన్ అనే పేరు గ్రీకులకు వచ్చేటప్పటికి ఇండొస్ గా మారింది కారణం గ్రీకు భాష నియమాలు పరంగా ‘హ’ అనే శబ్దం ఉన్న కూడా అక్షరం లేకపోవడం. మెగస్తనీసు అనే ప్రాచీన గ్రీకు అన్వేషకుడు సెల్యూసిడ్ రాజ్య రాజు సెల్యూకస్ I నికేటర్ రాయబారిగా పాటలిపుత్రలోని మౌర్య సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్త మౌర్య ఆస్థానాని సదర్శించి తన ప్రయాణంలోని అనుభవాలని గ్రంథస్తం చేసి ఇండికా అనే ప్రఖ్యాత చారిత్రక గ్రంథం రచించాడు. ఇక వారి నుండి రోమన్లకు వచ్చేటప్పటికి లాటిన్ భాష ప్రభావంతో దానిని ఇండస్ అని ఉచ్చరించారు. అది కాస్త ఓల్డ్ ఇంగ్లీష్ కాలంలో లాటిన్ భాషపై ఇంగ్లీష్ ప్రభావంతో ఇండియా అని, మధ్య ఇంగ్లీష్ కాలంలో ఫ్రెంచ్ భాష ప్రభావంతో యందే లేదా ఇండే అని, ఎర్లీ మోడరన్ ఇంగ్లీష్ కాలంలో ఇండై గా ఉచ్చరించారు. చివరికి 17వ శతాబ్దం కాలం నాటికి లాటిన్ లేదా స్పానిష్ లేదా పోర్చుగీస్ భాషల ప్రభావం చేతన కావొచ్చు మళ్లీ ఇండియా అనే పేరు వాడుకలోకి వచ్చింది. వాస్తవిక దృష్టితో ఆలోచిస్తే ఈ జీవన విధానాన్ని ధర్మంగా భావిస్తే భారతీయ ధర్మం అని, మతంగా భావిస్తే భారతీయత అని, భూమిపై ఎప్పటికీ నిలిచి ఉండే సంస్కృతి కాబట్టి ఈ జీవన విధానం/మతం అనుసరించే వాళ్ళని సనాతని అని సంబోధించడం సరైనది. అలాగే ఇండియా అనే పేరుని కాకుండా అధికారికంగా భారత్ అనే పేరుకి ప్రాధాన్యం ఇచ్చి తిరిగి వాడుకలోకి తీసుకొని వచ్చి దేశ పౌరులను భారతీయ అని పిలవాలి. హిందూస్తాన్, ఇండియా అనే పేర్లకు అధికారికంగా గుర్తించబడిన ఇతర పేర్లు అనే హోదా ఇచ్చి గౌరవించాలి.

  భారతీయ ధర్మం ఏ వ్యక్తి, వ్యక్తుల ఆలోచనల చేతనో ఏర్పడలేదు లేదా స్థాపించబడలేదు. ఈ ధర్మానికి మూలం వేదం, వేదానికి మూలం సృష్టికర్త అని భావిస్తారు కావున ఈ ధర్మం మూలాలు వేద కాలపు నాగరికతకు సంబంధించినవి. వేదాలలో ప్రస్తావించబడిన ఈ ధర్మం యొక్క ఆధ్యాత్మిక మూలాలు స్వర్గంలో, భూమిపై విస్తరించి ఉన్నాయి. వేదం అనే పదం సంస్కృత పదం “విద్” అనే ధాతువుకు “తెలియుట” అన్న అర్థం నుండి పుట్టింది. వేదములు సృష్టికి ముందు నుండే ఉండి కాలక్రమేణా భగవంతుని ద్వారా మహర్షులకు వారి ధ్యాన, తపో బలముల వలన తెలుపబడినవి అని, అవి ఏ మానవుల చేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను `అపౌరుషేయములు’ అని కూడా అంటారు అంటే మానవ మాత్రుడు చెప్పింది కాదు అని అర్థం. వేదములను తెలుసుకున్న ఋషులను `ద్రష్టలు‘ అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. భారతీయ ధర్మం శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు అందుకే వీటిని శ్రుతులు అని అంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నాలుగు వేదాల జ్ఞాన సంపద చాలా అమూల్యమైనది. ఈ వేదాలు – వేదాంత శాస్త్రం, తత్వశాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి.

  వేదాల ఆధారిత ప్రాచీన భారత దేశ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు విభాగాల సూత్రాలపై నిర్మితమైంది. విభజించేందుకు ఉపయోగించిన నాలుగు విభాగాలను సూచించే పదం వర్ణం. ఈ వర్ణ క్రమం వ్యక్తిగత, సామాజిక జీవితాల స్థితిగతులను తెలియచేస్తుంది.

