గుంటూరు ( జనస్వరం ) : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ ప్రజల్లో ఉద్యమాగ్ని రగిలించి విశాఖ ఉక్కును సాధించిన కీర్తిశేషులు తమనంపల్లి అమృతరావు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయాడని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. శనివారం అమృతరావు జయంతి సందర్భంగా రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల మానస పుత్రిక అని దానిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవటమే అమృతరావుకి మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గుంటూరు నడిబొడ్డులో కోట్లాది రూపాయల విలువచేసే తన యావదాస్తిని పేదలకు పంచిన మహనీయుడు అమృతరావు అని నేరేళ్ళ సురేష్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, గుర్రాల ఉమ, పులిగడ్డ గోపి, వడ్డె సుబ్బారావు, మల్లి తదితరులు పాల్గొన్నారు.