వరదలు : సాధారణంగా ముంపునకు అవకాశం లేని నేల ముంపునకు దారితీసేవిధంగా నదీ కాలువ వెంబడి లేదా తీరం వద్ద అధిక నీటిస్థాయి ఉండే స్థితిని వరద అంటారు. నీరు తన సాధారణ స్థితి లేదా ప్రవాహానికి మించిన స్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు వరద సంభవిస్తుంది.
వరదలకు రావడానికి వివిధ కారణాలు:
దేశంలో వరదలు రావడానికి ఒక ప్రధాన కారణం భారీ వర్షాలు. సహజంగా నది ఒడ్డున ఒక రోజులో 15 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిసినప్పుడు ఆ నది ఆయకట్టు ప్రాంతం వరద ముంపునకు గురవుతుంది. అలాంటి పరిస్థితులను పశ్చిమ కనుమల పశ్చిమ తీరంవెంబడి అసోం, హిమాలయాల ఉప విభాగం పశ్చిమబెంగాల్, గంగా సింధు మైదానం వెంబడి చూడవచ్చు.
తుఫానులు :
తూర్పు తీరమైదానం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం వెంబడి వరద తర్వాత తుఫాను అనేది సాధారణమైన అంశం. చక్రవాతాలు బలమైన గాలుల వల్ల, అధిక అలల వల్ల ఏర్పడి తీరం వెంట వరదలకు కారణమవుతుంది.
నదీ పరీవాహక ప్రాంతం పెరగడం: హిమాలయ నదులు తీసుకువచ్చిన ఇసుక మేట వేయడం, నీటి అడుగున బురదతోచేరి నది ప్రవాహ మార్గం పెరుగుతుంది. ఇలా నిక్షిప్తమైన సిల్ట్ నిక్షేపణ నదుల పరీవాహక ప్రాంతాన్ని పెంచుతుంది. ఇది నదులు మోసే సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది (నదులు లేదా ప్రవాహాల నీటిని మోసుకెళ్లే సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది).
అటవీ నిర్మూలన:
అటవీ నిర్మూలన వరదల్లో ప్రధానపాత్రను పోషించడానికి గల కారణం. వరదల వల్ల నేల క్రమక్షయానికి గురై చెట్లు నేలను అంటిపెట్టుకుని ఉండలేకపోతాయి. అడవిలోని చెట్లు, గడ్డివాములు నీటిని నిలుపుదల చేస్తాయి. అటవీ నిర్మూలన కారణంగా నేల అవక్షేపం చెందుతుంది. దీనివల్ల అటవీ నిర్మూలన వరదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రధాన నదుల్లో ఉపనదులు కలిసే సమయంలో వచ్చే వరదలు: గంగా సింధు మైదానంలో బ్రహ్మపుత్ర, గంగా నదుల ఉపనదులు కలిసే సమయంలో వచ్చే వరదలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
డెల్టా తీరప్రాంతాల వల్ల:
డెల్టాల వద్ద అవక్షేపాల నిక్షేపణ లేదా నది భూతలాలపై పూడిక ఏర్పడటం, సముద్రపు పోటు పాట్లతో నదీ వరదలు ఏకం కావడంతో తీర మైదానాల్లో వరదల సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది.
భూపాతాల వల్ల: భూపాతాల (Lanslides) కారణంగా అధిక నీటి ప్రవాహం నిలిచి వరదలు సంభవిస్తాయి.
భూకంపాల వల్ల: భూకంపాల కారణంగా నదుల దిశమారి వరదలు సంభవిస్తాయి. ఇలాంటి వరదలు ఎక్కువగా ఎత్తయిన పర్వత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ మొదలైన రాష్ర్టాల్లో కనిపిస్తాయి. నదుల ప్రవాహంలో అడ్డంకులు: రోడ్డు, కరకట్టలు, రైల్వే మార్గాలు, కాలువలు మొదలైనవి నదుల స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా వరదలకు దారితీస్తుంది.
పట్టణ భవన నిర్మాణాలు: పట్టణాల్లో మురుగు నీటికాలువల్లో అడ్డంకులు ఏర్పడటం, మురుగునీటి కాలువలు కుంచించుకుపోవడం, మురుగునీటి కాలువలపై భవన నిర్మాణాలవల్ల పట్టణ వరదలు సంభవిస్తాయి. ఆనకట్టలు, డ్యాములు, కాలువల నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. కేంద్ర జలసంఘం వరదల పర్యవేక్షణ వర్గీకరణ ప్రకారం, దేశంలో అధిక వరదకు ప్రభావితమయ్యే ప్రాంతాలు.
నిమ్న వరదదశ:
నది నీటిమట్టం హెచ్చరిక స్థాయికి, ప్రమా ద స్థాయికి మధ్య ప్రవహిస్తున్నప్పుడు ఉండే వరద పరిస్థితిని నిమ్న వరద దశ అంటారు.
