ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి : పవన్ కళ్యాణ్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అనే ఆలోచనను రూపొందించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దేశీయ ఉత్పత్తులను వాడటం, ప్రోత్సహించడం ద్వారా మన ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ పై ప్రజలలో అవగాహన కల్పించి, వారిని భాగస్వాములను చేసేందుకు జనసేన, భారతీయ జనతా పార్టీలు సంయుక్తంగా ఈ వినాయక చవితి నుంచి కార్యక్రమాలు చేపడతాయని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణం ఏమిటంటే మన దేశంలో ఏ పనైనా ప్రారంభించినప్పుడు విజయం కలగాలని విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి మొదలు పెడతాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వినాయక చవితి పర్వదినాన్ని ఎంచుకున్నాం. మన పండగల్లో, సంప్రదాయ కార్యక్రమాల్లో మనకి తెలియకుండానే విదేశీ వస్తువులు చేరిపోతున్నాయి. విదేశాల్లో తయారైన దేవతామూర్తుల విగ్రహాలు, పూజా ద్రవ్యాలు, పూజా సామగ్రిలు ఉపయోగిస్తున్నాం. తద్వారా ఆ దేశ అభివృద్ధికి తమకు తెలియకుండానే తోడ్పడుతున్నాం. ఈ వినాయక చవితికి మనం ఏదీ కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా..? లేక విదేశీ ఉత్పత్తా అని చూడాల్సిన అవసరం ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించినది కాదు. దేశ ప్రజలందరికీ సంబంధించింది. దేశ అభివృద్ధికి సంబంధించింది. మన దేశీయ వస్తువులు కొంటే మన దేశ ఉత్పత్తిదారులకు ఉపయోగపడుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ అంటే – మన ఉత్పత్తి … మన ఉపాధి … మన అభివృద్ధి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అని జనసేనాని పేర్కొన్నారు.