విశాఖపట్నం ( జనస్వరం ) : గ్రేటర్ విశాఖ పరిధిలో జనసేన పార్టీ గెలుచుకున్న 22వ డివిజన్ పట్ల అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పార్టీ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ వద్ద దీక్షకు దిగారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల మరమ్మతులు వ్యవహారంలో తన డివిజన్ ను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది మూర్తి యాదవ్ ఆరోపణ. డివిజన్ ప్రజలు జనసేన పార్టీకి ఓటేశారన్న అక్కసుతో అధికార పార్టీ అండతో అధికారులు సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదని తెలిపారు. డివిజన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలు ప్రదర్శిస్తూ దీక్ష చేపట్టారు. శాంతియుతంగా దీక్ష చేపట్టిన మూర్తియాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి చేరుకుని సంఘీభావం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.