మధ్యస్థ వరదదశ: నది నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటి అత్యధిక వరద మట్టానికి 0.50 మీ. దిగువన ఉన్నప్పుడు ఆ నది వరద మధ్యస్థ దశ అంటారు.
అధిక వరద దశ: నది నీటిమట్టం అత్యధిక వరద మట్టానికి 0.50 మీ. లోపు ఉన్నప్పుడు దాన్ని అధిక వరద దశ అంటారు.
సాధారణ వరద దశ:
ఏదైనా వరద ముందస్తు సూచన కేంద్రం వద్ద నది నీటిమట్టం దాని అధిక వరద మట్టానికి చేరుకున్నప్పుడు అసాధారణ వరదలు సంభవించినట్లు పేర్కొంటారు. అధిక వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాలు దేశంలో వరద ప్రభావం
-దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు ప్రతి ఏడాది వస్తూ ఉంటాయి. దేశ భూభాగంలో సుమారు 30 శాతం వరదలకు కారణమవుతుంది.
-దేశం మొత్తంమీద 39 జిల్లాలను తీవ్ర వరద ముప్పున్న జిల్లాలుగా గుర్తించారు.
-సుమారు 10 మిలియన్ల హెక్టార్ల భూమి ప్రతి ఏడాది పునరావృతమయ్యే వరదల ప్రభావానికి గురవుతున్నది. దేశంలో వరద ముప్పున్న 50 మిలియన్ల హెక్టార్లలో ఉత్తరప్రదేశ్ 24.9 శాతం, బీహార్ 15 శాతం, మిగిలిన రాష్ర్టాలు సుమారు 45 శాతం వరద ముప్పు ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి.
-వరదలవల్ల ప్రతి ఏటా సగటున 1464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.
-వరద ముంపునకు గురైన ప్రాంతాలు దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు కోల్పోవచ్చు.
-ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినవర్గాల ప్రజలు వరదల విధ్వంసక ప్రభావాలకు ఎక్కువ గురవుతున్నాయి. ఈ వర్గాలు తిరిగి పూర్వస్థితికి చేరడానికి చాలా సమయం పడుతుంది.
-వరద నిర్వహణపై 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం 1953-2010 మధ్య ప్రతి ఏడాది సగటున 7.208 మిలియన్ హెక్టార్ల భూమి, 3.19 మిలియన్ల ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు.
-వరదల వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన పర్యవసానం ప్రాణాలకు, ఆస్తికి నష్టం వాటిల్లడం, ఇండ్లు, వంతెనలు, రోడ్లవంటి నిర్మాణాలు, వరద నీరు, నీరు నిలిచిపోవడం వల్ల కొండ చరియలు విరిగిపోవడం వల్ల దెబ్బతింటాయి.
-పడవలు, చేపలు పట్టే వలలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ముంపుకారణంగా ప్రాణాలకు, పశుసంపదకు అపారనష్టం జరుగుతుంది.
-సరైన తాగునీటి సౌకర్యాలు లేకపోవడం వల్ల బావి నీరు, భూగర్భ జలాలు, నీటి పైపుల ద్వారా వచ్చే జలాలు కలుషితమై అంటువ్యాధులు, డయేరియా, వైరస్ వ్యాధులు, మలేరియాతోపాటు ఇంకా అనేక సంక్రమణ వ్యాధులు సోకడానికి దారితీస్తాయి.
-వరదలవల్ల వ్యవసాయ భూమి మునిగిపోయి పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుంది. దీంతో ఆహార కొరత, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. నేల పైపొర కొట్టుకుపోవడం వల్ల నిస్సారంగా మారుతుంది. సముద్రపు నీరు చేరడం వల్ల చౌడు భూమిగా మారుతుంది వరద నిర్వహణ కార్యక్రమం
-కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 11వ పంచవర్ష ప్రణాళిక కాలానికి రూ.800 కోట్ల వ్యయంతో వరద నిర్వహణ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక కాలం (2012-17)లో కూడా కొనసాగించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.10,000 కోట్లు కేటాయించారు.
-మహారాష్ట్రలోని పుణెలో ఉన్న జాతీయ జల అకాడమీ (ఎన్‌డబ్ల్యూఏ) వరదల నిర్వహణపై జాతీయస్థాయి, రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లకు శిక్షణ ఇస్తుంది.
12వ పంచవర్ష ప్రణాళికలో ఎన్‌డబ్ల్యూఏను వరదల ఉపశమనానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి శిక్షణకేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
– భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధ విభాగమైన జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వరద నిర్వహణకు సంబంధించిన ఐదు రకాలైన సేవలను అందిస్తున్నది. అవి..