 జన్మనా జాయతే శూద్ర

 సంస్కారాత్ ద్విజ ఉచ్యతే

 విద్యయా యాతి విప్రత్వమ్

 బ్రహ్మ జ్ఞానాత్ బ్రాహ్మణః

పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రులే అంటే సామాన్యులు. విద్య ద్వారా ద్విజులు అవుతారు. ద్విజుడు అంటే రెండు సార్లు జన్మించినవాడు. మొదటి జన్మ తల్లి గర్భం నుండి ఐతే రెండవ జన్మ విద్య అభ్యసించడం వల్ల జరుగుతుంది. వర్తక, వ్యాపారాలు చేయు నైపుణ్యం నేర్చిన వారు వైశ్యులు, రాజ్య పాలన చేయు నైపుణ్యం సంపాదించుకున్నవారు క్షత్రియులు అవుతారు. భుజ బలంతో, క్షాత్ర వీర్యంతో రాజ్య పాలన చేయగలుగువారు నాలుగు వర్ణాలలో ఎవరికి పుట్టినా సరే క్షత్రియుడే అవుతాడు. బ్రహ్మ జ్ఞానం పొందిన వారు బ్రాహ్మణులు అవుతారు. ‘బ్రహ్మ’ అంటే వేదం అని అంటారు. వేద విద్య నేర్చిన వాడు మరియు అనునిత్యం వేద ధర్మాలను పాటిస్తూ వేద కర్మలను చేయువారు బ్రాహ్మణులు అన్న వివరణతో విభజన జరిగింది. సమాజంలోని ప్రజల మధ్య ఉన్న నాలుగు విభాగాల్ని సూచించే మాట “చాతుర్వర్ణ్యం”. భగవద్గీత బోధన అప్పుడు కూడా శ్రీ కృష్ణుడు “చాతుర్వర్ణ్యం” అని పలికాడు. ఒక మనిషికి వర్ణం అతని గుణ గణాలు చేత నిర్ణయించబడతాయి తప్ప అతని పుట్టుక వల్ల కాదు.

 ఆశ్రమం అంటే నివసించు ప్రదేశం లేదా నిలయం అని అర్థం. ఆశ్రమ ధర్మం మనిషి జీవితంలోని నాలుగు దశలను తెలియ చేస్తుంది.

అవి:
• బ్రహ్మచర్యం – ఇంద్రియ నిగ్రహము ఆచరించి, పెద్దల పట్ల గౌరవము, గురువుల యందు భక్తి, శ్రద్ధలతో విద్య నేర్చుకొను దశ.
• గృహస్తం – జన్మనిచ్చిన తల్లి, తండ్రి సేవ చేస్తూ, తాళి కట్టించుకున్న భార్య పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఏకపత్ని వ్రతుడుగా ధర్మ సంతానము కలిగి, అతిధి మర్యాదలు పాటిస్తూ ఆచార వ్యవహారములు నడిపించు దశ.
• వానప్రస్తం – వయో భారం కలుగు కాలంలో కర్మల యందు వాంఛ వీడి సంతానమునకు వ్యవహారములు అప్పగించే దశ.
• సన్యాసం – మోక్ష ప్రాప్తి కొరకు ఎదురు చూస్తూ అధ్యాత్మిక చింతనతో భగంతుడిని స్మరించుకుంటూ జీవనం సాగించే దశ.

మనిషి ఎప్పుడు, ఏమి చేయాలి అనేది కేవలం మనిషి ఆత్మస్థితిని బట్టే కాకుండా దేహ వయోస్థితి మీద కూడా ఆధార పడి ఉంటుంది. ఈ కారణం చేతనే దీనిని వర్ణాశ్రమ ధర్మం అని అంటారు.

