అహ్మదాబాద్, సెప్టెంబర్ 27 : భారత దేశం త్వరలోనే ప్రంపచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ను ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. 20 ఏళ్ల క్రితం వైబ్రెంట్ గుజరాత్ పేరుతో నాటిన విత్తనం నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శిగా మారి, పెద్ద వృక్షంగా అవతరించిదన్నారు. కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ‘‘గుజరాత్‌ను దేశానికి అభివృద్ధి కేంద్రంగా మార్చాలని వైబ్రెంట్ గుజరాత్‌ను నిర్వహించాం. 2014 తర్వాత ప్రంపచాభివృద్ధికి భారత్‌ను చోదకశక్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం భారత్ ఆ దశలోనే ఉంది. త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా భారత్ అవతరిస్తుంది. ఇందుకు నాది గ్యారంటీ. ఇప్పటి నుంచి రాబోయే కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది’’ అని ప్రధాని తెలిపారు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు పట్ల ఉదాసీనంగా వ్యవహరించాయని ప్రధాని విమర్శించారు. కానీ, వైబ్రెంట్ గుజరాత్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సాధించామని తెలిపారు. మొదట ఏ పని అయినా తిరస్కరణకు గురవుతుందని, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించవచ్చని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. వైబ్రెంట్ గుజరాత్ విజయానికి ఇదే కారణమని అన్నారు.