నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వార్త సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కులగణన( సర్వే) గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. చేస్తున్న/ చేయిస్తున్న సర్వే తప్పు కానప్పుడు భయమెందుకు? ప్రభుత్వానికి ఎందుకు అంత ఉలికిపాటు ? అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా పాడిన పాటే పాడుతూ గడిపేసే ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తోంది ?
ప్రజా సంక్షేమం ఎజెండా నా? సంక్షేమం కోసమే అయితే సరైన సమాధానం చెప్పాలి కానీ పార్టీ మనుగడ కోసం అంతర్లీనంగా చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది అనే భావమేదో కనిపిస్తుంది. ఇన్ని వ్యవస్థలు ఉండగా ఏళ్ల తరబడి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ప్రభుత్వ పధకాలు ప్రజలు అందుకుంటున్నప్పుడు ఇంకో సమాంతర వ్యవస్థ గా 50 కుటుంబాలకు ఒకరి చొప్పున వాలంటీర్లను నియమించడం తద్వారా ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండటం ఇంతవరకు బాగుంది కానీ వాలంటీర్లు సేకరిస్తున్న డేటా వివరాల విషయంలోనే వివాదం వారాహి యాత్ర లో ప్రశ్నించటంతోనే మొదలు అయింది. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత విషయాలు ఎలాంటి అధికారిక గుర్తింపు లేని వాలంటీర్లు సేకరించడం ఒకప్పుడు ప్రతి పక్ష నేతగా డేటా చౌర్యం జరుగుతుందని వాపోయి ప్రశ్నించిన నేటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అదే డేటా చౌర్యం ఎందుకు చేయిస్తున్నట్లు ? దీనికి బాధ్యులు ఎవరు?
స్నేహం, బంధుప్రీతి ప్రదర్శించి తమ వారికి ఎక్కువ లబ్ధి చేకూరుస్తారు అని ప్రభుత్వ ఉద్యోగులకు సైతం స్థానికంగా పోస్టింగ్ ఇవ్వరు. అటువంటిది వాలంటీర్ అనే వ్యక్తి తను నివసించే ప్రాంతంలోనే ఉండే 50 ఇళ్లను వారికి కేటాయిస్తున్నారు. ఇలా చేయడం వలన అర్హత లేని బంధువులకు, స్నేహితులకు ఎక్కువ లబ్ధి చేకూర్చే ప్రమాదం ఉంది. ఆ వాలంటీర్లతో సఖ్యతగా లేకపోతే అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు అనర్హులుగా పక్కన పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు.వా లంటీర్లకూ ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధమూ లేదని, వాలంటీర్లకు ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవని నిన్నటి వరకు చెప్పి వారు తమ వారే, మన పార్టీ వారే మనలను అభిమానించేవారే అని స్వయంగా ముఖ్యమంత్రి బహిరంగ వేదిక నుండి చెప్పటం దేనికి సంకేతం ?ఎ న్నో వివాదాలకు, అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొందరు వాలంటీర్లను వ్యవస్థ లోని అందరిని అధికార పార్టీ కి చెందిన వారిగా ఒప్పుకున్నట్లే కదా.
అయితే ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం ప్రభుత్వ అధికారులకు తప్ప మిగతా వారికి ఆధార్, బయోమెట్రిక్ వంటివి ఇవ్వరాదు. మరి వాలంటీర్లతో కుల గణన ఎలా చేయిస్తున్నారు? డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఉల్లంఘన బాబు చేసాడని 2019లో చెప్పిన జగన్, అదే తప్పు చేస్తున్నాడు. డేటా భద్రత పై శ్వేత పత్రం విడుదల చేస్తే ఎవరూ ప్రశ్నించరు కదా... బీహార్ లో చేపట్టిన కులగణన వివాదాస్పదమై ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుప్రీం కోర్టుకు చేరింది. అలాంటి వివాదాస్పద కులగణనను అత్యవసరం అన్నట్లు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ? 4 1/2 ఏళ్లుగా గుర్తు రానివి ఎన్నికలు ఇంకో 2, 3 నెలల్లో ఉన్నాయని తెలిసి చేయటం ఏ లబ్ది కోసం ?
వాలంటీర్ల ద్వారా కుల గణన చేయిస్తూ సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారుల పేర్లు చెప్తున్నారు. స్వాతంత్ర్యం పూర్వం 1931 లో కుల ఆధారిత సమాచారం ఉన్నట్లు చరిత్ర చెపుతుంది తర్వాతి కాలంలో జాతీయ సమైక్యత దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా కులగణన అనేది చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు అదే పాటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఒక అడుగు ముందుకు వేసి కుల గణన చేపట్టినా వివాదాలను ఎదుర్కోలేము అనే కారణం కావొచ్చు ఇంకేదైనా రాజకీయ సామాజిక కారణము కావొచ్చు కుల గణన వివరాలు బయటకు చెప్పని పరిస్థితి.మ న సమాజంలో కుల వ్యవస్థ లేని సమాజం కావాలంటే కులాల పేరుతో ఇచ్చే ప్రత్యేక హక్కులను, రిజర్వేషన్లు తీసివేయాలి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలైన వెనుకబాటుతనాన్ని గుర్తించాలంటే మన దగ్గర గణాంకాలు, సమాచారం ఉంటేనే తెలుస్తుంది. ఇది కుల గణనతో కొంతవరకు సాధ్యం. కానీ రాజకీయ లబ్దికి కులాల వారీగా ఓట్లు వేయించుకోవడానికి తప్ప ప్రస్తుతం ఈ కుల గణన దేనికీ ఉపయోగపడదు అన్నది కూడా అంతే వాస్తవం.
Written By
కృప
X : @MMR_JSP
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com