ఒక వ్యక్తి చేసే పని ఆధారం చేసుకొని అతనికి ఒక వర్ణం కేటాయించబడింది. అలా అలాంటి పనే చేసే వాళ్ళ అందరిని కలిపి ఒక వర్గంగా వర్గీకరణ చేశారు. ఇతర నైపుణ్యం కలిగిన విద్య నేర్చుకోవాలి అంటే విద్య బోధించే గురువుకు గురు దక్షిణ కింద ధనం రుసుముగా చెల్లించాలి కానీ అప్పటి సమాజ ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల దృష్ట్యా రుసుము చెల్లించి విద్య నేర్పించే బదులు ఏ వర్గంలోని వారు వారి వారి పిల్లలకు తము నేర్చుకొని, నిష్ణాతులైన పనినే నేర్పించే వారు. వాళ్ళు కూడా తమ లాగా వచ్చిన పని చేసుకొని బ్రతుకుతారు అని అంతే కానీ ఆ పనే చెయ్యాలి అని కాదు. ఒక వ్యక్తి రాజుకు పుట్టినంత మాత్రాన రాజు, బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అవ్వాలని నియమం ఏమీ లేదు. అలా అవుతాడు అని కూడా ఏ గ్రంథాలలోను వ్రాయలేదు. ఒక వ్యక్తి పుట్టుక కాదు అతని గుణ, గణాలు చేత నిర్ణయించబడతాది అతను ఏ వర్ణ వ్యవస్థకు చెందుతాడో. కానీ కొంతమంది స్వార్థ పరులు తమ స్వప్రయోజనాలు కోసం వర్ణ వ్యవస్థని కాస్త ఈ రోజు భారత దేశ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థగా మార్చి భారతీయ ధర్మం యొక్క గొప్పతనాన్ని నాశనం చేశారు. నేడు ఒకే విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ, తమలో తాము వివాహాలు చేసుకుంటూ వచ్చిన సామాజిక వర్గాలను కులాలుగా పిలవబడుతున్నవి. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగుతున్నాయి.

  నిజానికి కులం అంటే వంశం. కులాన్ని తెలియ చేసేది గోత్రం. గోత్రం అంటే సంస్కృతంలో “సంతతికి” అని అర్థం. గోత్రం వంశం మూల పురుషుడి పేరును తెలియచేస్తుంది. ఉదాహరణకు: ఇక్ష్వాకు కుల తిలకా అని శ్రీ రాముడిని కీర్తిస్తారు. దానికి అర్థం ఇక్ష్వాకు వంశోద్ధారకా అని. కారణం ఇక్ష్వాకు అనే రాజు శ్రీరాముడి వంశం యొక్క మూల పురుషుడు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనిషి తాలూకు విత్తనానికి లేదా వీర్య కణానికి జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రం మూల పురుషుడి ఆధారంగా రూపాంతరం చెందింది. గోత్ర నామము వంశం మూల పురుషుడిని మాత్రమే ఆధారం చేసుకొని కాకుండా గోత్రంలోని “గో” అక్షరానికి గోవు, గోశాల, గురువు, భూమి అని అనేక అర్ధాలు కూడా ఉండటం వలన వాటిని ఆధారం చేసుకొని కూడా గోత్ర నామాలు ఏర్పడ్డాయి. పూర్వ కాలంలో వ్యక్తులకు పేర్లే ఉండేవి, ఇంటి పేర్లు ఉండేవి కావు గోత్ర నామలతోనే గుర్తింప పడేవాళ్ళు. అందుకే దేవుడు గుళ్ళల్లో వ్యక్తుల గోత్ర నామాల పేరు మీదే అర్చనలు, ఆశీర్వచనాలు నిర్వహిస్తారు. నిజానికి గోత్ర నామాలే ఇంటి పేర్లు అని చెప్పవచ్చు. ఇప్పుడు వాడుకలో ఉన్న ఇంటి పేర్లు అనేవి ఒక వ్యక్తిని మరింత స్పష్టంగా గుర్తించేందుకు ఊరు పేరు, వృత్తి పేరు, నివాస స్థలం/ప్రాంతం ఇలా అనేక అంశాల ఆధారంగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు వేదాలని నాలుగు భాగాలుగా విడగొట్టి, వాటిని ఏ విధంగా పఠించాలో సూచించారు కనుక వ్యాసుడు వేదవ్యాసుడుగా పిలవబడ్డారు. మరొక ఉదాహరణ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పుల్లంరాజు రామకృష్ణరావు తన స్వగ్రామం అయిన ‘బూర్గుల’ గ్రామం పేరుతో బూర్గుల రామకృష్ణారావుగా పిలవబడ్డారు. చివరికి అదే ఆయన ఇంటి పేరుగా స్థిరపడిపోయింది.

  “స్వీయ ఆరాధన – సర్వ ఆదరణ” అనగా సొంత ధర్మం పట్ల గౌరవం ఇతర మతాల పట్ల సహనం అనే సిద్ధాంతమే భారతీయ ధర్మం యొక్క అంతరార్ధం. భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వంతో ఇతర మతాలను గౌరవించేది భారతీయ ధర్మం.

Written By 

– పచ్చా సురేష్ చంద్ర

X.com : @_SureshChandra_

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way