ఒక రాష్ట్రం అభివృద్ది వైపు అడుగులు వేయాలి అంటే ఆ రాష్ట్రాన్ని నడిపించే ప్రభుత్వం సమర్ధవంతమైనది అయి ఉండాలి. ప్రజలు ఎన్నుకుని అధికారం ఇచ్చారు అంటే ఆ ప్రభుత్వం ప్రజల అభీష్టాలకు అనుగుణంగా పని చేయాలి, ప్రజాహిత కార్యక్రమాలు, పథకాలు అనేవి అర్హులకు అందేలా చేస్తూ సంక్షేమం సాధించాలి. కోట్ల ప్రజల ఆకాంక్షలు, ఆశలు అడియాశలుగా మారి, విభజన జరిగి విడిపోయిన రాష్ట్రం వివిధ ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి. అవేమి పట్టని గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో పడిపోయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి పథంలో పయనించేందుకు అప్పులు చేయటం అవసరం. కానీ ఎందుకు రుణాలు తెస్తున్నామో, ఏం చేయాలో అవగాహన లేకుండా అనుచితంగా అసంబద్ధ నిర్ణయాలతో అందినవన్నీ అందుకొని లక్షల కోట్లలో అప్పులు చేస్తూ అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేయటం తప్పు.
ప్రభుత్వం నడిపే వ్యవస్థల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు, వృద్ధులకు, వితంతువులకు ఆసరా కోసం ఇచ్చే పెన్షన్ ల కోసం ప్రతి నెలా అప్పు తెచ్చి జీతాలు, పెన్షన్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితిలో, కనీసం గతంలో తెచ్చిన అప్పుల వడ్డీలు కట్టాలన్నా కూడా అప్పు తెచ్చి చెల్లించాల్సిన దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది నమ్మి తీరాల్సిన నిజం. చిల్లు పడిన కుండలో ఏం వేసినా ఉపయోగం ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు చేయడం అలవాటుగా కాదు తప్పని అత్యవసరంగా మారి పోయింది. ఖాళీ ఖజానా నింపే దారి లేదు, వ్యవసాయం పై శ్రద్ద లేదు, రైతుకి భరోసా లేదు, పరిశ్రమల స్థాపన లేకపోగా ఉన్నవి రాష్ట్రం నుండి తరలిపోతున్నా పట్టించుకొనే నాధుడు లేడు. మౌలిక సదుపాయాల కల్పన లేదు, రాజధాని లేదు. ఆదాయ మార్గాలు అసలే లేవు. అవకాశాలు అందుకునే ఆలోచన లేదు. పధకాల పేరుతో పంచటానికి అప్పుల కోసం కొత్త పథకాలు రచించటంలో తప్ప వేరే అభివృద్ధి కానరాదు. రాబడి లేని రాష్ర్టంలో గాడి తప్పిన పాలన వల్ల కడగండ్ల పాలు కావటం తప్ప ఏమీ జరగలేదు, జరగదు. పోనీ కేంద్రం నుండి ఋణాలు తెచ్చుకోవాలి అంటే గతంలో తెచ్చిన అప్పుల లెక్కలు చెప్పాలి. ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలి ఏమి చేయని అభివృద్ధి గురించి ఎలా చెప్పాలి అనేది అతి పెద్ద సమస్య. నిబంధనలకు నీళ్లు వదిలి కేంద్రం నుంచి ఋణాలు తెచ్చుకునే అవకాశం వదులుకొని, ఇచ్చే అప్పుపై కోత విధింపును అదనంగా అందుకున్న ఘన చరిత మన రాష్ట్రానిది.
పద్దతి, పరిమితి, నిర్వహణ, క్రమశిక్షణ లేని అప్పులు రాష్ర్ట ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అనేది అక్షర సత్యం. వీటికి తోడు కరోనా, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీరని నష్టం అభివృద్ధి అనే పదానికి అందనంత దూరంలో మన రాష్ట్రం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి ఎన్నో మార్గాలు అన్వేషించాల్సిన ప్రభుత్వం రుణాలు పొందటానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ప్రభుత్వం వెతుకుతూనే ఉంది. సెక్యూరిటీ బాండ్ల అమ్మకం, పన్నులు, వివిధ కార్పోరేషన్ ల పేరున ఋణాలు తేవడం, ఆస్తులు తాకట్టు పెట్టటం, అమ్మకాలు చేపట్టటం, రకరకాల పన్నులు వేయటం రుణం దొరికే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు కేవలం ప్రతి నెల జీతభత్యాలు, పెన్షన్, వడ్డీలు చెల్లించటానికే 9 వేల కోట్ల రూపాయలు కావాలి. ఇవి కాక పరిపాలన కోసం, పథకాల కోసం, వివిధ వ్యవస్థలు నడిపించడానికి ఎంత ఆర్ధిక అవసరతలు ఉంటాయి ఎంత ఋణ భారం ప్రతి నెలా వచ్చి అప్పుల ఖాతాలో చేరుతుందో ఊహించలేము.
ఆదాయం ఉంటే ఖర్చు చేయాలి ఇది ప్రాథమిక సూత్రం మనకు ఆదాయం అంతంత మాత్రమే అవసరాలు అనంతం. అప్పులు చేసి పథకాలంటూ పంచుకుంటూ పోతే ప్రతి నెలా అప్పులు చేస్తూ ఇంకో రెండున్నర ఏళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారో, లక్షల కోట్లల్లో అప్పులు తెచ్చి వందల కోట్లల్లో వడ్డీలు చెల్లించటం అదీ అప్పు చేసి చెల్లించటం పాలన కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ర్టఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తమై, అగమ్యగోచరంగా మారిపోవడం, సంక్షేమ పథకాలు మన రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టటం ఖాయం.
#Written By
– టీమ్ నారీస్వరం