“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియాః” అని మను స్మృతులు చెప్పాయి. అంటే ‘ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు. ఎక్కడ స్త్రీలకు గౌరవం లేదో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలు చేసినా ఫలితం లేదు’ అని అర్థం.
పుట్టినప్పటి నుంచి ఒక కూతురిగా, ఒక సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుంటూ కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత ఇలా మగవాడి ప్రతి అడుగులో ఆమె పాత్ర అమోఘం ఆమె సేవలు అనిర్వచనీయం. ప్రపంచాన్ని పాలించే అద్భుత శక్తిని కలిగిన ఇహ లోకపు దేవత స్త్రీ మూర్తి. వందల్లో ఒకరిగా కోట్లలో ఒక్కరుగా అమ్మగా ఆలిగా ప్రేమించే మానవతా మూర్తి స్త్రీ..
“స్త్రీ” సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ అనురాగం, పుట్టిన దగ్గర నుండి తన ప్రతి పాత్ర ఎంతో చక్కగా నిర్వర్తిస్తుది, నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ రంగంలో అయినా రాణించగలిగే ధైర్యం సత్తా తనకు ఉన్నది అని పదే పదే చాటి చెప్తోంది స్త్రీ.. ఒక స్త్రీ విద్యావంతురాలైతే మొత్తం కుటుంబం జాగృతం అయినట్లు లెక్క. అప్పుడు సమాజం, దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది “వినా స్త్రీ యా జననం నాస్తి వినా స్త్రీ యా గమనం నాస్తి వినా స్త్రీ యా జీవం నాస్తి వినా స్త్రీ యా సృష్టి యే వా నాస్తి” అని ఋజువు చేస్తూనే ఉంది.
నేటి ఆధునిక కాలంలో మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల కారణంగా మహిళలు వృత్తిపరంగా ఎంతో వైభవంగా రాణిస్తున్నారు అనడంలో సందేహం లేదు. నేషనల్ డేటా కలెక్షన్ ఏజన్సీలు పని చేసే మహిళల సంఖ్య మీద తీవ్రమైన తక్కువ అంచనాలు ఉన్నాయన్న నిజాన్ని ఒప్పుకున్నాయి. అయినప్పటికీ పనిచేసే వారిలో పురుషుల కంటే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. పట్టణ భారతంలో పని చేసే మహిళల సంఖ్య ఆసక్తిదాయకంగా ఉంది. ఉదాహరణకు సాఫ్ట్ వేర్ పరిశ్రమలో 30% మంది పని చేసే వారు మహిళలే. పని చేసే ప్రదేశంలో వారు వారి పురుషులతో జీతాలు, స్థాయిలలో సమానంగా ఉన్నారు. పురుషుల కన్నా మహిళల్లోనే మానసిక పరిపక్వత దృఢత్వం కలిగి ఉన్నారని సర్వేలు చెపుతున్నాయి. ఎంతటి ఒడిదుడుకులను అయినా తట్టుకొని నిలబడి కలబడి సాధిస్తున్నారని వారిలో సామాజిక చైతన్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు.
ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు. రాణులై రాజ్యలు ఏలారు. దేశానికి ప్రధాన మంత్రులయ్యారు, అవుతున్నారు. దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి – ” లేచింది మహిళా లోకం – నిద్ర చేచింది మహిళా లోకం – దద్దరిల్లింది పురుష ప్రపంచం” అన్నాడు. అంతకు ముందే ఇంకో పాత కవి “ముదితల్ నేర్వగరాని విద్య కలదే? ముద్దార నేర్పించినన్” అన్నాడు. అటువంటి మహిళలను అంతా మెచ్చుకోవలసిందే, ఆచరించవలసినదే.
మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు వీటన్నింటి కంటే మించి భద్రత కల్పించేందుకు ఎన్నో చట్టాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. మరెన్నో చర్యలు తీసుకున్నారు. అయినా మాటల్లో ఉన్న మహిళా రక్షణ చట్టాల రూపంలో ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. మహిళలకు సాధికారత సాధించే లక్ష్యంతో దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ లక్ష్యసాధనలో కొంత వెనుకబడిందనే చెప్పొచ్చు. ఎక్కడపడితే అక్కడ హింస బారిన పడుతూనే ఉన్నారు. సంస్కృతి సంప్రదాయాలను, మంచి చెడులను పట్టించుకోకుండా మద్యం మాదకద్రవ్యాల మత్తులో జోగుతూ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో కొట్టుకుమిట్టాడుతున్న యువకులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార నేరాల్లో నిందితుల్లో అధికశాతం మద్యమో, మత్తోసేవించి ఉన్న విషయం పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడవుతున్నాయి. ఆమత్తులో రకరకాల నేరాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా త్రికరణశుద్ధిగా మహిళా రక్షణకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయమిది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా రక్షణపై చట్టాలు పగడ్బందీగా చేయాల్సిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత ఎంతైనా ఉంది.
ఆడదంటే ఆట బొమ్మ కాదు ఓర్పు, నేర్పు కలగలిసిన ఆది పరాశక్తి… స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. మహిళలకు సమానమైన పని, సమానమైన వేతనాలు, సమాన ఆస్తి, సమాన సాధికారిత సాధించడం, వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి.
స్థిరమైన రేపటి కోసం.. ‘రేపటి మహిళలు’.. లింగ సమానత్వం సాధించటం కీలకం.
#Written By
– జ్యోతి
ట్విట్టర్ ఐడి : @jyothi6535
One Response
అద్భుతంగా రాశారు 🤗💐