1. నియర్ రియల్ టైమ్ ఫ్లడ్ మ్యాపింగ్ అండ్ మానిటరింగ్
2. ఫ్లడ్ డ్యామేజ్ అసెస్‌మెంట్
3. ఫ్లడ్ హజార్డ్ మ్యాపింగ్
4. రివర్ బ్యాంక్ ఎరాజన్ మ్యాపింగ్
5. నదీ ప్రవాహంలో వచ్చే మార్పుల మ్యాపింగ్
వివిధ రకాల వరదలు :
ఆకస్మిక వరద:
కుంభవృష్టి లేదా తుఫాన్లతో కూడిన భారీ వర్షాలు మొదలైన వాటివల్ల ఆరు గంటల్లోపు సంభవించే వరదలను ఆకస్మిక వరదలు అంటారు.
నదీ వరద:
నదీప్రవాహం ఆనకట్టలను దాటి ప్రవహించి నీరు చుట్టుపక్కల ప్రాంతాలను ముంచివేయడాన్ని నదీవరద అంటారు. నదీ వరదలు ప్రధానంగా వర్షపునీరు లేదా మంచు కలిగి నదీప్రవాహంలో వేగం గా కలవడం వల్ల సంభవిస్తాయి.
పట్టణ వరదలు:
స్వల్పకాల వ్యవధిలో భారీ వర్షాలు సంభవిచడం అధికమై నీటి మార్గాలను విచక్షణా రహితంగా ఆక్రమించడం, డ్రైనేజీ వసతులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల నగరాలు, పట్టణాల్లో వచ్చే వరదలను పట్టణ వరద అంటారు. దేశంలో రుతుపవనాలు నాలుగు నెలలు వస్తాయి. కొన్నిసార్లు ఎడతెగని వర్షాల కారణంగా వరదలు వినాశనానికి దారితీస్తాయి. ఏడాదిలోని మిగతా కాలంలో చాలా భాగం పొడిగా ఉండటమే కాకుండా నీటి కొరతను కలిగి ఉంటుంది. అదనపు వరద నీటిని రుతుపవనాలు లేనికాలంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించుకోవాలి. కింది పద్ధతులను పాటించడం ద్వారా దీన్ని సాధించవచ్చు. నదుల అనుసంధానం
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నదుల నుంచి అధికమైన నీటిని, నీరులేని శాశ్వత ప్రాంతాలకు మళ్లించడం ద్వారా నీటి కొరతను, వరదల సమస్యను నివారించే చర్యలను చేపట్టింది. ఈ నదుల అనుసంధాన చానళ్ల ద్వారా అన్నికాలాల్లో లోతట్టు ప్రాంతాల నౌకాయానానికి నీటి మార్గం ఏర్పడటమే కాకుండా, చౌకైన, కాలుష్య రహిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది. వర్షపు నీటి సేకరణ (River water harvesting) వర్షాకాలంలో మధ్యయుగ కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆచరించినట్టుగా అధిక వర్షపు నీటిని బావు లు, చెరువుల్లో సంగ్రహించడం లేదా నిల్వ చేస్తారు. బహుళార్ధ సాధక ప్రాజెక్టులు/ఆనకట్టలు
వరద ప్రాంతాల్లో ఆనకట్టలను నిర్మించడం ద్వారా అధిక వర్షపునీటిని నిల్వచేసుకుని ఏడాది మొత్తానికి నీటిపారుదల అవసరాలను నెమ్మదిగా వినియోగించుకోవచ్చు. ఉప్పెన కాలువలు, నదికి అడ్డంగా కట్టిన ఆనకట్టలు: వరద నీటిని ఉప్పెన కాలువలు, చిన్న నీటిపారుదల నిర్మాణాలు, నదులకు అడ్డంగా కట్టిన ఆనకట్టల్లోకి మళ్లించడం ద్వారా అధిక వర్షపు నీటిని వ్యవసాయ క్షేత్రాలకు వాడుకోవచ్చు.
నేడు ఎడతెరపీ కురుస్తున్న వర్షాలకు ముఖ్యకారణం మానవ తప్పిదమేనా? అంటే, ఔననే పలు పర్యావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. పర్యావరణం పట్ల నిర్లక్ష్యం వహిస్తే, ఏదోరోజు మన బతుకులు ఎడారిమావిగా చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా చేసుకోవాలి, ముఖ్యంగా రాజకీయ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించి, దానికి తగినట్లు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా వరద నీటిని నియంత్రించి, వ్యవసాయ క్షేత్రాలకు, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించేలా తగిన చర్యలు తీసుకోవాలి.
#Written By
కొన్నిపాటి రవి
ట్విట్టర్ ఐడి : @KPR_India