కలలు అందరూ కంటారు… కానీ, ఆ కలల కోసం నిత్యం శ్రమించేది కొందరే ఉంటారు. తమ కలల స్వాప్నికను సొంతం చేసుకునే క్రమంలో సమాజానికి తమ వంతుగా బాధ్యతగా సేవ, ఉన్నంతలో ఇతరులకు సహాయంగా నిలుస్తూ, అందరికి ఆదర్శంగా నిలుస్తూ తాము మాత్రం తెర వెనుక మౌనంగా ఉండిపోతుంటారు. అలాంటి కోవకు చెందినవారే గౌండర్ రమ్య మురుగేష్.
రమ్య పుట్టింది ,పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో. తల్లి మంజుల, తండ్రి మురుగేశ్ తమిళం అయినా తెలుగు ప్రాంతం మీద మమకారం ఎక్కువ. తాతయ్య వాళ్ళు కుప్పంలో స్థిరపడ్డారు. ఇక రమ్య కూడా తన బాల్యాన్ని, చదువును కుప్పంలోనే పూర్తి చేసుకుంది. తాను పుట్టింది మధ్యతరగతి కుటుంబ నేపథ్యం అయినా సమాజానికి సేవ చేయాలి, తాను కలలు కన్న ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని నిత్యం పరితపించేది. చిన్నప్పటి నుంచే చందమామ కథలు, హిస్టారికల్ కథలు చదవడం అలవాటు చేసుకుంది. చిన్నతనం నుండే కవితలు రాయడం, వినిపించడం చేసేది. అలా స్వతహాగా తమ చుట్టూ ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆ కవితల్ని మెచ్చుకునేవారు. తను రాసే కథలతో ఇతరుల్ని ఆకట్టుకునేలా మెప్పించేది. అలా సినిమా డైరెక్టర్ కావాలన్న తపన మరింత తనలో పెరిగింది. 4 భాషలలలో అనర్గళంగా మాట్లాడడం, రాయడం వచ్చు. Lyricist, గిటార్ కూడా అద్బుతంగా వాయిస్తారు. జంతువుల వాయిస్ ను మిమిక్రీ చేయగలుగుతారు. ఇలా అన్నీ రకాల కళాపోషణలను కలగూరగంపలా తనలో నిక్షిప్తం చేసుకున్నారు. కార్పోరేట్ ఉద్యోగం చేస్తూ 70 వేల రూపాయలు సంపాదిస్తూ, 5 వేల రూపాయల జీతం తీసుకునే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? కరోనా విపత్కర సమయంలో సమాజ సేవ చేస్తూ ప్రజల మన్నలను ఏ విధంగా పొందారో తెలుసుకుందాం.
చదువు & ఉద్యోగం :
చిన్నతనం నుండే చదువు మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీలో BBM, బెంగళూరులో జైన్ కాలేజ్ లో MBA పూర్తి చేసుకున్నారు. కంప్యూటర్ కోర్సు HDCA ,SAP Course చేసుకొని ఒక సంవత్సరం Genesys private limited company లో ఉద్యోగం చేసి, ఆ తర్వాత 2 సంవత్సరాలు Wipro కంపెనీలో టీమ్ లీడర్ గా పని చేస్తూ నెలకు బాగానే సంపాదించేవారు. అయినా ఏదో వెలితిగా అనిపించేది. తాను కలలు కన్న ఫిల్మ్ డైరెక్టర్ కావాలన్నది తన లక్ష్యం. ఆ దిశగా అనిత గారి సపోర్టతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు . ఈ క్రమంలోనే యూట్యూబ్ కు షార్ట్ స్టోరీస్, షార్ట్ ఫిల్మ్స్ కు కథలు అందించడం, రాప్ సాంగ్స్ రాయడం చేస్తూ ఉండేది. చిన్నతనం నుండే కవితలు రాయడం, షార్ట్ స్టోరీస్ రాయడం వలన ఒక 500 కవితల్ని ఒక ” సామెతలు – 2021 ” పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకం చాలా మందిని మెప్పించింది. తన కలను నిజం చేసుకోవడానికి పూలపాన్పు లాంటి తన ఉద్యోగాన్ని వదిలి, కష్టాల కడలిగా అడుగు వేసింది చిత్ర పరిశ్రమలోకి.
చిత్ర పరిశ్రమ :
ఉద్యోగం వదిలేసి, చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతానంటే తన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు ఎవరూ అంగీకరించరు. అందునా అమ్మాయి అంటే అసలు ఎవరూ ఒప్పుకోరు. ఇలాంటి సందర్భాలే రమ్యకు ఎదురయ్యాయి. అయినా తాను ఎక్కడా వెనుకడుగు వేయలేదు. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అవమానాలు, ఈసడింపులు భరించారు. కానీ రమ్య వాళ్ళ అమ్మ మాత్రం తనను ప్రోత్సహించింది, భరోసా ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో అడుగులు ముందుకేసింది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టగానే పూలపాన్పు పరచి ఉండదు. తనకు తెలుసు కష్టాలు ఉంటాయని, వాటిని స్థైర్య౦తో ఎదుర్కొని తన లక్ష్యాన్ని దరి చేరాలన్న ఆత్మవిశ్వాసంతో 5 వేల రూపాయలతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది. తన మాటలతో, వ్యాక్చాతుర్యంతో, కథలు చెప్పే విధానం, అన్నింటికీ మించి తన నిజాయితీతో అందర్నీ అనతి కాలంలోనే అందర్నీ ఆకట్టుకుంది. చిన్న వయసులోనే కథలు చెప్పే విధానాన్ని చూసి తనకు మరిన్ని అవకాశాలు ఇచ్చారు. అలా 3 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి, ప్రస్తుతం తానే స్వంతంగా ఒక సినిమాకు డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనిత గారు వెన్ను తట్టి ప్రోత్సహించడం వల్ల ఈరోజు చిత్రపరిశ్రమలో కొంత మేర నిలదొక్కుకున్నాని చెప్పారు. అమ్మ రోల్ మోడల్ అని చెప్తూ ఉంటారు. తనకు వెట్రిమరన్, బాల, రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ అంటే ఇష్టమని చెప్పారు. చిత్ర పరిశ్రమకి వచ్చిన తొలినాళ్ళ నుండి తనకి మెళుకువలు, సలహాలు, సూచనలు ద్వరకిరాగవ గారు అందించేవారని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు.
సేవా కార్యక్రమాలు :
నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు, రమ్య కూడా ఒకవైపు సినిమా మేకింగ్ పనులు చేస్తూనే, మరో వైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రపంచం అంతా నిశ్శబ్ధత వహించినా, తాను మాత్రం బయటకు వచ్చి కరోనా బాధితులకు సేవలు అందించింది. కరోనాతో మరణించిన కొందరి అభాగ్యులను కన్న వారే పట్టించుకోని తరుణంలో రమ్య గారే ముందుకు వచ్చి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కరోనా సమయంలో తన వంతుగా ప్లాస్మా కూడా డొనేట్ చేశారు. ఇప్పటిదాకా 15 సార్లు రక్తదానం చేశారు. కరోనా బాధితులకి తమ ఇంటి వద్దకే వెళ్ళి నాణ్యమైన ఆహారాన్ని అందించారు. కరోనా పేషంట్లను తన స్వంత వెహికల్ తో ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఇంటి వద్దకు డ్రాప్ చేయడం తన టీం సభ్యులతో కలసి చేశారు. కరోనా విపత్కర సమయంలో యాచకులకు, వీధి జంతువులకు ఆహారం లేకుండా అల్లాడిపోయినా హృదయ విశాదకర దృశ్యాలు చూశాం. అలాంటి సందర్భంలో ఆహారాన్ని రోడ్డు పక్కన ఉన్న యాచకులకు అందించారు. అనాధ ఆశ్రమాలు తగిన నిత్యావసర సరుకులు లేక అల్లాడుతుంటే వారి పరిస్థితిని తెలుసుకొని స్పాన్సర్స్ ద్వారా వారికి నిత్యావసర సరుకులు అందించడం చేశారు. Blood, oxygen, ventilator, food, plasma etc.. ఇలా ఎవరికి అవసరం వచ్చినా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సహాకారం అందించి, చాలామంది ప్రాణాలను కాపాడారు. కరోనా సమయంలో 24 గంటలు కరోనా బాధితులకు సహాయం చేసే పనుల్లోనే నిమగ్నమయ్యేవారు. భవిష్యత్తులో ఒక స్వచ్ఛంధ సంస్థ నిర్వహించి తద్వారా అనేక మందికి సేవలు అందించాలని కోరుకుంటున్నారు. అనేక సంస్థల నుంచి ప్రశంసా పత్రాలు, కరోనా వారియర్స్ గా గుర్తిస్తూ దాదాపుగా 80 సర్టిఫికేట్స్ అందుకున్నారు. సంగీత అనే పేద బాడీబిల్డర్ కు తన వంతుగా ఆర్థిక సహకారం అందించి, తనని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లెలా ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో మంచి పేరున్న డైరెక్టర్ గా ఎదగాలని, తాను అనుకున్న స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువ మందికి సేవలు అందించాలని జనస్వరం న్యూస్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.